Vijayashanti: అవును.. ఫైర్‌బ్రాండ్ విజయశాంతి అలియాస్ రాములమ్మకు (Ramulamma) మంత్రి పదవి ఫిక్స్ అయినట్టే? ఇక మిగిలింది అధికారిక ప్రకటన మాత్రమేనా? ఒకట్రెండు రోజుల్లో ప్రకటన కూడా రానుందా? అంటే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇంతకీ రాములమ్మకే ఎందుకు ఇవ్వాలని హైకమాండ్ భావించింది? ఏయే కారణాలతో, ఏయే సమీకరణలతో విజయశాంతికి ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించింది? అనే విషయాలు ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
15 నిమిషాల భేటీతో క్లారిటీ!
వాస్తవానికి రాములమ్మకు మంత్రి పక్కా అని పలుమార్లు ‘స్వేచ్ఛ’లో సంచలన కథనాలు వచ్చాయి. ఎందుకు ఇవ్వబోతున్నారనే విషయాలను కూడా విశ్లేషిస్తూ కూడా కథనాలు ప్రచురించింది. ఇప్పటికే ఢిల్లీ హైకమాండ్‌కు పంపిన కేబినెట్ విస్తరణ జాబితాలో కూడా విజయశాంతి పేరు పక్కాగా ఉన్నది కూడా.! ఈ జాబితాను అగ్రనేతలు ఫైనల్ చేస్తే, అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆదివారం నాడు ఎమ్మెల్యే క్వాటర్స్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జీ మీనాక్షి నటరాజన్‌తో 15 నిమిషాల పాటు రాములమ్మ భేటీ అయ్యారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్నది. సమావేశంలో కేబినెట్‌లో చోటు కల్పించాలని ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతిలు మీనాక్షిని కోరారు. తనకు దళిత కోటాలో ఇవ్వాలని అద్దంకి, బీసీ కోటాలో ఇవ్వాలని రాములమ్మ కోరినట్లుగా తెలిసింది. మరోవైపు అందుబాటులో ఉన్న ఎంపీలతో, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులతో మీనాక్షి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎంపీ చామల కిరణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్, నీలం మధు, ఆత్రం సుగుణలు భేటీ కాగా, వీరితో సుమారు గంటపాటు పలు కీలక విషయాలపై మేడమ్ చర్చించారు. అయితే రాములమ్మతో 15 నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ కావడంతో మంత్రి పదవిపై క్లారిటీ వచ్చేసినట్లేనని ప్రచారం జరుగుతోంది. అది కూడా సొంత పార్టీలోనే కావడం గమనార్హం. కాగా, మీనాక్షితో కొన్నేళ్లుగా విజయశాంతికి పరిచయాలు ఉన్నాయి. ఇరువురూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా.
ఎవరి ఆశలు వారివే..!
మీనాక్షితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాములమ్మ.. సరైన సమయంలో పదవులు వస్తాయని తెలిపారు. ‘ పదవులు ఎవరికి ఇవ్వాలో అధిష్ఠానానికి తెలుసు. గత కమిటీల్లో నా పేరు లేకపోతే..
మరో కమిటీలో అవకాశం ఉంటుందేమో?’ అన్నట్లు విజయశాంతి వెల్లడించారు. అయితే మంత్రి పదవిపై మాత్రం ఎక్కడా పెదవి విప్పలేదు. బహుశా ముందుగానే మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏముంది? అనుకున్నారేమో. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఓపెన్ అయ్యారు. ‘ అధిష్టానంపై నాకు నమ్మకం ఉంది. మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నాను. సుదర్శన్ రెడ్డి -రాజగోపాల్ రెడ్డిలో ఎవరికీ వరిస్తున్నదనేది అధిష్టానం చూసుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. బిడ్డ, కొడుకు, అల్లుడు కొట్లాటే సరిపోతోంది. కాళేశ్వరం విషయంలో కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు. కేటీఆర్‌ని వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి. పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. అంతా దోచుకుతున్నారు. కానీ, కాంగ్రెస్ వచ్చిన పది నెలలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నాం’ అని కోమటిరెడ్డి చెప్పారు.
Read Also- KTR: కేటీఆర్ దగ్గరున్న ‘లేడీ బ్యాగ్’ ఎవరిదబ్బా.. ఎక్కడో చూసినట్టే ఉందే!
బీఆర్ఎస్‌కు కౌంటర్ ప్లాన్!
బీఆర్ఎస్‌కు గట్టిగా కౌంటర్ ఇవ్వడానికి సోనియాగాంధీ పక్కా వ్యూహం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులంతా తమది ఉద్యమ పార్టీ.. కేసీఆర్‌ను మించిన ఉద్యమకారులెవరు..? చావు నోట్లో తలపెట్టి.. ఇలాంటి డైలాగులు వినిపిస్తున్న సమయంలో దీటుగా కౌంటర్ ఇవ్వడానికి విజయశాంతి ఎంపిక పర్‌ఫెక్ట్‌గా ఉంటుందనేది సోనియమ్మ అభిప్రాయం. మంత్రిని చేయడం ద్వారా అసెంబ్లీలోనూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావ్ తదితరులకు ఆమె ద్వారా గట్టిగా కౌంటర్ ఇవ్వవచ్చన్నది పార్టీ ఉద్దేశం. లేదంటే ఆమె కేవలం కౌన్సిల్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో దీర్ఘకాలం పనిచేసినా ఆమెకు అక్కడ సరైన గౌరవం, ప్రాతినిధ్యం దక్కలేదని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమెకు రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చిందని చెప్పుకోడానికి అవకాశం చిక్కుతుంది.
బీఆర్ఎస్ చేసిందేంటో..
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. తెచ్చింది బీఆర్ఎస్. పదేండ్ల తర్వాత కూడా అసెంబ్లీ వేదికగా ఇలాంటి చర్చలు జరుగుతున్న సమయంలో రాములమ్మను క్యాబినెట్‌లోకి తీసుకుంటే బీఆర్ఎస్‌లో ఉన్న పదేండ్ల కాలంలో ఏం జరిగింది..? కేసీఆర్ తీరు ఎలా ఉండేది..? ఆలె నరేంద్ర లాంటివారికి లభించిన గుర్తింపేంటి..? ఉద్యమం తర్వాత కోదండరాం లాంటివారికి అవమానాలు ఎందుకయ్యాయి..? ఉద్యమంలో కేసీఆర్ రోల్.. ఇలాంటివన్నీ వెల్లడించడానికి అవకాశం ఉంటుంది. గులాబీ నేతలకు ఆమె ద్వారా గట్టి కౌంటర్ ఇప్పించొచ్చనేది కాంగ్రెస్ హైకమాండ్ భావన. ఇప్పటికే ఆమెకు ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉన్నది. దీంతో పాటు కేటీఆర్, కవిత ఉద్యమంలోకి రావడానికి ముందే విజయశాంతి ఎంటర్ అయ్యారు. వారందరికీ ఆమె సీనియర్ కావడంతో ఏది మాట్లాడాలన్నా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పటి పరిణామాలను బహిర్గతం చేస్తే గులాబీ లీడర్లు ఆత్మరక్షణలో పడతారనేది కూడా కాంగ్రెస్ హైకమాండ్ భావన.
Read Also- Covid 19: చాపకింద నీరులా కమ్మేస్తున్న కరోనా.. లాక్‌డౌన్ తప్పదా?
వారిని కట్టడి చేసేందుకు!
ఉద్యమం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటూ వారిని విజయశాంతి తనదైన శైలిలో కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుంది. బీజేపీలో ఉన్నప్పుడూ ఆమె తెలంగాణ వాదాన్ని వినిపించారు. పార్టీ విధానపరంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై క్లారిటీ ఇవ్వని రోజుల్లోనే విజయశాంతి ఓపెన్‌గా మాట్లాడేవారు. తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్ కోసం ‘తల్లి తెలంగాణ’ పేరుతో సొంత పార్టీనే పెట్టుకున్నారు. ఉద్యమం సమయంలో టీఆర్ఎస్‌లో విలీనం చేసిన విజయశాంతి కేసీఆర్‌తో కలిసి నడిచారు. తెలంగాణ ఏర్పాటు బిల్లు పార్లమెంటుకు వచ్చిన టైమ్‌లో ఆమె ఎంపీగానే ఉన్నారు. 2004 మొదలు 2014 వరకు తెలంగాణ ఉద్యమం, అందులో కేసీఆర్ పాత్ర, బీఆర్ఎస్ లక్ష్యం, పార్టీలో అంతర్గతంగా ఏం జరిగింది, ఆలె నరేంద్రలాంటివారికి ఎలాంటి గౌరవం దక్కింది, బీఆర్ఎస్ నుంచి ఆమె ఎందుకు బైటకు రావాల్సి వచ్చింది.. ఇవన్నీ సందర్భం వచ్చినప్పుడు వెల్లడిస్తే అది కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు లాంటి లీడర్లకే ఇబ్బందికరంగా మారుతుంది.
మంత్రిని చేస్తే పార్టీకి మైలేజ్!
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే సోనియాగాంధీ స్వయంగా చొరవ తీసుకుని ఆమెను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేలా ఏఐసీసీ ద్వారా పీసీసీకి చెప్పినట్లు సమాచారం. అన్ని విధాలుగానూ ఆమెను మంత్రిని చేయడం ద్వారా పార్టీకి మైలేజ్ వస్తుందని, ఏక కాలంలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులకు గట్టిగా కౌంటర్ ఇప్పింవచ్చన్నది సోనియాగాంధీ అభిప్రాయమని ఏఐసీసీ వర్గాల ద్వారా తెలిసింది. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా రెండు మూడు రోజుల్లో సోనియాగాంధీని కలిసే అవకాశమున్నది. చివరి నిమిషం వరకూ ఆమె పేరు తెరమీదకు రాకపోయినా అనూహ్యంగా అభ్యర్థిగా ఖరారు కావడంతో హైకమాండ్ సెలక్షనే అనే చర్చలు గాంధీభవన్‌లో జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను మంత్రిని చేయడం ద్వారా మున్ముందు పరిణామాలు భిన్నంగా ఉంటాయని, కీలకమైన శాఖనే ఆమెకు అప్పగించే అవకాశమున్నదనేది పార్టీ కేంద్ర వర్గాల సమాచారం. మంత్రివర్గ విస్తరణ సమయానికి సస్పెన్స్ వీడనున్నది.
Read Also- Kavitha: నిన్న కేసీఆర్‌కు, ఇవాళ సీఎంకు కవిత లేఖ.. ఊపిరి పీల్చుకున్న బీఆర్ఎస్!