BV Raghavulu: విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు (BV Raghavulu) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రైవేటీకరణతో కేవలం అదానీ వంటి సంస్థలకే లాభం చేకూరుతుందని, కానీ ప్రజలు, రైతులు, వినియోగదారులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యురాలు టి. జ్యోతితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే విద్యుత్ సవరణ చట్టం దేశానికే ప్రమాదకరమని, దీని అమలుతో ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యుత్ సబ్సిడీలు రద్దయ్యే అవకాశముందని రాఘవులు హెచ్చరించారు.
Also Read:CPI: సీపీఐ వందేళ్ల ముగింపు ఉత్సవాలు ఆ జిల్లాలోనే?: పల్లా వెంకటరెడ్డి
విద్యుత్ రంగమంతా ప్రైవేటీకరణ అవుతుంది
ఈ సవరణలు అమల్లోకి వస్తే విద్యుత్ రంగమంతా ప్రైవేటీకరణ అవుతుందని, వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం పెరుగుతుందని, ఈఆర్‌సీలు రబ్బర్ స్టాంపులుగా మారిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. 2021, 2022లో విద్యుత్ చట్టానికి సవరణలను ప్రతిపాదిస్తే తీవ్ర ప్రతిఘటనతో వెనక్కి తగ్గిందని, కానీ మళ్లీ పాత అంశాలతో పాటు కొత్తవి జోడించి దుర్మార్గంగా, ప్రమాదకరంగా రూపొందించిందని విమర్శించారు. విద్యుత్ సవరణలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలని రాఘవులు పిలుపునిచ్చారు. విద్యుత్ రంగం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని డిమాండ్ చేశారు.
న్యాయపోరాటంతోపాటు కేంద్రంపై ఒత్తిడి
సీపీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ కాకుండా కొత్త డిస్కం ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, కేంద్రం కుట్రలో భాగం కావొద్దని కోరారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి నిధులు రావడం లేదన్నారు. న్యాయపోరాటంతోపాటు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తేవాలి
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలోని కేంద్ర మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తేవాలని, లేదంటే ఆ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. అలాగే, ఆర్‌ఆర్‌ఆర్ నిర్వాసితులకు సంబంధించి రైతుల ఆమోదం లేకుండా భూమిని తీసుకోవద్దని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ఆయన కోరారు.
