Telangana Politics: స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతకాలం వ్యతిరేక వర్గాలను పట్టించుకోని నియోజకవర్గ కాంగ్రెస్ నేతలకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్‌చార్జీలకు స్థానిక సంస్థల ఎన్నికలు ఇజ్జత్‌కా సవాల్ అన్న చందంగా మారాయి. అసలే కాంగ్రెస్‌కు బలమైన ప్రత్యర్థులుగా దూసుకుపోతున్న బీఆర్ఎస్(BRS) పార్టీతో ఈ ఎన్నికల్లో ఎలా తలపడాల్లో అంతుచిక్కుకుండా ఉన్న నేతలకు ఇప్పుడు పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, వ్యతిరేక వర్గాల జోరుతో బేజారు అవుతున్నారు. ఇంతకాలం బెట్టు మీద ఉన్న నేతలు ఇప్పుడు వ్యతిరేక వర్గాలను ఎలా ప్రసన్నం చేసుకోవాలో అంతు చిక్కని వ్వవహారంగా మారింది. అసమ్మతి పోరుతో వేగలేక ఇంతకాలం మౌనంగా ఉన్న నేతలు ఇప్పుడు తప్పని పరిస్తితుల్లో వారితో మాట్లాడాల్సిన దుస్తితి నెలకొంది. ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది. కాకుంటే జనగామ జిల్లాలోని జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంటిపోరు ఇంతింత కాదు.
అంతర్గత పోరు అధికం ఇక్కడే..
ప్రదానంగా చెప్పాలంటే జనగామ(Janagama), స్టేషన్ ఘన్‌పూర్(Station Ghanpur), పాలకుర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గాల్లో ఒక్కో నేతలది ఒక్కో తీరు. ఈ తీరుతో స్థానిక సమరం రంజుగా మారిందని చెప్పవచ్చు. ఇందులో జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇంచార్జీగా ఉన్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి జనగామ డిసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు జనగామ నియోజకవర్గం జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి హావా కొనసాగుతుందని కాంగ్రెస్ శ్రేణులు అందరు అనుకున్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కన్నా ఎక్కువగా రాజకీయం చేసి కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉంటాడని భావించినప్పటికి అది వాస్తవంలోకి వస్తే అంతా డొల్లగానే ఉంది. ఇక్కడ అంతా ప్రతిపక్ష ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హవానే కనిపిస్తుంది. కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పాత చేర్యాల నియోజకవర్గం దాటి రావడం లేదని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో జనగామలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, అప్పటి డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి, ఇప్పుడు అయిల్‌పెడ్ చైర్మన్‌గా ఉన్న జంగా రాఘవరెడ్డి వర్గం, సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కొమ్మూరిపై గుస్సాతో ఉన్నారు.
జనగామ నియోజకవర్గంలో..
కొమ్మూరి సీనియర్ నాయకులను ఏనాడు పట్టించుకోలేదని అందుకే తాము కొమ్మూరికి దూరంగా ఉంటున్నామని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో పీసీసీ మాజీ కార్యదర్శి చెంచారపు శ్రీనివాసరెడ్డి, జనగామ మున్నిపల్ వైస్ చైర్మన్ కంచే రాములు, జనగామ మార్కెట్ మాజీ చైర్మన్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, సీనియర్ నాయకుడు వేమళ్ల సత్యనారాయణ, ఆలేటీ సిద్దిరాములు, చేర్యాలకు చెందిన బాల్‌రెడ్డి, ముస్త్యాల కిష్టయ్య, ఆడేపు చంద్రయ్యతో పాటు మరికొందరు నేతలు కొమ్మూరికి దూరంగా ఉంటున్నారు. ఇక చేర్యాలకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం కుమారుడు కిరణ్ గౌడ్(Kiran Goud) కూడా ఇప్పుడు కాంగ్రెస్‌తో తన వర్గంతో క్రీయాశీలకంగా పని చేస్తున్నారు. ఇలా జనగామ నియోజకవర్గంలో కొమ్మూరికి వ్యతిరేక పోరు తప్పడం లేదు. నిజం చెప్పాలంటే ఇది వ్యతిరేక వర్గం అనే కన్నా కొమ్మూరి వీరిని పట్టించుకోకపోవడం, పార్టీ నిర్మాణంలో భాగస్వాములను చేయకపోవడంతో వీరే దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు స్థానిక పోరు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కి ఆగ్నిపరీక్షే అని చెప్పక తప్పదు.
పంతంలో.. ఏ వర్గం అంతం
ఇక పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. ఇక్కడ పంతం, పట్టింపులతోనే రాజకీయాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్‌లో ఉన్న వర్గపోరు ఇప్పుడు ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రూపులు ఉన్నాయి. గత పదేళ్లుగా అధికారం లేక నానా యాతన పడిన కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులు అధికారం వచ్చాకా న్యాయం దొరకుతుందనే ఆశతో ఉంటే ఇప్పుడు ఈ వర్గాలతో ముందుకు సాగెదెలా అనే ఆందోళనలో ఉన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నప్పటికి కొందరు నేతలను పట్టించుకోకపోవడంతో వారు వేరు కుంపటి పెట్టుకుని తమ పని తాము చేసుకుంటున్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో బీ ఆర్ ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీని ఆఖండ మెజార్టీ సీట్లు సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు.
Also Read: Telangana BJP: టికెట్ల కేటాయింపులో పాత వర్సెస్ కొత్త పంచాయతీ.. కమలంలో ఇంటర్నల్ వార్!
మరో వైపు వర్గ పోరు..
ఈ మేరకు కాంగ్రెస్‌లో ఉన్న వైరి వర్గాలను, అసమ్మతి నేతలను మచ్చిక చేసుకుని వారిని బీ ఆర్ ఎస్‌లో చేర్చుకుంటూ బీ ఆర్ఎస్ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో చేసిన పొరపాట్లను చేయకుండా ఈ స్థానిక పోరులో ఎక్కువ స్థానాలు గెలిచి రాబోవు ఎన్నికలకు మరింత కొత్త శక్తితో ముందుకు సాగాలనుకుంటుకున్నారు ఓవైపు దయాకర్‌రావు కాంగ్రెస్‌కు స్థానిక సంస్థల్లో ఎక్కువ సీట్లు రాకుండా కట్టడి చేస్తుంటే, మరో వైపు వర్గ పోరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యాక్షురాలికి మింగుడు పడటం లేదు. ఝాన్సీరెడ్డి(Jhansi Reddy) పంతం పట్టారంటే ఎవ్వరి మాట వినరనే టాక్, స్థానిక పోరులో ఎన్ని వర్గాలున్నా విజయం మాదే అనే ధీమాలో ఝాన్సీరెడ్డి వర్గం ఉంది. ఇప్పుడు ఝాన్సీరెడ్డి, మామిడాల యశస్వినిరెడ్డి పంతంతో మరి ఏవర్గం అంతం అవుతుందో అనే చర్చ జోరుగా సాగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్‌లోని వైరి వర్గం సొంతంగా పోటీ చేసి గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా ఎంపికైన ఝాన్సీరెడ్డికి ఈ ఎన్నికలు కత్తి సాములాంటిదే అని చప్పక తప్పదు.
ఏ వర్గంది హవా..?
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఇప్పుడు ఒక విచిత్రమైన, వింత పరిస్థితి ఎదురైంది. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari), ఇన్‌చార్జీ సింగపురం ఇందిర వర్గాల ఆధిపత్య పోరులో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ ప్రభావం చూపనున్నాయి. ఈ రెండు వర్గాల్లో ఏ వర్గం నేతలకు పార్టీ టికెట్లు వస్తాయో అనే ఆందోళన పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇప్పుడు జనగామ జడ్పీ చైర్ పర్సన్ పదవి ఎస్సీ మహిళలకు కెటాయించారు. సింగపురం ఇందిరే జడ్పీ చైర్ పర్సన్ రేసులో ఉందనే టాక్ జిల్లా అంతటా ఉంది. ఆమే నిర్ణయం, ఆధిష్టాన నిర్ణయం తెలియనప్పటికి ఇప్పుడు ఇందిర పరిస్థతి ఏమిటి అనేది తేలడం లేదు. ఇందిరను నమ్ముకుని రాజకీయం చేస్తున్న నేతలు కడియం శ్రీహరి వర్గంతో కలిసిపోతారా.. లేకపోతే కడియం శ్రీహరి ఇందిరను పిలిచి ఐక్యంగా బీ ఆర్ ఎస్ ను ఓడించేందుకు కృషి చేస్తారా చూడాలి. కడియం శ్రీహరి రాజకీయ చతురతతో ఇందిరను ఒప్పించి, వర్గపోరు లేకుండా స్థానిక సమరంలో కలిసి పోతే నియోజకవర్గంలో బీ ఆర్ ఎస్‌కు చుక్కలే కనిపిస్తాయని రాజకీయ వర్గాల ఆలోచన. ఇక కడియం శ్రీహరికి మరో ఇంటిపోరు తప్పడం లేదు.
ఈ త్రిముఖ పోరులో స్థానిక సమరంలో ఎలా దూసుకుపోతారో వేచి చూడాలి. ఈ నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి నడుమ ఉప్పు నిప్పు అనే చందంగా రాజకీయం ఉంది. రాజయ్య స్థానిక పోరులో బీ ఆర్ ఎస్ సత్తా కడియం కు చూపించాలని పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్‌లోని వర్గ పోరు, బీ ఆర్ ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి ఎలా నెగ్గుకొస్తారో వేచి చూడాలి.
Alsom Read: MLAs Defection Case: ముగిసిన ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేన్.. తిరిగి మల్లీ ఈ నెల 24న విచారణ
