Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. రేపటి నుంచి పార్లమెంటు సెగ్మెంట్లలో మున్సిపాలిటీల వారీగా సన్నాహక సమావేశాలు పెట్టాలని ఈ సందర్భంగా రేవంత్ ఆదేశించారు. బలహీనంగా ఉన్న మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ లో చేరికలను ప్రోత్సహించాలని రేవంత్ దిశానిర్దేశం చేశారు.
మంత్రులకు కేటాయింపు ఇలా..
పార్లమెంట్ల వారీగా మంత్రులను కేటాయిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మల్కాజిగిరి సెగ్మెంట్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, చేవెళ్లకు శ్రీధర్ బాబు, కరీంనగర్ కు తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మంకు కొండా సురేఖ, మహబూబాబాద్ కు పొన్నం ప్రభాకర్ ను ఇంఛార్జులుగా నియమించారు. అలాగే జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ బాధ్యతను మంత్రి అజారుద్దీన్ కు అప్పగించారు. వివేక్ (మెదక్), వాకిటి శ్రీహరి (నాగర్ కర్నూల్), అడ్లూరి లక్ష్మణ్ (నల్గొండ), సీతక్క (భువనగిరి), ఉత్తమ్ కుమార్ రెడ్డి (నిజామాబాద్), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (వరంగల్), జూపల్లి కృష్ణారావు (పెద్దపల్లి), ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి (అదిలాబాద్) సైతం రేవంత్ సర్కార్ బాధ్యతలు అప్పగించింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి
రేపటి నుంచి పార్లమెంట్ సెగ్మెంట్లలో మున్సిపాలిటీల వారీగా సన్నాహక సమావేశాలు పెట్టాలని ఆదేశం
వీక్ గా ఉన్న మున్సిపాలిటీల్లో చేరికలను ప్రోత్సహించాలని సూచన
1. మల్కాజిగిరి -… pic.twitter.com/fb0s9Jsufc
— BIG TV Breaking News (@bigtvtelugu) January 19, 2026
90 శాతం సీట్లు గెలుపొందేలా..!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రులకు ఇన్ ఛార్జులకు బాధ్యతలు అప్పగించడం సర్వ సాధారణమే. అయితే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. 15 మంత్రులకు బాధ్యతలు కేటాయించడం వెనుక రేవంత్ వ్యూహామున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో 66 శాతం సీట్లతో మాత్రమే కాంగ్రెస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి 90 శాతానికి పైగా సర్పంచ్ స్థానాల్లో తమ మద్దతు దారులు గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ భావించింది. గ్రామస్థాయిలో ఉన్న గొడవలు, నేతలు – శ్రేణుల మధ్య సమన్వయ లోపం, కొన్ని వ్యూహాత్మక తప్పిదాల కారణంగా అది సాధ్యపడలేదు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి తప్పు జరగకూడదని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నేరుగా మంత్రులను రంగంలోకి దించి.. మున్నిపల్ ఎన్నికల్లోనైనా 90 శాతం సీట్లు గెలుపొందేలా మంత్రులకు లక్ష్యాలు నిర్దేశించినట్లు సమాచారం.
Also Read: Kavitha – PK Alliance: కవిత కొత్త పార్టీ.. రంగంలోకి రాజకీయ వ్యూహాకర్త పీకే.. వర్కౌట్ అయ్యేనా?
ఇంఛార్జులుగా మంత్రుల బాధ్యతలు..!
సీఎం రేవంత్ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి మంత్రికి పార్లమెంటు పరిధిలోని 2 లేదు 3 అసెంబ్లీలో గల మున్సిపల్ బాడీ బాధ్యతలు అప్పగించబడ్డాయి. దీంతో ఆయా మంత్రులు తమ సొంత నియోజకవర్గాలతో పాటు కేటాయించిన ప్రాంతాల్లో పార్టీ పనితీరును పర్యవేక్షించనున్నారు. స్థానికంగా ఉన్న రెబల్స్ ను గుర్తించి వారిని సముదాయించడం, స్థానిక కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించి ఐకమత్యంతో పనిచేసేలా మంత్రులు కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ కు బలమైన స్థానాల్లో మరింత శ్రద్ధ పెట్టి.. అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యూహాలను మంత్రులు రచించాల్సి ఉంటుంది. ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూడటం, స్థానిక అవసరాలను గుర్తించి ప్రభుత్వం తరపున హామీలు ఇవ్వడం ద్వారా ప్రతీ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకునేలా మంత్రులు కసరత్తు చేయనున్నారు. పార్లమెంటు సెగ్మెంట్ లోని మున్సిపాలిటీల గెలుపోటముల బాధ్యత పూర్తిగా మంత్రులకే అప్పగించడం ద్వారా మరింత శ్రద్ధతో వారు పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.

