Ramchander Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ చేపట్టిన కార్పెట్ బాంబింగ్ ప్రచారానికి భయపడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారానికి దిగారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ (Ramchander Rao) రావు పేర్కొన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీకి మధ్యనే పోటీ అని నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ కు అభ్యర్థులు లేరు కాబట్టే ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టారని వ్యాఖ్యానించారు. నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని తాను చెప్పనని, కానీ బైండోవర్ కేసులున్న రౌడీ షీటర్ గెలవాలా? ప్రజల్లో ఉండే క్యాండిడేట్ గెలవాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలని తెలిపారు. జాతీయ పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేడర్ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
బీజేపీ గెలిచేందుకు మంచి అవకాశాలు
అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరముందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలిచేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని, పూర్తి విశ్వాసంతో ముందుకెళ్లి బీజపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ‘మోంథా’ తుఫాన్ ప్రభావితులకు సహాయం అందించాలని రాంచందర్ రావు నాయకులు, కార్యకర్తలను కోరారు.
వరద ప్రభావిత ప్రజలకు సహాయం
ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మోంథా తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వరద ప్రభావిత ప్రజలకు సహాయంతో పాటు ఉపశమన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలకు అండగా నిలబడాలని, ముఖ్యంగా పేదలు, రైతులు, దినసరి కూలీలు వంటి జీవనోపాధి కోల్పోయిన వారికి తక్షణ సహాయం చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యకర్తలు స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు, స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకుని ఆహారం, పునరావాసం, వైద్యసాయం అందించాలని కోరారు.
Also Read: Ramchander Rao: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి.. రాంచందర్ రావు కీలక వాఖ్యలు
