Ramchander Rao: రాష్ట్రంలో త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలకు గాను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు, మాజీ పదాధికారులంతా జెడ్పీటీసీ ఇన్ చార్జీలుగా, జిల్లా ఇన్ చార్జీలుగా పనిచేయాలని నిర్ణయించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) తెలిపారు. నేతలందరూ సమష్టి కృషితో పనిచేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని ఆయన పిలుపునిచ్చారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల అత్యవసర సమావేశం జరిగింది. లోకల్ బాడీ ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపిక విషయంపై కీలక చర్చ జరిగింది.ఈ ఎన్నికల్లో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.
గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలి
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సమాయత్తమవ్వాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజాసమస్యల పరిష్కారం, ప్రత్యేకంగా గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన అంశాలను, అదేవిధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను, మోసాలను ప్రజలకు తెలియజెప్పేలా ప్రచారం చేయడంపై దృష్టిసారించాలని తెలిపారు.
శ్రమించి పనిచేసిన వారందరికీ సమాన ప్రాధాన్యత
బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో 22 నెలలుగా కాంగ్రెస్ సర్కార్ చేసిన కుట్రలు, నాటకాలను, స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా గ్రామీణ పాలనను నిర్వీర్యం చేసిన విషయాలను స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలని వివరించారు. పాత, కొత్త నాయకులు అనే భేదం లేకుండా పార్టీ కోసం శ్రమించి పనిచేసిన వారందరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చి పార్టీ శ్రేణులను మోటివేట్ చేయాలని ఈ మీటింగ్ లో దిశానిర్దేశం చేశారు. ఎక్కువ శాతం జెడ్పిటీసీలు బీజేపీ కైవసం చేసుకోవడానికి ప్రత్యేక వ్యూహాలు రూపొందించనున్నట్లు తెలిపారు.
8వ తేదీన మరో విస్తృత స్థాయి సమావేశం
ఈనెల 8వ తేదీన మరో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, ఇన్ చార్జీలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో చర్చించి ఎన్నికలకు పూర్తిస్థాయిలో సమాయత్తమవ్వడంపై సలహాలు, సూచనలు తీసుకుని అందుకు అనుగునంగా వ్యూహంతో ముందుకు వెళ్తామన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థుల ఎంపిక, కమిటీలు ఏర్పాట్లపై సూచనలు తీసుకున్నారని వివరించారు. జిల్లా ఇన్ చార్జీలు కూడా కమిటీలు ఏర్పాటుచేసి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి కార్యక్రమాలు చేపట్టి ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
బై ఎలక్షన్ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ బైఎలక్షన్ దృష్ట్యా ప్రత్యేక ఎజెండా రూపకల్పన చేయనున్నట్లు రాంచందర్ రావు తెలిపారు. నగర ప్రాంతాల్లో నాయకులు కూడా పూర్తిగా పాల్గొనాలని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అభ్యర్థి ఎంపిక, అభిప్రాయ సేకరణ చేపడుతున్నామని, త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన స్పష్టంచేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేఎల్పీ నేతల ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, బీజేపీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సహ ఇన్ చార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు.
Also Read: Kantara 1 collection: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘కాంతారా చాప్టర్ 1’ వసూళ్లు.. మూడోరోజు ఎంతంటే..
