BRS Party: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో గులాబీ క్యాడర్ నైరాశ్యానికి గురైంది. గత రెండేళ్లుగా పార్టీలో స్తబ్దత నెలకొన్నది. ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 4 వేలకు పైగా గ్రామ పంచాయతీలో గులాబీ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు విజయం సాధించడంతో గ్రామాల్లోని క్యాడర్‌లో జోష్ పెరిగింది. అయితే, వీరంతా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపకుండా ఉండేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. సన్మాన కార్యక్రమాలతో వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నది. వారిని కట్టడి చేసే చర్యలు తీసుకుంటున్నది. అధికారంలో ఉన్న పార్టీలోకి వెళితే నిధులు వస్తాయని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆలోచన చేయకుండా కట్టడికి చర్యలు చేపట్టింది. అంతేకాదు, వారు పార్టీ వీడితే మళ్లీ క్యాడర్‌లో నిరా అలుముకోకుండా చూస్తున్నది. తాము అండగా ఉంటామని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని,నిధులు ఇస్తామని ఆందోళన చెందవద్దని, అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చేసుకుందామని, కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాల్సిందేనని కేటీఆర్, హరీశ్ రావు వారికి నూరిపోస్తున్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. వైఫల్యాలను ఎత్తి చూపాలని పిలుపునిస్తున్నారు.
చేజారిపోకుండా భయపెడుతున్న పార్టీ పెద్దలు
ఒకవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు, మరోవైపు మున్సిపల్ ఎన్నికలు. ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్‌ను సన్నద్ధం చేసే పనిలో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నారు. ప్రభుత్వంపై ఏ మేరకు వ్యతిరేకత ఉన్నదనేది సర్పంచ్ ఎన్నికల్లో స్పష్టమైందని, గెలుపొందిన వారు కాంగ్రెస్ పార్టీలోకి వెళితే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని భయపెడుతున్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయలేదని ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, వారికి పాలన చేయడం చేతకావడం లేదని ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మారితే ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు, గ్రామాల్లో పార్టీకి పట్టు సడలకుండా, గెలిచినవారు పార్టీ మారకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఏమైనా ఇబ్బందులు గురి చేస్తే నేరుగా తమను కలవవచ్చని, ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో మీ ముందు ఉంటామని హామీలు ఇస్తున్నారు.
జిల్లాల బాట అందుకేనా?
మరోవైపు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు నిత్యం ప్రజల్లో ఉండేలా పార్టీ ప్లాన్ ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం చేసే అంశాలపైనే నిత్యం అధ్యయనం చేస్తూ, వాటిపై విమర్శనాస్త్రాలు అందిస్తున్నారు. మౌలిక సమస్యలు, రైతు, ఉద్యోగ, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల సమస్యలపై స్పందించేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయాలని, ప్రభుత్వం జారీ చేసే జీవోలు తదితర అంశాలపై వివరాలతో ప్రజలకు తెలియజేసినందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి అంశాన్ని వివరించాలని భావిస్తున్నారు. దీంతో నిత్యం బీఆర్ఎస్ పార్టీపై చర్చ జరగాలని అప్పుడే ప్రజల్లో బలమైన శక్తిగా ఎదుగుతామని పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఏదైనా జిల్లాకు వెళ్లినా అక్కడి ఇరిగేషన్ అంశాలపైన ప్రస్తావించాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడేళ్లు గడువు ఉండడంతో ఇప్పటి నుండే ఆ ఎన్నికలకు గ్రౌండ్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. అందుకే త్వరలో జరగబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి నేతల్లో కాన్ఫిడెన్స్ పెంచాలని పార్టీ భావిస్తున్నది. అందుకు అనుగుణంగానే జిల్లాల బాట పట్టింది.
Also Read: BRS Party: కాంగ్రెస్ దూకుడుతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి.. గులాబీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం!

