BRS Srinivas Goud: కల్తీ కల్లును ఎవరు ప్రోత్సహిస్తున్నారో ప్రభుత్వం తేల్చాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud) తీవ్రంగా డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కులవృత్తులను కాపాడుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కులవృత్తిపై దృష్టి సారించడం లేదని, ఆదాయం వచ్చే కులవృత్తులను నాశనం చేయాలని చూస్తుందని ఆరోపించారు. గీత కార్మికులకు 5 ఎకరాల పొలం ఇస్తామని, చెట్లపై నుంచి పడి చనిపోతే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud) గుర్తు చేశారు.
Also Read: BRS KTR: నేతలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ఆదేశాలు
కల్తీ కల్లును ప్రోత్సహించే కుట్ర
అయితే, లిక్కర్ మాఫియాకు తలొగ్గి కల్లుగీత వృత్తిని బంద్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) భావిస్తుందని అన్నారు. ఓఆర్ఆర్ లోపల కల్లుపై నిషేధం విధించాలని చూస్తున్నారని, ఇది కల్తీ కల్లును ప్రోత్సహించే కుట్రలో భాగమేనని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్టీఆర్ మద్యనిషేధం సమయంలో కూడా కల్లును నిషేధించలేదని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు రావడంలేదా అని నిలదీశారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్ గౌడ్ మాట్లాడుతూ.. కల్లు మండువాలు, కల్లుగీత కార్మికుల జోలికి వస్తే రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు గట్టు రాంచందర్ రావు, నాగేందర్ గౌడ్ కూడా పాల్గొన్నారు.
Also Read: Anil Murder Case: అనిల్ హత్యకు అదే కారణం.. సంచలన విషయాలు వెలుగులోకి!