MLC Phone Hacking: మరోసారి పొలిటికల్ వర్గాల్లో ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. హ్యాకింగ్, ట్యాపింగ్ అంటే చాలు తెలంగాణ ప్రజాప్రతినిధులు ఉలిక్కిపడుతున్న పరిస్థితి ఉన్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఫోన్ హ్యాక్ కావడంతో ఒక్కసారి కలకలం రేగింది. దీంతో తన వ్యక్తిగత, అధికారిక సమాచార భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన ఫోన్ హ్యాకింగ్‌పై దుండిగల్ పోలీస్ స్టేషన్‌తో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తన పేరిట ఎవరైనా కాల్స్ చేస్తే, వాటిని నమ్మొద్దని ప్రజలకు ఎమ్మెల్సీ విజ్ఞప్తి చేశారు.
Also Read: Android Vs iPhone: ఐఫోన్ యూజర్లు షాక్‌కు గురయ్యే విషయాన్ని వెల్లడించిన గూగుల్
అసలేం జరిగింది?
నవంబర్ 5న ఎమ్మెల్సీ ఇచ్చిన ఫిర్యాదులో గత కొన్ని రోజులుగా తెలుగు భాషలో ముఖ్యమైన నెట్‌వర్క్ ప్రొవైడర్ సందేశం అంటూ పాప్ అప్‌లు వస్తున్నాయని వివరించారు. ఇవి అనధికారిక మూలాల నుంచి వచ్చినవని, ఫోన్‌పై రిమోట్ యాక్సెస్ పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘నా ఫోన్‌లో వ్యక్తిగత, అధికారిక, రాజకీయ సమాచారం, కమ్యూనికేషన్లు, రికార్డులు ఉన్నాయి. ఇది నా గోప్యత, వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగిస్తున్నది’ అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని, ఈ హ్యాకింగ్ ప్రయత్నాలు డేటా దుర్వినియోగం, మానిటరింగ్ లేదా చట్టవిరుద్ధ ఉద్దేశాలకు దారితీస్తాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తక్షణ సైబర్ ఫోరెన్సిక్ దర్యాప్తు ప్రారంభించాలని పోలీసులను కోరారు. హ్యాకింగ్ ప్రయత్నాలకు బాధ్యులైన వ్యక్తులు లేదా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజా ప్రతినిధుల డిజిటల్ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇలా చేయండి
ఫోన్ హ్యాకింగ్ అనేది ఎవరు చేశారు? బగ్‌లు పంపించి ఇలా చేయడం సైబర్ నేరగాళ్ల పనా? లేకుంటే ఫోన్ హ్యాకింగ్ లేదా ట్యాపింగ్ చేసేందుకు ప్రైవేట్ ఏజెన్సీలు ఇలా చేస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు, నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఐఫోన్ విషయానికొస్తే ఒక్కోసారి వచ్చే నోటిఫికేషన్లతో ఫోన్ హ్యాక్ అవుతుందని తెలుస్తున్నది. సామాన్యుడు మొదలుకుని ప్రజాప్రతినిధుల వరకూ ఎవరి ఫోన్లు అయినా, బగ్స్ పంపి హ్యాక్ చేసే ప్రయత్నం చేసినా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలాంటి నోటిఫికేషన్లు వస్తే క్లిక్ చేయొద్దని, అస్సలు ఎంకరేజ్ చేయొద్దని నిపుణులు చెబుతున్నారు.
అప్లికేషన్‌లను ఎప్పటికప్పుడు సరికొత్తగా అప్డేట్
మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్, వాడుకలో ఉన్న అన్ని అప్లికేషన్‌లను ఎప్పటికప్పుడు సరికొత్తగా అప్డేట్ చేస్తూ ఉంచాలి. ముఖ్యంగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలు లేదా ఈ మెయిళ్లలోని అనుమానాస్పద లింకులను, బొమ్మలను తెరవకండి. అన్నింటికీ కష్టమైన పాస్‌వర్డులను, రెండు దశల ధృవీకరణ పద్ధతులను వాడి ఫోన్స్, బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడుకోవచ్చు. పొరపాటున తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్స్ క్లిక్ చేస్తే మాత్రం డేటా, మెసేజులు, వ్యక్తిగత సమాచారం, కాంటాక్స్ అన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. సింపుల్‌గా చెప్పాలంటే మన జుట్టు వాళ్ల చేతుల్లో ఉన్నట్లే. వాళ్లు డబ్బులు పంపమన్నా, ఏం చేయమన్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే సైబర్ నేరగాళ్లతో పాటు ప్రైవేట్ ఏజెన్సీల మాయలో పడకుండా అప్రమత్తంగా ఉండాలి.
Also Read: Apple iPhones: ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త.. ఒక బ్యాడ్ న్యూస్ కూడా..
