Android Vs iPhone: సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో టెక్ దిగ్గజం గూగుల్ ఆసక్తికరమైన రిపోర్టును (Android Vs iPhone) విడుదల చేసింది. సైబర్‌సెక్యూరిటీ అవగాహనా నెల ముగింపు సందర్భంగా, అత్యంత ప్రమాదకరమైన మొబైల్ స్కామ్‌ల నుంచి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ టూల్స్ ఎంత సమర్థవంతంగా యూజర్లను కాపాడుతున్నాయో వెల్లడించే రిపోర్టును షేర్ చేసింది. ప్రతి నెలా 10 బిలియన్లకు పైగా అనుమానాస్పద కాల్స్, మెసేజులు యూజర్లకు చేరకముందే ఆండ్రాయిడ్ సిస్టమ్‌లు అడ్డుకుంటున్నాయని రిపోర్ట్ పేర్కొంది. గూగుల్‌కు చెందిన ఆర్‌సీఎస్ (రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్) తనిఖీలు కూడా ప్రతి నెలా వందల మిలియన్ల మోసపూరిత నంబర్‌లను బ్లాక్ చేస్తున్నాయని తెలిపింది. గత నెలలోనే 100 మిలియన్లకు పైగా నంబర్లను బ్లాక్ చేసినట్లు గూగుల్ వెల్లడించింది.
ఐఫోన్ కంటే స్మార్ట్‌ఫోన్లు బెస్ట్..
ఏఐ టూల్స్ ఏ స్థాయిలో డిజిటల్ సెక్యూరిటీ పెంచుతున్నాయనే దానిపై 5,000 మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లను ప్రశ్నించగా ఆసక్తికరమైన సమాధానాలు వచ్చాయి. గత వారంలో తమకు స్కామ్‌లకు సంబంధించిన ఒక్క టెక్స్ట్ మెసేజ్ కూడా రాలేదని సర్వేలో పాల్గొన్న 58 శాతం మంది చెప్పారు. అయితే, ఐఫోన్ల యూజర్లలో ఊహించని పరిస్థితి నెలకొంది.
ఒక వారంలో కనీసం మూడు, లేదా అంతకంటే ఎక్కువ స్కామ్‌కు సంబందించిన టెక్స్ట్ మెసేజ్‌లు వస్తున్నాయని ఏకంగా 65 శాతం మంది ఐఫోన్ యూజర్లు చెప్పారు. ఇందుకు విరుద్ధంగా ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లలోని ఏఐ టూల్స్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఫోన్ల స్కామ్ రక్షణ వ్యవస్థ చాలా ప్రభావవంతంగా, అత్యంత ప్రభావవంతంగా ఉందని వెల్లడించారు. ఆండ్రాయిడ్ యూజర్లో 20 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని చెప్పారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, స్కామ్, లేదా మోసాల ప్రయత్నాలను ఆపడంలో తమ ఫోన్ విఫలమైందని చెప్పిన ఆండ్రాయిడ్ యూజర్ల కంటే ఐఫోన్ యూజర్లు 150 శాతం ఎక్కువగా ఉన్నారు. యూగవ్‌తో కలిసి అమెరికా, ఇండియా, బ్రెజిల్ దేశాలలోని 5,000 మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులపై సర్వే నిర్వహించినట్టు గూగుల్ వెల్లడించింది.
Read Also- MLA Sanjay Kumar: హృదయ విదారక ఘటన.. డబ్బులు లేక తల్లిని మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లిన కొడుకు
స్కామ్‌లకు సంబంధించిన మెసేజులు ఎక్కువగా అడ్డుకుంటున్న ఫోన్ల జాబితాలో పిక్సెల్ ఫోన్ యూజర్లు అగ్రస్థానంలో నిలిచారు. ఒక్క స్కామ్ టెక్స్ట్ మెసేజ్ కూడా తమకు రాలేదని ఏకంగా 96 శాతానికి పైగా యూజర్లు చెప్పారు. ఈ రిపోర్టును కేవలం యూజర్ల అభిప్రాయం మాత్రమే అని కొట్టిపారేయడానికి లేదు. కౌంటర్‌పాయింట్, లెవియాథన్ సెక్యూరిటీ గ్రూప్ (Leviathan Security Group) నిర్వహించిన టెస్టులలో కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. ఐవోఎస్ డివైజ్‌లకు మెసేజులు ఎక్కువగా వస్తున్నాయి. కాగా, గతేడాది ఆన్‌లైన్ మోసాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 400 బిలియన్ల డాలర్ల (దాదాపు రూ.10 లక్షల కోట్లు) ఆర్థిక నష్టం జరిగిందని నివేదిక అంచనా వేసింది. అయితే, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏఐ ఆధారిత సెక్యూరిటీ ఫీచర్లు ఏవిధంగా పనిచేస్తున్నాయో తెలిపింది.
