BRS Party Surveys: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. సర్వశక్తులు ఒడ్డుతున్నది. దీనికోసం ప్రైవేట్ సంస్థలతో సర్వేలు చేయిస్తున్నట్టు సమాచారం. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కో సంస్థ బీఆర్ఎస్(BRS)కు అనుకూలంగా సర్వేలు ప్రకటిస్తుండడం మైండ్ గేమ్‌లో భాగమనే ప్రచారం జరుగుతున్నది. ప్రజలను పార్టీ వైపు తిప్పుకోవడం కోసమే బీఆర్ఎస్ ఈ సర్వే స్టంట్లు స్టార్ట్ చేసిందని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
సర్వేల రాజకీయం
జూబ్లీహిల్స్ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ నెల 11న పోలింగ్ జరగనున్నది. అంటే మిగిలి ఉన్నది ఐదు రోజులు మాత్రమే. దీంతో ప్రచారంతో పాటు ప్రజల దృష్టిని ఆకర్షించేలా బీఆర్ఎస్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగానే గెలుపు అంశాన్ని విస్తృత ప్రచారం చేయాలని, మీడియాతో పాటు ఎన్నికల ప్రచారంలో ఇదే అస్త్రాన్ని ప్రయోగించాలని భావించి గెలుపు నినాదం అందుకున్నట్లు సమాచారం. అంతేకాదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం నేతల సమావేశం, చేరికలు, రోడ్డు షోలలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని, మెజార్టీయే తేలాల్సి ఉన్నదని పేర్కొంటున్నారు. నియోజకవర్గంలోని అన్ని కాలనీలు, కుల సంఘాల సమావేశాల్లోనూ బీఆర్ఎస్ గెలుస్తుందనే ప్రచారం స్టార్ట్ చేశారు. పదేళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేస్తారని పార్టీ ధీమాతో ఉన్నది. అందులో భాగంగానే ప్రైవేట్ సర్వే సంస్థలు కేకే(KK), బిలియన్ కనెక్ట్(Billion Connect), ఐఐటీయన్ల(IIT), పీపుల్స్(Peopls), చాణక్య, కోడ్ మో, ఓటా మీడియా హౌజ్(Ota Media House) సర్వేలు అన్నీ బీఆర్ఎస్‌కే గెలుపు అవకాశాలు ఉన్నాయని ప్రకటించాయని అనుకుంటున్నారు. నిజంగానే బీఆర్ఎస్ మెజార్టీలో ఉన్నదా? కావాలని సర్వే సంస్థలతో చెప్పిస్తున్నదా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
Also Read: Chinmayi Sripada: మంగళసూత్రం కాంట్రవర్సీ.. ట్రోలర్స్‌పై చిన్మయి ఫిర్యాదు
కావాలనే గెలుపు ప్రచారం
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల మౌత్ టాక్ బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసింది. అప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందనే ప్రచారం జరగడం, బీఆర్ఎస్ ప్రజల్లోని అంచనాలను అందులేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఓటమికి కారణమైంది. దానిని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికలో గెలుపు కోసం మౌత్ టాక్‌ను స్టార్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. నియోజకవర్గంలో ఎక్కువగా స్లమ్ ఏరియాలు ఉండడంతో అక్కడి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగానే సర్వేల్లో గెలుస్తుందనే ప్రచారం స్టార్ట్ చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు రోజుకో సర్వే సంస్థ వివరాలను బయట పెడుతున్నారనే ప్రచారం ఊపందుకున్నది. సర్వే సంస్థలు వెల్లడించినట్లు నిజంగానే ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఉన్నదా? లేకుంటే ఉన్నట్లుగా మైండ్ గేమ్ ఆడుతున్నారా? అనే దానిపై విస్తృత చర్చ జరుగుతున్నది.
అసెంబ్లీ ఎన్నికలప్పుడూ ఇంతే..
గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలుపుపై ఆశలు పెట్టుకున్నది. కొన్ని సర్వేలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు సైతం గెలుస్తుందని రిపోర్టు ఇచ్చాయి. అన్ని సర్వేలు ముమ్మర ప్రచారం చేశాయి. అయితే, అంచనాలు తలకిందులయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ సైతం నారాజ్ అయింది. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ సర్వేలు మళ్లీ బీఆర్ఎస్‌కు గ్రౌండ్ మంచిగా ఉందని, అధికార కాంగ్రెస్ కంటే మెజార్టీలో ఉన్నదని ప్రచారం స్టార్ట్ చేయడంపై పార్టీ స్ట్రాటజీతో చేయిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు ఆ సర్వేలు నమ్మొద్దని, బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా చేయిస్తున్నదని మండిపడుతున్నారు.
తటస్థ ఓటర్లే కీలకం
రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా పార్టీకి ఉన్న ఓటర్లకంటే తటస్థ ఓటర్లే కీలకం. వారు ఎటు మొగ్గుచూపితే వారు విజయం సాధించడం ఖాయం. గెలుపు ఓటములు నిర్ణయించేది వారే. దీంతో వారిని ఆకర్షించే ప్రయత్నాలను బీఆర్ఎస్ పార్టీ ముమ్మరం చేసింది. ఓటర్లను, ఇతర పార్టీలకు చెందినవారిని సైతం ఆకర్షించడంలో భాగంగానే గెలుపు ప్రచారాన్ని అందుకున్నట్లు సమాచారం. గెలుస్తుందనే ప్రచారంతోనే విజయం తధ్యమని, ఇది రాజకీయ అస్త్రంలో భాగమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక్క సర్వే కాదు, మున్ముందు వచ్చే సర్వేల్లో బీఆర్ఎస్ గెలుపు అని తేలుతుందని గతంలో కేటీఆర్ వ్యాఖ్యలు చేసినట్లుగానే సంస్థలు అనుకూలంగా పేర్కొనడం హాట్ టాపిక్ అయింది. ఏదిఏమైనా బీఆర్ఎస్ మాత్రం సర్వే సంస్థలు చెప్పిందంతా కరెక్ట్ అని, గెలుపు తధ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నది. కానీ, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో 11 తర్వాత తేలనున్నది.
Also Read: Hyderabad Crime: ట్రాన్స్ జెండర్ కోసం.. ఫ్రెండ్స్ మధ్య గొడవ.. కత్తులతో పొడిచి యువకుడి హత్య
