BJP Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ’(హెచ్ఐఎల్ టీ), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 27 మున్సిపాలిటీల విలీన నిర్ణయాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఈ నెల 7వ తేదీన ఇందిరా పార్క్ వద్ద భారీ మహాధర్నా చేపట్టనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన ఈ ధర్నా జరగనుంది. ప్రభుత్వ నిర్ణయాలపై కమలం పార్టీ భగ్గుమంటోంది. ప్రభుత్వం ప్రజాపాలనను పక్కనపెట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని కమలదళం విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ఈ నిర్ణయాలు శాస్త్రీయతకు దూరంగా, రాజకీయ ప్రయోజనాల కోసమే తీసుకున్నారని బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన హెచ్ఐఎల్ టీ జీవో నంబర్ 27న తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంపైనా కమలం నేతలు ఆగ్రహంగా ఉన్నారు.
ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు
హెచ్ఐఎల్ టీ పాలసీ ద్వారా ప్రభుత్వం రూ.6.29 లక్షల కోట్ల భారీ భూకుంభకోణానికి తెరలేపిందని, ఇది భూముల దోపిడీ తప్ప మరొకటి కాదని బీజేపీ ఆరోపించింది. కేవలం రూ.5 వేల కోట్లకే అప్పనంగా అప్పజెబుతున్నారని కమలం పార్టీ విమర్శిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు జరిగాయని, మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు భూములను అప్పగించే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. హెచ్ఐఎల్ టీ జీవోను రద్దు చేయకపోతే, అసెంబ్లీలో చర్చించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రజా కోర్టులో ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామని బీజేపీ నేతలు హెచ్చరించారు. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం నిర్ణయాన్ని కూడా తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి విస్తృత ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Also Read: Telangana BJP: మున్సిపాలిటీల విలీనం లాభమా.. నష్టమా?.. కల్లోలంలో కమలనాథులు
సమన్వయం సాధ్యమేనా?
ప్రజా ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమవ్వడం వరకు ఒకే కానీ.. ఈ మహాధర్నాకు నేతలంతా కలిసి వస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇటీవల బీజేపీ ముఖ్య నేతలు రాంచందర్ రావు ఇంట్లో సమన్వయం కోసం లంచ్ మీటింగ్ ఏర్పాటుచేసుకున్నారు. తమలో తాము కొట్లాడుకున్నది చాలని, అధికారం రావాలంటే అంతా కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తే తప్ప సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చారు. అలాగే నిన్నటికి నిన్న బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సైతం 2028 ఎన్నికలే టార్గెట్ గా ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. భేషజాలకు పోవద్దని స్పష్టంచేశారు. పార్టీలో కమిట్ మెంట్ తో పనిచేయాలని, లేనివారు స్వచ్ఛందంగా వెళ్లిపోవచ్చని ఘాటుగా హెచ్చరించారు. ఇప్పటికైనా నేతలు తమ ఆధిపత్య పోరును వదిలేస్తారా? సమన్వయంతో ముందుకు వెళ్లి ఈ మహాధర్నాను సక్సెస్ చేస్తారా? లేదా? అనేది చూడాలి.
బీజేపీ ప్రధాన డిమాండ్లు ఇవే
* హెచ్ఐఎల్ టీ పాలసీ కోసం జారీ చేసిన జీవో నెంబర్ 27ను తక్షణమే రద్దు చేయాలి.
* హెచ్ఐఎల్ టీ పాలసీపై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో ఒక కమిటీని ఏర్పాటు చేసి, సమగ్ర విచారణ చేపట్టాలి.
* ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ పాలసీని పూర్తిగా పరిశీలించి, దానిలోని లోపాలను సరిదిద్దాలి
* కాలుష్య కారక పరిశ్రమల ప్రస్తుత స్థితిని పరిశీలించి, వాటి తరలింపు లేదా మార్పు కారణంగా ఆయా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలి.
* రైతుల చేతిలో ఉన్న వ్యవసాయ భూములు కూడా మల్టీ పర్పస్ వినియోగం కోసం కన్వర్షన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలి.
Also Read: Telangana BJP: లోకల్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు కమలం సిద్ధం.. నెక్స్ట్ ప్లాన్ ఇదేనా..!

