Telangana BJP: ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలనే తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయంపై బీజేపీ(BJP) నోరు మెదపడం లేదు. ఈ అంశంపై కమలం పార్టీ మౌనం వహిస్తున్నది. దీని ద్వారా లాభమా? నష్టమా? అనే అంశాలపై ఇంకా కమలం పార్టీ ఓ కొలిక్కి రాలేదని తెలిసింది. దీనిపై అంచనా వేసుకోలేక కాషాయ పార్టీ సతమతం అవుతున్నట్లు సమాచారం. ఇతర పార్టీలు వారి వైఖరి వెల్లడించినా కాషాయ పార్టీ మాత్రం ఇంకా డైలమాలోనే ఉన్నది. అయితే, ఈ మౌనం వెనుక మర్మమేంటనే అంశంపై పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతున్నది. ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్(BRS), ఎంఐఎం(MIM) వ్యతిరేకించగా బీజేపీ(BJP)లో మాత్రం ఒక్క నేత కూడా నోరు మెదపడం లేదు. ఏదైనా స్పందిస్తే ఎలాంటి వ్యతిరేకత ఎదురవుతుందోననే ఆందోళనలో వారు ఉన్నట్లు సమాచారం.
లాభనష్టాల బేరీజు
గ్రేటర్ పరిధిలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్(Congress) చారిత్రాత్మకంగా అభివర్ణిస్తున్నది. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ మాత్రం ఈ అంశంపై లాభనష్టాల బేరీజు వేసుకుంటూ డైలమాలో పడినట్లు తెలుస్తున్నది. ఏకీకృత అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పరిపాలనా సౌలభ్యం, ఏకరీతి పన్ను విధానం, సమన్వయంతో కూడిన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని అందించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరిస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం రాజకీయ ప్రేరేపిత నిర్ణయమని ఈ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇది పూర్తిగా అశాస్త్రీయమైన నిర్ణయమని, ప్రజలపై పన్నుల భారం మోపడానికే ఈ చర్యలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నది. ఎంఐఎం స్థానిక పాలన, పట్టణ ప్రణాళికపై ప్రభావం చూపుతుందని పేర్కొంటూ ఈ విలీన ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. పాతబస్తీలో తమ ప్రాబల్యం తగ్గవద్దని స్టాండ్ తీసుకున్నది. అయితే, ఈ కీలక నిర్ణయంపై బీజేపీ స్పందించకపోవడం వ్యూహాత్మక మౌనమా లేక అంతర్గత విభేదాల కారణమా అనేది సస్పెన్స్‌గా ఉన్నది.
బల్దియా ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని..
విలీనం తర్వాత ఆయా ప్రాంతాల్లో ఆస్తి, నీటి పన్ను విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది. దీనిపై స్పందించి ప్రభుత్వాన్ని విమర్శిస్తే, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చే ప్రమాదం ఉంటుంది. మౌనంగా ఉంటే పన్నుల భారాన్ని సమర్థించినట్లు అవుతుందని బీజేపీ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. విలీనం కానున్న ప్రాంతాల్లో సామాజిక, రాజకీయ సమీకరణాలు భిన్నంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి పట్టు ఉండగా, మరికొన్ని చోట్ల బలహీనంగా ఉన్నది. ఈ నిర్ణయం ద్వారా తమ ఓటు బ్యాంకుకు లాభమా, నష్టమా అనే లెక్కలు వేసుకునే పనిలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. బల్దియా ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయంపై తొందరపడి ఒక వైఖరి తీసుకునే బదులు, ప్రజల నాడిని పరిశీలించి తర్వాత స్పందించాలని బీజేపీ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విలీనం బీజేపీకే లాభమా?
రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ విలీనం బీజేపీకి మేలు చేకూర్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్ ఎన్నికలో వారి మద్దతు తప్పనిసరిగా మారింది. కానీ, తాజా విలీనంతో పరిధి పెరిగనున్నది. తద్వారా కొత్త కార్పొరేటర్ల సంఖ్య పెరుగుతుంది. దీంతో పాతబస్తీకి చెందిన కార్పొరేటర్ల సంఖ్యపై ప్రాబల్యం పడే అవకాశముంటుంది. 2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 48 చోట్ల గెలిచింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ మల్కాజ్‌గిరి, చేవెళ్ల స్థానాలు దక్కించుకుంది. అంటే బీజేపీకి నగరం, శివారు ప్రాంతాలు అండగా నిలుస్తున్నాయని అర్థమవుతున్నది. కానీ ఈ అంశంపై కమల నేతలు మౌనం వహించడం హాట్ టాపిక్ అయింది. ఈ నిర్ణయంపై నేతలకు స్పష్టత లేకపోవడం, అలాగే హైకమాండ్ నుంచి రాష్ట్ర నాయకులకు ఎలాంటి గైడెన్స్ రాకపోవడం వల్ల మౌనం వహిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మొత్తంగా జీహెచ్‌ఎంసీలో మున్సిపాల్టీల విలీనం, బీజేపీ మౌనం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.
Also Read: TG High Court: హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సీరియస్.. విచారణకు హాజరుకాకపోతే..

