Ramchander Rao: కల్వకుంట్ల కవిత పార్టీ ఏర్పాటుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) ఘటుగా స్పందించారు. గతంలో కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని చురకలంటించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఆమె ఆత్మగౌరవం ఎలా దెబ్బతిన్నదనేది వాళ్ల కుటుంబ అంశమని పేర్కొన్నారు. ఆమె పార్టీ పెట్టడం వల్ల బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఆమె తప్పు చేశారు కాబట్టే జైలుకు వెళ్లారని నొక్కిచెప్పారు. బీజేపీ కక్ష పూరిత రాజకీయాలు చేయదని, అలాంటి వాటికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.
Also Read: Ramchander Rao: బీజేపీ స్టేట్ చీఫ్ మాస్ వార్నింగ్.. లీకు వీరుల లెక్కతేలుస్తా అంటూ ఆగ్రహం!
బిహార్‌లో రూ.5,700 కోట్ల పైగా ఫ్రాడ్
గోబెల్స్ ప్రచారంలో కాంగ్రెస్ తల్లి లాంటిదని రాంచందర్ రావు (Ramchander Rao) విమర్శించారు. వీబీ జీ రామ్ జీ పథకానికి వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల్లో నరేగా పథకంలో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని గుర్తు చేశారు. యూపీలో రూ.10 వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. బిహార్‌లో రూ.5,700 కోట్ల పైగా ఫ్రాడ్ జరిగిందని పేర్కొన్నారు. పారదర్శకత లేని స్కీం లే కాంగ్రెస్‌కు కావాలని రాంచందర్ రావు విమర్శించారు.
కాంగ్రెస్‌కు అవినీతి చేసే ఆస్కారం లేదు
పథకాలకు మహాత్మా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ పేర్లు తప్ప వేరేవి పెట్టకూడదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు అవినీతి చేసే ఆస్కారం లేదు కాబట్టే వీబీ జీ రామ్ జీని వ్యతిరేకిస్తున్నదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక, అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో హత్యకు గురైన భారతీయ యువతి నిఖిత కుటుంబ సభ్యులను రాంచందర్ రావు తార్నాకలో ఉన్న వారి స్వగృహంలో పరామర్శించారు. నిఖిత భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో చర్చించారని తెలిపారు.
Also Read: Ramchander Rao: కాంగ్రెస్ తీరు సనాతన ధర్మ విరోధిగా ఉంది : రాంచందర్ రావు

