Ramchander Rao: హేట్ స్పీచ్ చట్టాన్ని కాంగ్రెస్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) ప్రకటనలో తెలిపారు. కర్ణాటకలో కూడా ఈ చట్టాన్ని తేవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారని, అక్కడ ఇప్పుడిప్పుడే ఇది రూపం తీసుకుంటోందని పేర్కొన్నారు. హేట్ స్పీచ్ బిల్లు కేవలం బీజేపీ నాయకులు, కార్యకర్తలను వేధించడానికి, వారిని తిరక్కుండా, మాట్లాడకుండా చేసేందుకే కాంగ్రెస్ తీసుకొస్తోందని విమర్శించారు. ఈ చట్టం హిందు ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని తిట్టేవారికి రక్షణగా నిలుస్తుందని రాంచందర్ ఆరోపించారు. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పింది స్వయంగా ఆ పార్టీ నేతలేనని ఆయన గుర్తు చేశారు.
Also Read: Ramchander Rao: పైడిపల్లెలో రీకౌంట్ చేయాలి.. లెక్కింపులో తప్పిదాలు జరిగాయి : రాంచందర్ రావు
రాజకీయాలు వన్ టైం పాలిటిక్స్
హేట్ స్పీచ్ ఇచ్చే సంస్కృతి కాంగ్రెస్‌దేనని, సనాతన ధర్మంపై అసభ్యంగా మాట్లాడింది కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమి కాదా అని ఆయన నిలదీశారు. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ యవనికపైకి మళ్లీ రావడం వల్ల తెలంగాణలో ఏం మారుతుందని ఆయన ప్రశ్నించారు. కొన్ని నెలల తర్వాత బయటికొచ్చి చేసే రాజకీయాలు వన్ టైం పాలిటిక్స్ లాగే ఉంటాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఒకసారి వచ్చి మళ్లీ వెళ్లిపోతారని, ఆ తర్వాత ఎప్పటికో తిరిగొస్తారని, ఇటువంటి పద్ధతి తెలంగాణలో నడవదని చురకలంటించారు. ప్రజలు బీఆర్ఎస్ అవినీతిని, ఫ్యూడలిజాన్ని ఇప్పటికే చూశారని, ఆ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్‌ను మర్చిపోయారని, ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని రాంచందర్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Ramchander Rao: పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై కాంగ్రెస్‌కు ప్రేమ ఎందుకు? రాంచందర్ రావు తీవ్ర విమర్శ!

