Ramachandra Rao: భారతదేశంలో సుదీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్(Congress) పార్టీ తన హయాంలో బీసీ(BC)లకు రాజకీయ రిజర్వేషన్లను ఎందుకు ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షులు రామచంద్రరావు(Ramachandra Rao) కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగా తొలిసారిగా రామచంద్ర రావు మహబూబ్ నగర్(Mehabubnagar) జిల్లా పర్యటనకి వచ్చారు. ఈ సందర్భంగా భారతీయ పార్టీ శ్రేణులు ఆయనకు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమ్మేళనంలో రామచంద్రరావు మాట్లాడారు. రిజర్వేషన్ల పేరుతో బీసీ(BC)ల ఓట్లను దండుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మరోసారి భారీ కుట్రకు తెర తీసిందన్నారు. దేశాన్ని దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒకసారి నా బీసీనీ ప్రధాని పీఠంలో కూర్చోబెట్టలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రధాని నరేంద్ర మోడీ(Modhi)ని కన్వర్టెడ్ బీసీగా అభివర్ణించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం అన్నారు.
మతపరమైన రిజర్వేషన్లను రద్దు
కన్వర్టెడ్ మతస్తులు ఉంటారని, కన్వర్టెడ్ కులస్తులు ఉండరన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ(Rahul Gandhi) బహుశా రేవంత్ రెడ్డికి చెప్పి ఉండరని, అసలు రాహుల్ కే తను ఏ కులస్తుడో తెలుసో లేదో అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 46% బీసీలు ఉన్నారని సర్వే చేసి మరీ చెప్పిన ప్రభుత్వం, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రాజకీయ రిజర్వేషన్లను ఇవ్వడానికి నిర్ణయించుకుందని, అందులో మళ్ళీ 10 రిజర్వేషన్లను ముస్లిం మైనారిటీలకు కట్టబెడితే, బీసీలకు 36% మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందనున్నాయని, ఇది ముమ్మాటికి బీసీ(BC) సమాజాన్ని కాంగ్రెస్(Congrss) మోసం చేయడమే అన్నారు.
భారతీయ జనతా పార్టీ బీసీ వాదానికి కట్టుబడి ఉండటం వల్లే గత ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించామన్నారు. తాము అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. మైనార్టీ మతస్తులకు కూడా న్యాయం చేసేలా వ్యవహరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 42 శాతం కంటే ఎక్కువే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నారు. తనకు మహబూబ్ నగర్ జిల్లా అంటే ప్రత్యేక అభిమానమన్నారు. ఈ జిల్లా గ్రాడ్యుయేట్ల బిక్ష వల్లే తను ఎమ్మెల్సీ(MLC)ని కాగలిగానన్నారు.
ఒక్కసారి భాజపాకు అధికారాన్ని ఇవ్వండి
దశాబ్ద కాలం పరిపాలించిన బిఆర్ఎస్(BRS) పాలమూరు జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఈ జిల్లా బిడ్డను అని చెప్పుకునే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సైతం పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు. 19 నెలలయినప్పటికీ పాలమూరు రంగారెడ్డి పెండింగ్ పనులను సీఎం ఎందుకు ప్రారంభించలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజానికమంతా ఒక్కసారి భాజపాకు అధికారాన్ని ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విభేదాలను పక్కకు పెట్టి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు మారు పేరని గీత దాటిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ వారిపై క్రమశిక్షణ రాహిత్య చర్యలు తీసుకోండని అన్నారు.
Also Read: Mulugu District: భారీ వర్షంలో వాగు దాటుతూ నిండు గర్బిణీ ఆవస్ధలు
ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమ్మేళన సభలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ(DK Aruna) సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి వీర విధేయులమని చెప్పుకునే కొంతమంది ఎన్నికల సమయంలో తన ఓటమి కోసం ప్రయత్నం చేశారని ఆరోపణలు చేశారు. ఎంపీ(MP) టికెట్ ఆశించి భంగపడ్డవారు తాను ఓడిపోతున్నానని దావత్ లు సైతం చేసుకున్నారని, అందుకు సంబంధించిన సాక్షాధారాలు కూడా తమతో ఉన్నాయన్నారు. నూతనంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వేదికపై ఇరు వర్గాల మధ్యన తోపులాట తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
అంతకుముందు జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు(Ramchender Rao) తో పాటుగా ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ తదితర అతిథులను వేదిక పైకి ఆహ్వానించారు. ఇంతలో ఒక్కసారిగా శాంతి కుమార్ గో బ్యాక్ అంటూ కొంతమంది వేదిక పైకి దూసుకు వచ్చారు. ఊహించని ఈ హఠాత్పరిణామానికి సభలోని వారికి కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణకు వ్యతిరేకంగా పని చేశారని ఆరోపిస్తూ శాంతి కుమార్ పార్టీ ద్రోహి, శాంతి కుమార్ డౌన్ డౌన్ అంటూ ఆయన్ని వేదిక దిగిపోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ వెంటనే శాంతి కుమార్ వర్గీయులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.
ఇరు వర్గాలు వేదిక మీదకి చేరుకొని బాహబాహికి దిగారు. జిల్లా పార్టీ పెద్దలు కలుగజేసుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఈ తతంగం మొత్తం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సమక్షంలో జరగటం గమనార్హం క్రమశిక్షణకు మారుపేరుగా పిలవబడే భాజపా పార్టీ వేదికలపై ఇలాంటి సంఘటనలు గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదని పార్టీ కార్యకర్తలు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగురావు నామోజీ, సెంట్రల్ ఫుడ్ టాస్క్ ఫోర్స్ మెంబర్ పద్మజా రెడ్డి, రాష్ట్ర నాయకులు రతన్ పాండురంగారెడ్డి, పార్లమెంట్ ఇంచార్జ్ డోకూరు పవన్ కుమార్ రెడ్డి పడాకుల బాలరాజ్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Free Diagnostic centres: హైదరాబాద్ ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితం