BJP: అసెంబ్లీ ఎన్నికల ముందు ‘మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన హస్తం పార్టీ ఎట్టకేలకు విజయం సాధించింది. 6 గ్యారెంటీలు ప్రజలకు ఇస్తామని హామీ ఇచ్చి విజయబావుటా ఎగురవేసింది. అయితే ఇచ్చిన మాట, హామీలు అమలు మాత్రం జరగలేదని బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఇచ్చిన నినాదాన్ని తిప్పి కొట్టాలని కమలం పార్టీ నిర్ణయించింది. అందుకే ఆగస్టు 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. ‘కాంగ్రెస్ వచ్చింది.. మార్పు రాలేదు’ అనే నినాదంతో డోర్ టూ డోర్ క్యాంపెయిన్ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రజలను తమ వైపునకు ఆకర్షితులను చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే వరుసగా కార్యక్రమాలు నిర్వహించి ముందుకెళ్లాలని పావులు కదుపుతోంది.
రంగంలోకి రాంచందర్ రావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాంచందర్ రావు వరుసగా జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటనలు పూర్తిచేసుకున్నారు. కాగా, నేడు, రేపు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. సాధారణంగా పార్టీ బలంగా ఉన్నచోట నుంచి పర్యటనలు ప్రారంభించి కార్యకర్తల్లో జోష్ నింపాలని ప్రయత్నం చేస్తారు. కానీ, రాంచందర్ మాత్రం తొలుత పార్టీ వీక్‌గా ఉన్న జిల్లాల నుంచి పర్యటన కొనసాగిస్తుండటం చూస్తుంటే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపుపై ఎంత ధీమాతో ఉన్నారనేది అర్థమవుతోందని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఆగస్టు 2న బీసీ రిజర్వేషన్ల అంశంపై మహాధర్నాకు పిలుపునిచ్చిన ఆయన ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ఇరుకున పెట్టాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
Read Also- Telangana: 144 పోస్టుల ఖాళీ.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
వ్యూహాత్మకంగా..
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేసి అత్యధిక స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందుకే ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు చేరువవ్వాలని కమలనాథులు భావిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల పర్యటనలో భాగంగా రాంచందర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలు, హామీల అమలులో తీవ్ర వైఫల్యం, పాలనలో కనపడుతున్న అసమర్థతపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టనున్నారు. అంతేకాకుండా నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలు, జీవన స్థితిగతులను అడిగి తెలుసుకుని భరోసా కల్పించనున్నారు. ఇదే సమయంలో పార్టీ కార్యకర్తల సమ్మేళనాలు, స్థానిక ప్రముఖులతో సమావేశాలు నిర్వహించనున్న ఆయన, బూత్ స్థాయిలో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రణాళికలు చేసుకున్నారు. పార్టీ పగ్గాలు అందుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వరుస పర్యటనలు, నేతలతో కార్యశాలలు, సమావేశాలు నిర్వహిస్తున్న రాంచందర్ వ్యూహం ఎంతమేరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.
Read Also- World Lipstick Day: నేడు వరల్డ్ లిప్‌స్టిక్ డే.. ప్రతిరోజూ దీన్ని వాడటం మీ పెదవులకు సురక్షితమేనా?