Operation Akarsh: రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఇతర పార్టీల నుంచి నేతలను లాక్కోవడంపై కాషాయ పార్టీ దృష్టిసారిస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్(BRS) టార్గెట్ గా పెట్టుకున్న కమలదళం ఆపరేషన్ ఆకర్ష్(operation akarsh) కు శ్రీకారం చుట్టింది. భవిష్యత్ లో రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఎదగడంలో భాగంగా ఈ నిర్ణయానికి కాషాయ పార్టీ వచ్చింది. అందులోభాగంగానే ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvala Balaraju)ను చేర్చుకుంది. కాగా ఆయనతో పాటే మరికొందరు నేతలను సైతం చేర్చుకోవాల్సి ఉండగా అది వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ జాప్యం వెనుక మతలబేంటని ఆరా తీయగా చేరాలనుకున్న పలువురు పార్టీకి పలు కండీషన్లు పెట్టినట్లుగా చర్చ జరుగుతోంది. అందుకే మిగతా నేతల చేరికలో ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని చర్చించుకుంటున్నారు.
రాబోయే ఎన్నికల్లో టికెట్ గ్యారెంటీ
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ(BJP)లో చేరిన చాలా మంది నేతలు తిరిగి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. వారికి ప్రియారిటీ ఇవ్వకపోవడం, పార్టీలో చోటు కల్పించకపోవడంతోనే వారంతా తిరిగి వెళ్లిపోయారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అంతేకాకుండా పార్టీలో పాత, కొత్త నేతల మధ్య పొసగకపోవడం కారణంగా కూడా ఇంకొందరు దూరమయ్యారు. అందుకే గువ్వల చేరిక సందర్భంగా ఇంకొందరు నేతలు కూడా చేరాల్సి ఉన్నా ఈ కారణంగానే వెనక్కి తగ్గారనే ప్రచారం జరుగుతోంది. కాషాయ పార్టీలో తర్వాత చేరే వారిలో కల్వకుర్తి(Kalwakurti) ఆలంపూర్(Alampur) కొల్లాపూర్(Kollapur) నాగర్ కర్నూల్(Nagarkurnool) దేవరకద్ర(Devarakadra) కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారనే ప్రచారం జరుగుతుండగా వారు కండీషన్స్ పెట్టడంతో కాస్త జాప్యం జరిగే అవకాశముందని వినికిడి. పార్టీలో పదవితో పాటు రాబోయే ఎన్నికల్లో టికెట్ గ్యారెంటీగా ఇవ్వాలనే మెలిక పెట్టారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు.
Also Read: BRS on BC Candidate: బీసీలపై గురిపెట్టిన బీఆర్ఎస్.. ఆర్మూర్ నుంచే స్టార్ట్.. వారి సీట్లు గల్లంతే!
ఆపరేషన్ ఆకర్ష్ కంటిన్యూ అవుతుందా?
తెలంగాణ(Telangana)లో పలు జిల్లాల్లో పార్టీ వీక్ గా ఉంది. అందుకే తొలుత అలాంటి జిల్లాలపైనే దృష్టిసారించి పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. జాయినింగ్స్ తో శ్రేణుల్లో జోష్ నింపాలని భావించింది. అందుకే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంకొందరు బీఆర్ఎస్(BRS) నేతలను టార్గెట్ గా చేసుకుని చేర్చుకోవాలని భావిస్తోంది. వారు చేరేందుకు కండీషన్స్ పెడుతుండటంతో వారిని బుజ్జగించి చేర్చుకునే ప్రయత్నంలో కాషాయ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిమగ్నమైనట్లు తెలుస్తోంది. గువ్వల చేరిక తర్వాత ఇంకొందరు నేతల పేర్లు లీక్ అవ్వడం, ప్రచారం జరగడం వల్ల ప్రత్యర్థి పార్టీ అలర్ట్ అవ్వడం కూడా ఆలస్యానికి కారణంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ కంటిన్యూ అవుతుందా? లేక కాస్త డిలే అవుతుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ రాష్ట్ర నాయకత్వం మాత్రం శ్రేణుల్లో జోష్ కంటిన్యూ చేసేలా పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని ధీమాతో ఉంది. వీరితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంకొందరు నాయకులను సైతం త్వరలోనే చేర్చుకుంటామని చెబుతోంది. మరి కాషాయ పార్టీ దీన్ని ఎంతమేరకు సక్సెస్ చేస్తుందనేది చూడాలి.
Also Read: Rana Daggubati: నేడు ఈడీ విచారణకు దగ్గుబాటి రానా.. ఈసారైనా వెళ్తారా!