BJP: భారతీయ జనతా పార్టీ బీసీలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల రాంచందర్ రావు జిల్లా కేంద్రానికి తొలిసారి అధ్యక్ష హోదాలో పర్యటనకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ పట్ల అధిష్టానం అవమానకరంగా వ్యవహరించారని, ఇది బీసీలను అవమాన పరచడమే అంటూ పలు బీసీ సంఘాల నాయకులు, ఓ సామాజిక వర్గం నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారన్నారు. వారందరూ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేదని విమర్శించారు.
వాళ్లు రావడం వల్లే గొడవ
లోక్ సభ ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ స్థానానికి డీకే అరుణ, శాంతి కుమార్ తదితరులు టికెట్ ఆశించగా అధిష్టానం డీకే అరుణకు కేటాయించిందని శ్రీనివాస్ గుర్తు చేశారు. దాంతో శాంతి కుమార్ వర్గీయులు కొంతమంది పార్టీకి రాజీనామా చేయగా, ఇంకొందరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో బహిష్కరణకు గురయ్యారని వివరించారు. మొన్న జరిగిన కార్యకర్తల సమ్మేళనంలో పార్టీ నుండి సస్పెండ్ అయిన నేతలు శాంతి కుమార్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సభకు రావడంతో, ఆగ్రహించిన కొంతమంది శాంతి కుమార్ వేదిక పైనుండి వెళ్లిపోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారన్నారు. ప్రతిగా ఆయనకు మద్దతుగా మరి కొంతమంది నినాదాలు చేస్తూ వేదికపైకి దూసుకు వచ్చినట్లు తెలిపారు.
మౌనమెందుకు..
శాంతి కుమార్ తన వర్గీయులు పార్టీకి వ్యతిరేకంగా పని చేశారన్న ఆరోపణలకు వివరణ ఇవ్వడానికి ఆయనకు మంచి వేదిక దొరికినప్పటికీ ఎందుకు మౌనం దాల్చారని శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆయన వ్యవహార శైలి పూర్తిగా భారతీయ జనతా పార్టీ అంతర్గత విషయమని, దీనికి కుల సంఘాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. శాంతి కుమార్ విషయంలో మీడియా సమావేశం నిర్వహించి బీజేపీ వైఖరిని ఎండగట్టిన మున్నూరు కాపు నేతలు, గతంలో మున్నూరు రవి లాంటి తెలంగాణ ఉద్యమకారుడిని మాజీ మంత్రి కేసుల పేరుతో చిత్రహింసలు పెట్టినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని సూటిగా ప్రశ్నించారు.
Read Also- Cortisol Symptoms: మీలో ఈ సమస్యలు ఉన్నాయా? కార్టిసాల్ హార్మోన్ కంట్రోల్ తప్పినట్లే!
బీజేపీ వల్లే బీసీలకు పట్టం
కేంద్ర మంత్రివర్గంలో 27 శాతం శాఖలను బీసీలకు కేటాయించడంతోపాటు, బీసీనే ప్రధాని సీటులో కూర్చోబెట్టిన ఘనత బీజేపీది అని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా బీసీని ప్రకటించిన విషయాన్ని సంఘాలు విస్మరించవద్దన్నారు. గతంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీలపై అక్రమ కేసులు బనాయించి వారిని జైళ్లకు పంపినప్పుడు డీకే అరుణ మాత్రమే ధైర్యంగా బాధితుల పక్షాన నిలిచారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీలకు అందాల్సిన ప్రతి పథకం తన పార్లమెంట్ పరిధిలోని బీసీలకు వంద శాతం అందజేయాలనే సంకల్పంతో బ్యాంకర్లను సైతం ఒప్పించిన ఘనతకు డీకే అరుణదని కొనియాడారు. వాల్మికులను ఎస్టీ జాబితాలో చేర్చాలని పార్లమెంటులో ప్రసంగించిన ఏకైక ఎంపీ డీకే అరుణ మాత్రమేనని చెప్పారు. గతంలో మంత్రి హోదాలో ముదిరాజులను బీసీ ఏ జాబితాలోకి చేర్చాలని అసెంబ్లీలో డిమాండ్ చేసి ముదిరాజులకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు.
అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలి
కుల సంఘాలు, బీసీ సంఘాలు మీడియా సమావేశాలు నిర్వహించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే శాంతి కుమార్ లాంటి సీనియర్ నాయకులకు నష్టం చేసిన వారవుతారని, కాబట్టి బీసీ, కుల సంఘాలు సంయమనం పాటించాలన్నారు. కార్యకర్తల సమ్మేళన సభలో జరిగిన సంఘటనను ఎవరూ ఆహ్వానించరని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధిష్టానం కఠిన చర్యలకు ఉపక్రమించాలని ఆయన కోరారు.
Read Also- Hydraa: అలుగును సైతం వదలని అక్రమార్కులు.. పట్టించుకోని అధికారులు