BJP Telangana: ముంచుకొస్తున్న మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపికపై తీవ్రస్థాయిలో మల్లగుల్లాలు పడుతోంది. పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లో టికెట్ల కోసం నేతల మధ్య పోటాపోటీ నెలకొనగా, కేడర్ లేని చోట్ల అభ్యర్థుల వేట అధిష్టానానికి సవాల్‌గా మారింది. పార్టీ బలంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. ఒకే టికెట్ కోసం పలువురు సీనియర్లు, బలమైన నేతలు పోటీ పడుతుండటంతో ఎవరిని సంతృప్తి పరచాలో తెలియక రాష్ట్ర నాయకత్వం సతమతమవుతోంది.
ఈ ప్రాంతాల్లో గట్టి పట్టు పార్టీకి ఉంది
కాషాయ పార్టీ ఉత్తర తెలంగాణలో చాలా బలంగా ఉంది. ఎమ్మెల్యే, ఎంపీ, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలతో ఇది మరోసారి నిరూపితమైంది. కాగా ఈ ప్రాంతాల్లో గట్టి పట్టు పార్టీకి ఉందనేది తెలిసిందే. దీంతో భారీస్థాయిలో ఆశావహులు పోటీపడుతున్నారు. ఇకపోతే దక్షిణ తెలంగాణలో పార్టీ చాలా వీక్ గా ఉంది. చాలా జిల్లాల్లో కేడర్ కరువైంది. దీంతో పార్టీ యంత్రాంగం వీక్‌గా ఉన్న గ్రామీణ ప్రాంతాలు, కొన్ని ప్రత్యేక నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సరైన విజయావకాశాలు ఉన్న అభ్యర్థులు కనిపించడం లేదు. దీంతో ఆ ప్రాంతాల్లో లోకల్ ఫేస్ కోసం పార్టీ గాలిస్తోంది. పార్టీ వీక్ గా ఉన్న స్థానాల్లో గెలిచే అభ్యర్థులు కరువవ్వగా స్థానికంగా బలంగా ఉన్న నేత ఎవరనే అంశంపై కమలం పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. నామినేషన్లకు మరో రెండ్రజుల గడువే ఉండటంతో దూకుడు పెంచింది.
కొత్తగా చేరే వారికి ప్రాధాన్యత
కాషాయ పార్టీకి సొంత అభ్యర్థులు లేని చోట కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న కీలక నేతలను తమవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. గతంలోనూ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలను చేర్చుకుని టికెట్లు కేటాయించిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ అంశం కూడా వివాదాస్పదంగా మారే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి నేరుగా టికెట్లు ఇస్తే, ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న తమ పరిస్థితి ఏమిటని సీనియర్ నేతలు ప్రశ్నించే ఆస్కారముందని చెబుతున్నారు. ఇది వర్గపోరును మరింత పెంచినట్లవుతుందని సూచనలు చేస్తున్నారు. కొత్తగా చేరే వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై పార్టీలో నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి జ్వాలలు రగిలే ఆవకాశముందని చెబుతున్నారు. అదే సీనియర్లు.. స్వాగతిస్తే ఫలితాలు మరోలా ఉంటాయని చెబుతున్నారు.
కాషాయ పార్టీకి సవాళ్లు
మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల కేటాయింపు బాధ్యతలు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలకే రాష్ట్ర నాయకత్వం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై వారికి మాత్రమే అవగాహన ఉండటంతో అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలకు అధిష్టానం పెద్దపీట వేస్తోంది. వారి సిఫార్సుల ఆధారంగానే గెలుపు గుర్రాలకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. కాషాయ పార్టీ పట్టణ ప్రాంతాల్లో బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించింది. అదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లోనూ ముందుకు వెళ్తామని రాష్ట్ర నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకత, తెలంగాణ ప్రాంతీయ గుర్తింపుతో పూర్తిస్థాయిలో మమేకం కాలేకపోవడం కాషాయ పార్టీకి సవాళ్లుగా మారవచ్చు. అలాగే, జనసేన వంటి పార్టీలతో పొత్తుపై స్పష్టత లేకపోవడం కూడా కొన్నిచోట్ల ఓట్లను చీల్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరో రెండ్రోజుల సమయం
మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు ఈనెల 30తో గడువు ముగియనుంది. మరో రెండ్రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటం బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠను రేపుతోంది. అభ్యర్థుల కేటాయింపు సవాలుగా మారడంతో అందులోనే పార్టీ తలమునకలు కానుంది. కాగా ఎన్నికలు సైతం ఫిబ్రవరి 11నే ఉండటంతో సమయం తగ్గి.. సవాళ్లు ఎక్కువయ్యే అవకాశౄలున్నాయి. ప్రచారానికి సమయం కూడా చాలా తక్కువగా ఉండటంతో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో కాషాయ పార్టీకి సవాళ్లు తప్పేలా లేవనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. వ్యూహ ప్రతివ్యూహాలతో ఇతర పార్టీలు దూసుకెళ్తుంటే, అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి కమలం పార్టీ రేసులో నిలబడి గట్టి పోటీ ఇస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.ఒకవైపు అంతర్గత విభేదాలు, మరోవైపు అభ్యర్థుల కొరత మధ్య కమల దళం ఎన్నికల వ్యూహాలు ఎంత మేరకు వర్కవుటవుతాయనేది వేచి చూడాల్సిందే.
Also Read: BJP Telangana: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ హైకోర్టులో పిటిషన్..!

