BJP Telangana: తెలంగాణ బీజేపీలో పాత, కొత్త నేతల మధ్య పంచాయితీ మళ్లీ రాజుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి కమలం గూటికి చేరిన వారిని పాత నేతలు ఎదగనివ్వడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో చాలా మంది నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తుండటం గమనార్హం. పార్టీలో చేరి ఎలాంటి ప్రియారిటీ దక్కక, పదువులు సైతం రాక ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకంటే వారిని నమ్ముకుని వచ్చిన పలువురు తమ లీడర్ కే ఆ పార్టీలో విలువ లేదు.. ఇంకా తమకేం విలువ ఉంటుందనే పరిస్థితికి ఈ ఇష్యూ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. పోస్టులు, పదవుల్లో కొత్తగా చేరిన వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందనే ఆవేదన పలువురి నుంచి వ్యక్తమవుతోంది. తెలంగాణ కాషాయపార్టీలో అంతర్గత కలహాలు ఇప్పటికే కల్లోలం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ముందే రాజుకున్న కొత్త, పాత నేతల మధ్య వివాదం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.
రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించి..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇటీవల పలు జిల్లాల్లో పర్యటనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయన ఎదుటే సొంత పార్టీ నేతలపై బాహాబాహీకి దిగారు. పర్యావసానంగా వారికి నోటీసులు ఇచ్చి క్లాస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కాగా తాజాగా కొత్త కమిటీ పెట్టిన చిచ్చు సైతం ఇంకా రగులుతూనే ఉంది. ఈ తరుణంలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) ఇటీవల చేసిన కామెంట్స్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఆయనతో పాటు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy) పార్టీ సైతం కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో పార్టీలో ఏం జరుగుతోందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రి రాజ్ నాథ్ సింగ్..
విమోచన దినోత్సవ ఏర్పాట్లలో భాగంగా కంటోన్మెంట్ లో ఏర్పాటుచేసిన ప్లెక్సీల్లో స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ ఫొటో సైతం పెట్టలేదని తెలుస్తోంది. లోకల్ ఎంపీగా ఇవ్వాల్సిన ప్రొటోకాల్ కూడా పార్టీలో కొందరూ కావాలనే కట్ చేశారని ఈటల వర్గీయులు మండిపడుతున్నట్లు సమాచారం. చీఫ్ గెస్ట్ గా వచ్చిన రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) కు స్వాగతం పలికే లైనప్ లోనూ ఈటల వర్గానికి చెక్ పెట్టినట్లు వినికిడి. ఈ విషయం తెలిసి తీరా ఆయన అసంతృప్తితో వెళ్లిపోతుండగా పలువురు నేతలు ఆయన్ను సముదాయించి వెనక్కి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే ఆత్మగౌరవం కోల్పోయాక ఏ పదవి వచ్చినా గడ్డిపోచతో సమానమనంటూ ఈటల చేసిన కామెంట్స్ పార్టీలో పెద్ద చర్చకే కారణమైంది.
ఎదగనివ్వడంలేదని..
బీజేఎల్పీ నేతతో పాటు ఓ ఎమ్మెల్యే కూడా రాష్ట్ర నాయకత్వ తీరుపై పెదవి విరుస్తున్నారనే చర్చ పార్టీలో జరగుతోంది. బీజేఎల్పీ నేత ఏలేటిని పార్టీ వినియోగించుకోవడం లేదని శ్రేణులు చర్చించుకుంటున్నాయి. రాష్ట్ర కార్యాలయంలో ఎల్పీ నేతకు ఇప్పటి వరకు ఓ గది కూడా కేటాయించకపోవడం గమనార్హం. ప్రజాప్రతినిధులపై పార్టీ అనుసరిస్తున్న విధానం చూస్తే కొత్త వారిని ఎదగనివ్వడంలేదని అర్థమవుతోందని పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన పార్టీగా ఉన్న బీజేపీలో ఇలాంటివి చిన్న చిన్న ఇష్యూస్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పార్టీ అన్నాక అలకలు, అసంతృప్తులు కామన్ అంటూ చెబుతున్నారు. కొత్త నేతలను ఎదగనివ్వడంలేదనే భావనను పోగొట్టేందుకు బీజేపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తుందనేది చూడాలి.
Also Read: Panchayat Elections: స్థానికంపై సర్కార్ ‘వ్యూహాత్మకం’.. జిల్లా కలెక్టర్లకు కీలక సూచన