Aroori Ramesh: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరిన వేళ, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ రాజీనామా (BJP) బీజేపీలో పెను భూకంపాన్ని సృష్టించింది. పురపాలక ఎన్నికల రణరంగంలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న బీజేపీకి, ఉమ్మడి వరంగల్ జిల్లా కీలక నేత అరూరి రమేశ్ రాజీనామా కోలుకోలేని దెబ్బగా మారింది. నామినేషన్లకు గడువు ముగుస్తున్న తరుణంలో ఆయన మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అరూరి రమేశ్ తోనే ఇది ఆగుతుందా? లేక ఇంకా ఎవరైనా ఆయన బాటలోనే వెళ్లాలనుకుంటున్నారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నేతల మధ్య ఆధిపత్య పోరు
బీజేపీలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి పెద్దగా ప్రాధాన్యత దక్కడంలేదనే విమర్శలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఎన్నోమార్లు పాత, కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు బాహటంగానే కనిపించింది. స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఎదుటే ఇవి బహిర్గతమయ్యాయి. ఆయన ఎదుటే బాహాబాహీకి దిగిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నపళంగా అరూరి కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఇంకెవరైనా పార్టీ వీడనున్నారా? అనే అందోళన అటు పార్టీలో.. ఇటు కేడర్ లో వ్యక్తమవుతోంది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఒక్కొక్కరుగా కమలం పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అలాంటి సీన్ రిపీట్ కానుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రమేశ్ కమలం పార్టీకి గుడ్ బై
రాష్ట్రంలో ఒకవైపు మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు ఎలక్షన్ కు సిద్ధమవుతున్న వేళ అరూరి రమేశ్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పిన అరూరి తిరిగి ఘర్ వాపసీవెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ లేదా కేటీఆర్ సమక్షంలో ఆయన అధికారికంగా అతి త్వరలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనలకు ఒకరోజు ముందే అరూరి గుడ్ బై చెప్పడంతో కాషాయ పార్టీకి ఆదిలోనే పుర కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాషాయ పార్టీ చాలా వీక్ గా ఉంది. ఆ ఒక్క జిల్లానే కాకుండా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోనూ కమలం పార్టీకి కేడర్ కరువైంది. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాస్తో కూస్తో పట్టున్న నేతగా పేరున్న అరూరి రమేశ్ కు పేరుంది. అలాంటిది ఎన్నికల ముందే పార్టీ వీడటం బీజేపీకి మైనస్‌గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీకి ఉమ్మడి వరంగల్ లో చెప్పుకోదగ్గ స్థాయి ఫేమ్ ఉన్ లీడర్లు ఎవరూ లేరు. దీంతోఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో నిరాశలో ఉన్న కేడర్‌కు, కీలక నేత వీడటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
మున్సిపల్ యుద్ధానికి సిద్ధం
పురపోరుకు అభ్యర్థులను వెతుక్కునే ప్రక్రియలో ఉన్న బీజేపీకి, అరూరి రమేశ్ అనుచర వర్గం కూడా పార్టీని వీడటంతో బలమైన అభ్యర్థుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. పార్టీలో తగిన ప్రాధాన్యత లభించకపోవడం, సొంత కేడర్‌ను కాపాడుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావడంతోనే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కు ఒక్క రోజు ముందే బీజేపీకి గుడ్ బై చెప్పి తన భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా బీఆర్ఎస్లోకి వెళ్లడమే సరైనదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి మున్సిపల్ యుద్ధానికి సిద్ధమవుతున్న బీజేపీకి అరూరి రమేశ్ రూపంలో తగిలిన ఈ షాక్ పురపోరు ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

