Mahabubabad Municipal: గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన ఉన్న సిపిఐ పార్టీ, ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు మునిసిపాలిటీలో సీట్లను ఎక్కువగా ఇవ్వాలని కోరుకుంటుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన నిలబడని సిపిఎం పార్టీతో ఇప్పటికే మునిసిపాలిటీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు పొత్తు కుదిరినట్లుగా విశ్వసనీయ సమాచారం. నాలుగు ఖరారు చేసి మరో సీటు కోసం కాంగ్రెస్, సిపిఎం పార్టీ మధ్యలో చర్చలు జరుగుతున్నట్లుగా కూడా సమాచారం ఉంది. సిపిఐ పార్టీ 10 నుంచి 13 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో హైదరాబాదులో, అర్పణ పల్లిలో, మహబూబాబాద్ క్యాంపు కార్యాలయంలోనూ చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. తాజాగా బుధవారం కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అయినప్పటికీ సిపిఐ, కాంగ్రెస్ పార్టీ మధ్య వార్డు కౌన్సిలర్ సీట్ల సర్దుబాటు కాలేదని తెలుస్తోంది. వార్డు కౌన్సిలర్ల సర్దుబాటు తోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి సిపిఐ పార్టీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా 33 వ వార్డు విషయంలో సిపిఐ పార్టీ తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తుంటే… కాంగ్రెస్ పార్టీ మాత్రం ససేమిరా అంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 33 వ వార్డు ఖరారు అయితేనే ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరే అవకాశం కనిపిస్తుందని పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది.
టిఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సహకరించని సిపిఎం పార్టీతో పొత్తు పెట్టుకోవడంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి సహకారం అందించిన సిపిఐ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునేందుకు మొదటినుంచి ప్రచారం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒంటరిగానే మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. అందులో భాగంగానే స్థానిక 17వ వార్డు అభ్యర్థిగా నరేష్ నామినేషన్ దాఖలు విషయంలో దాదాపు 1000 నుండి 1500 మందితో భారీ ర్యాలీ తీసి నామినేషన్ దాఖలు చేశారు. చైర్మన్ రేస్ లో కూడా ముగ్గురు పేర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు అధికార కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిని స్పష్టంగా ప్రకటించకపోవడం గమనార్హం.
చైర్మన్ పీఠం కోసమే ఆలస్యం
సిపిఎం, సిపిఐ పార్టీలతో పొత్తు కుదురుచుకున్న తర్వాత వార్డు కౌన్సిలర్ల సీట్ల సర్దుబాటు అయిన తర్వాత చైర్మన్ అభ్యర్థిని ప్రకటించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరు వినిపిస్తున్నప్పటికీ ఆయన పేరు కూడా ఇప్పటివరకు స్పష్టంగా బయటకు రాకపోవడం గమనార్హం. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో చైర్మన్ పీఠంతోపాటు వైస్ చైర్మన్ పదవిని కూడా తమ పార్టీకే కేటాయించాలని ఆలోచనతో చైర్మన్ అభ్యర్థిని ప్రకటించడం లేదని విశ్వాసనీయ సమాచారం. మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ తో పాటు డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, కేసముద్రం చైర్మన్ పీఠాలను కూడా దక్కించుకోవాలని యోచనతో కాంగ్రెస్ వ్యవహరిస్తుండడం గమనార్హం. అయితే మహబూబాబాద్ లో చైర్మన్ అభ్యర్థిని అకస్మాత్తుగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా చర్చ జరుగుతోంది.
Also Read: Jogipet Municipality: జోగిపేట మున్సిపాలిటీలో చిత్ర విచిత్రాలు.. ఓటరు జాబితాలో మరణించిన వారి పేర్లు!

