YouTuber Jyothi malhotra: పాక్ స్పైగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి సంచలన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (PIO)తో ఆమెకు సంబంధాలున్నాయనే అభియోగాలపై జ్యోతిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ఆమెను విచారిస్తున్నాయి. ఈ క్రమంలో జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన కీలక డైరీని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మరోవైపు ఇంట్రాగేషన్ లో భాగంగా దర్యాప్తు అధికారులు పలు ముఖ్యమైన ప్రశ్నలను జ్యోతి మల్హోత్రాకు సంధించారు. ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.
డైరీలో ఏముందంటే?
ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను మే 16న గూఢచర్యం ఆరోపణల మీద దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. దర్యాప్తులో భాగంగా హర్యానాలోని హిసార్ లో గల ఆమె నివాసాన్ని నిఘా వర్గాలు పరిశీలించాయి. ఈ క్రమంలో వారికి జ్యోతికి సంబంధించిన డైరీ దొరికింది. అందులో అనుమానస్పదంగా కొన్ని సందేశాలు ఉన్నాయి. ‘ఐ లవ్ యూ’ వంటి పదంతో పాటు ‘సవితను పండ్లు తీసుకురమ్మని చెప్పు. ఇంటిని జాగ్రత్తగా చూసుకో. నేను త్వరలో తిరిగి వస్తాను’ అని రాసి ఉంది. అయితే దీనిని కోడ్ భాషగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఔషధాల గురించి..
జ్యోతి మల్హోత్రా డైరీలో ఔషధాల గురించి ప్రస్తావన ఉండటాన్ని కూడా నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే అది రహస్య కమ్యూనికేషన్ లో భాగమై ఉండొచ్చని NIA, IB అధికారులు అనుమానిస్తున్నాయి. ఆమె రాసిన సెంటెన్స్ ను డీ కోడ్ చేసే పనిలో పడ్డారు. వీటితో పాటు పాక్ పర్యటన సందర్భంగా ఆ దేశంపై జ్యోతి ప్రేమ కురిపించడాన్ని కూడా డైరీలో కనుగొన్నారు. పాకిస్థాన్‌ను ‘క్రేజీ’, ‘రంగుల పాకిస్థాన్’ అని కూడా ఆమె అభివర్ణించింది. అక్కడి అనుభవాలను మాటల్లో చెప్పలేనని రాసుకొచ్చింది. తమ బృందం లాహోర్ ను సందర్శించడానికి రెండు రోజులు సరిపోలేదని కూడా డైరీలో పేర్కొంది.
విదేశీ పర్యటనలపై ఆరా
ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా.. నిఘా సంస్థల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. ఆమెను ఆర్థిక నేరాల విభాగం (EOW), జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), మిలిటరీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా విచారిస్తున్నాయి. ఆమె ఆర్థిక కార్యకలాపాలు, తరుచూ విదేశీ పర్యటనలు చేయడాన్ని పరిశీలిస్తున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడికి ముందు పాకిస్థాన్ పర్యటనలు, చైనా సహా ఆమె చేసిన టూర్లన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పహల్గాం దాడి సమయంలో జ్యోతి.. కాశ్మీర్ లోనే ఉండటంపైనా ఆరా తీస్తున్నారు.
Also Read: Gold Rate Today: మహిళలకు బిగ్ షాక్ .. నేడు భారీగా పెరిగిన గోల్డ్ ధరలు
జ్యోతిని అడిగిన ప్రశ్నలు ఇవే!
ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న జ్యోతి మల్హోత్రాపై నిఘా వర్గాలు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఎహ్సాన్ దార్ అలియాస్ డానిష్‌తో పరిచయంపై ఆమెను ప్రశ్నించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉన్న డానిష్ ను ఎప్పుడు కలిశారు? అతడితో పరిచయం 2023లో వీసా నిరాకరించడానికి ముందు లేదా తర్వాత జరిగిందా? అని జ్యోతిని అడిగారు. డానిష్ ను భారత్ బహిష్కరించినప్పటికీ అతడితో సంబంధాలు కొనసాగించారా? డానిష్ లేదా ఇతర పాక్ వ్యక్తులు.. నిధులు, కంటెంట్ ఐడియాలు ఇచ్చారా? అని ఆరా తీశారు. పాకిస్తాన్‌కి అనుకూలంగా చేసిన వీడియోలు, సందేశాలు ఎవరు చెప్తే చేశారు? పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన తర్వాత భారత భద్రతా దళాలను నిందిస్తూ ఎందుకు వీడియో పెట్టారు? పాకిస్తాన్‌లో డానిష్‌తో పాటు ఎవరెవర్ని కలిశారు? చైనా, దుబాయ్, బంగ్లాదేశ్, భూటాన్‌కు ఆమె ప్రయాణాలు, అందుకు ఎవరైనా ఆర్థిక, లాజిస్టిక్ సహాయం చేశారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.