Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ (Congress Party) మరోసారి చతికిలపడింది. రాజకీయంగా అత్యంత కీలకమైన బీహార్ రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపకుండానే బోల్తా కొట్టింది. కేవలం 6 స్థానాలకే పరిమితం అయ్యింది. అయితే, ఎన్నిక ఏదైనా, హస్తం పార్టీ వెనుకబడినా సోషల్ మీడియా వేదికగా స్పందించే, రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇంతవరకు బీహార్ ఎన్నికల ఫలితాలపై ఇంతవరకు తన స్పందన తెలియజేయలేదు. దీంతో, హస్తం పార్టీ అగ్రనేత ఎక్కడ?, అంటూ బీజేపీ వర్గాలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. వాస్తవానికి రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారనే దానిపై స్పష్టమైన, అధికారిక సమాచారం ఏమీలేదు.
కీలకమైన బీహార్ ఎన్నికల ఫలితాలపై (Bhihar Elections Results) రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడం, ఇంతవరకు స్పందించకుండా మౌనంగా ఉండడం, కాంగ్రెస్ పార్టీ కూడా సైలెంట్‌గా ఉండడంపై రాజకీయ వర్గాలు విమర్శలు గుప్పించేందుకు తావిచ్చినట్టు అయింది. రాహుల్ గాంధీ లండన్, లేదా మిడిల్ ఈస్ట్‌కు వెళ్లారంటూ ఊహాగానాలు ఉన్నాయి. కానీ, ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ వర్గాలు నిర్ధారించలేదు. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లినట్టుగా కాంగ్రెస్ వర్గాలు ఎవరూ ధృవీకరించిన దాఖలాలు లేవు. రాహుల్ గాంధీ లండన్‌లో ఉన్నారంటూ వైరల్ అవుతున్న వీడియోపై హస్తం పార్టీ వర్గాలు స్పందించాయి. రాహుల్ తన మేనకోడలతో ఉన్న ఆ వీడియో పాతదని, సెప్టెంబర్ నెల సందర్శనకు సంబంధించిన వీడియో అని పేర్కొన్నారు.
బీహార్ ప్రచారం కీలక దశలో గాయబ్..
బీహార్ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్‌తో కలిసి జోరుగా ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ, ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకున్నాక మొహం చాటేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి అగ్ర నాయకులు వరుసగా ర్యాలీలు నిర్వహిస్తున్న సమయంలో, రాహుల్ గాంధీ ప్రచారానికి అకస్మాత్తుగా దూరమయ్యారు. ‘ఓటు అధికార్ యాత్ర’ పేరిట బీహార్‌లో కీలక ప్రాంతాల్లో తిరిగారు. సెప్టెంబర్ 1న ఈ యాత్ర ముగిశాక, దక్షిణ అమెరికాలోని ఐదు దేశాల పర్యటనకు వెళ్లారు. అక్టోబర్ 29న తిరిగొచ్చాక మళ్లీ బీహార్ ప్రచారంలో పాల్గొన్నారు. కానీ, కీలకమైన దశలో ప్రచారానికి దూరం కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also- Bihar CM Race: బీహార్‌లో మొదలైన సీఎం రేస్!.. జేడీయూ ట్వీట్ డిలీట్.. బీజేపీ సీఎం అభ్యర్థి ఆయనేనా?
టార్గెట్ చేసిన బీజేపీ
బీహార్ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ ఇంకా స్పందించకపోవడం, కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న మహా ఘట్ బంధన్ ఓటమిపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. ముఖ్యంగా, రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకొని విమర్శల దాడి చేస్తోంది. రాహుల్ గాంధీ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఏకంగా 95 ఎన్నికల్లో ఓడిపోయిందంటూ బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది. ఇక, బీజేపీ సోషల్ మీడియా విభాగాలు పంచ్‌ల మీద పంచ్‌ల పేల్చుతున్నాయి. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్‌గిల్ శుక్రవారం స్పందిస్తూ, రాహుల్ గాంధీ విదేశాల్లోని మరో టైమ్ జోన్ ప్రకారం నిద్రలేచేసరికి, ఎన్డీయే ఇక్కడ ట్రోఫీని గెలుచుకుంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అట్టర్ ఫ్లాప్ అయింది. హస్తం పార్టీ పేలవ ప్రదర్శన ప్రభావం, మిత్రపక్షాలపై కూడా పడింది. ఏఐఎంఐఎం పార్టీ స్థాయిలో కూడా ప్రభావం చూపలేకపోవడం పార్టీకి ఎదురుదెబ్బగా పరిణమిస్తుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
