Kunamneni Sambasiva Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. విజ్ఞతతో ఓటు వేసిన ఓటర్లకు ఆయన మీడియా ప్రకటనలో అభినందనలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం అంశంపైనే ఓటర్లు ఓటు వేసినట్లు స్పష్టమవుతున్నదన్నారు. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన సొంత పార్టీ బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతయ్యిందన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు శుభాకాంక్షలు
పదేండ్లు అదే నియోజకవర్గం ఎంపీగా ఉన్నప్పటికీ ప్రజాసమస్యల పరిష్కారంలో వైఫల్యం, తెలంగాణపై అన్ని రకాలుగా వివక్షత చూపుతున్న కేంద్ర ప్రభుత్వం వైఖరిపై ప్రజలు చూపించిన తీవ్ర వ్యతిరేకతకు ఇది నిదర్శనమన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమస్యలను తీర్చకపోవడం ఆ పార్టీ ఓటమికి కారణమన్నారు. అలాగే సానుభూతి పనిచేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం ప్రజలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపైన ఉన్న విశ్వాసం చూపుతున్న విషయాన్ని సూచిస్తున్నాదని, ముఖ్యమంత్రి, ప్రభుత్వం మరింత బాధ్యతగా సమస్యల పరిష్కారం, హామీల అమలుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉప ఎన్నికలలో సీపీఐ, కాంగ్రెస్‌కు మద్దతు తెలపడమే గాకుండా ప్రచారం చేశామని గుర్తుచేశారు.
బీహార్‌లో ఎన్నికల కమిషన్ విజయం
బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్‌డీఏ సాధించిన విజయం ఆ కూటమిది కాదని ఎన్నికల సంఘానిదేనని కూనంనేని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముంగిట ఆ రాష్ట్రంలో 75 లక్షల మంది మహిళల బ్యాంక్ ఖాతాలలో నితీష్‌కుమార్ ప్రభుత్వం రూ.10వేలు నగదు బదిలీ చేసినా ఎన్నికల సంఘం ఏమాత్రం పట్టించుకోలేదని, అలాగే ఎస్‌ఐఆర్ పేరిట 65 లక్షల ఓట్లు తొలగించారని గుర్తుచేశారు. ఇవ్వన్ని కూడా ఎన్‌డీఏ కూటమి విజయానికి దోహదం చేశాయని అన్నారు. అదే సమయంలో విపక్ష మహా ఘట్‌బంధన్ సైతం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకోకపోవడంతో ప్రజలలో కూటమిపై నెలకొన్న సానుకూలతను ఉపయోగించుకోలేకపోయిందన్నారు. భవిష్యత్‌లో దీనిని ఒక పాఠంగా తీసుకొని సాధ్యమైనంత త్వరగా సర్దుబాటు చేసుకోవాలని ఈ ఎన్నికలు సూచిస్తున్నాయని అన్నారు.
