Saweety Boora: మాజీ ప్రపంచ ఛాంపియన్ ఇండియన్ మహిళా బాక్సర్ సావీటీ బూరా (Saweety Boora).. వరకట్న వేధింపుల బారిన పడినట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ కబడ్డీ ప్లేయర్ దీపక్ నివాస్ హుడా (Deepak Niwas Hooda)ను పెళ్లి చేసుకున్న ఆమెకు అత్తింటి నుంచి వేధింపులు మెుదలైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె భర్తకు విడాకులు ఇచ్చేందుకు సైతం సిద్ధమైంది. ప్రస్తుతం విడాకుల మంజూరు ప్రక్రియ కొనసాగుతున్న వారిద్దరికీ సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందులో భర్త దీపక్ హూడాపై సావీటీ దాడి చేస్తూ కనిపించింది.
పోలీసు స్టేషన్ లోనే
మార్చి 15న ఈ దాడి ఘటన జరగ్గా తాజాగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హర్యానాలోని హిసార్ పోలీసు స్టేషన్ లో భర్త దీపక్ నివాస్ హుడాపై మహిళా బాక్సర్ సావీటీ బూరా ఫిర్యాదు చేసింది. తనను వరకట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు వేధించినట్లు పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలో స్టేషన్ కు వచ్చిన దీపక్ హుడా అతడి ఫ్యామిలీ వెయిటింగ్ హాల్ లో కూర్చొని ఉన్నారు. అతడికి ఎదురుగానే సావీటీ కూర్చుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తురాలైన బాక్సర్.. దీపక్ వైపు దూసుకెళ్లింది.
From Champions to Courtroom!
Saweety Bora a boxer vs. Deepak Hooda an Indian kabaddi team captain.– DV vs. Fraud claims! #viralvideo #MenToo pic.twitter.com/Wdn96V3eY2
— ShoneeKapoor (@ShoneeKapoor) March 25, 2025
గొంతు పట్టుకొని..
కూర్చిలో కూర్చొని ఉన్న దీపక్ హుడా భుజాలను వెనక్కి తోసి అతడి గొంతును సావీటీ బలంగా పట్టుకుంది. ఆపై దీపక్ ను బిగ్గరగా అరుస్తూ అతడి తప్పులను ఎత్తి చూపింది. ఈ ఘటనతో పోలీసు స్టేషన్ లో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో అప్రమత్తమైన ఇరుకుటుంబాల సభ్యులు.. సావీటీని వెనక్కి తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పోలీసు స్టేషన్ లోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అయితే సావీటీ మీదకు దూసుకొచ్చిన సమయంలో భర్త దీపక్ నవ్వుతూ ఆమెను మరింత రెచ్చగొట్టడం చూడవచ్చు.
2022లో వివాహం
ఇదిలా ఉంటే సావీటీ బూరా – దీపక్ హుడాకు 2022లో వివాహమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న హర్యానాలోని హిసార్‌లో పోలీసు స్టేషన్ లో భర్త, అతడి కుటుంబ సభ్యులపై సావీటీ ఫిర్యాదు చేసింది. పుట్టింటి నుంచి ఎస్ యూవీ కారుతో పాటు రూ.కోటి నగదు తేవాలని తనపై దాడి చేసినట్లు ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అప్పట్లో ఈ వార్త జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. అయితే భర్త దీపక్ హుడాకు పోలీసులు 2-3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అతడు స్టేషన్ వెళ్లలేదు. ఈ క్రమంలో మార్చి 15న అతడు పోలీసు స్టేషన్ కు వెళ్లగా సావీటీ – దీపక్ మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం గమనార్హం.
Also Read: AICC – Telangana Cabinet: ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్.. ఉగాదిలోపే కొత్త మంత్రులు!
ఇరువురూ జాతీయ ప్లేయర్లే
మహిళా బాక్సింగ్ విభాగంలో సావీటీ బురా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. 2023లో ఆమె ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్స్ టైటిల్ ను గెలుచుకుంది. అంతర్జాతీయ వేదికకపై భారత్ కు బంగారు పతకాన్ని అందించింది. ఇందుకు గాను ఈ ఏడాదే ఆమెకు అర్జున అవార్డును అందించి కేంద్రం గౌరవించింది. మరోవైపు కబడ్డి ప్లేయర్ దీపక్ హుడాకు సైతం మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. 2020లోనే అతడికి అర్జున పురస్కారం వరించింది.