Jagdeep Dhankhar: అనారోగ్య కారణాల రీత్యా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఆయన పంపించిన రాజీనామా లేఖపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదముద్ర వేశారు. ఈ విషయాన్ని నోటిఫై చేసిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఏ) ప్రకారం, రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చిందని హోంశాఖ వివరించింది. మరోవైపు, బీజేపీ ఎంపీ ఘనశ్యామ్ తివారీ రాజ్యసభలో సభాధ్యక్ష స్థానం నుంచి ధన్‌ఖడ్ రాజీనామా విషయాన్ని ప్రకటించారు. రాజీనామాకు రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేశారని తెలిపారు.
మరో రెండేళ్లు ఉండగానే..
జగదీప్ ధన్‌ఖడ్ తన అనారోగ్య కారణాలతో ఆర్టికల్ 67(ఏ) ప్రకారం, సోమవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తూ లేఖను రాష్ట్రపతి ముర్ముకు పంపించారు. వైద్యుల సలహా మేరకు ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని, తక్షణమే రాజీనామా చేస్తున్నట్టు వివరించారు. జగదీప్ ధన్‌ఖడ్ 2022లో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. పదవీ కాలం మరో రెండు సంవత్సరాలు, అంటే 2027 ఆగస్టు వరకు మిగిలి ఉండగానే పదవి నుంచి ఆయన వైదొలిగారు. ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది. దీంతో, కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
స్పందించిన ప్రధాని మోదీ
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మికంగా రాజీనామా చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దేశానికి ధన్‌ఖడ్ అందించిన సేవలను గుర్తుచేసుకున్న ప్రధాని, భవిష్యత్‌లో ఆరోగ్యంతో చక్కగా ఉండాలంటూ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతితో పాటు వివిధ పదవుల్లో దేశానికి సేవ చేసే అవకాశాలు పొందారు. కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను’’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ధన్‌ఖడ్ దేశ ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్ పదవిని కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ వర్షాకాల సెషన్ మొదటి రోజే ధన్‌ఖడ్ రాజీనామా సభ దృష్టికి రావడం గమనార్హం.
Read Also- Viral News: అమ్మను అవమానించిన వ్యక్తి కోసం పదేళ్లు వెతికి.. దొరికిన వెంటనే..
అనారోగ్యం ఏమిటో?
ధన్‌ఖడ్ రాజీనామా చేయడానికి దారితీసిన అనారోగ్య కారణాలను అధికారికంగా ఎక్కడా పేర్కొనలేదు. రాజీనామా లేఖలో, లేదా రాష్ట్రపతి కార్యాలయ ప్రకటనలో ఎక్కడా ప్రస్తావించలేదు. ధన్‌ఖడ్ ప్రస్తుత వయస్సు 74 సంవత్సరాలు. ‘వైద్యుల సూచనల మేరకు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చేందుకు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఏ) ప్రకారం రాజీనామా చేస్తున్నాను’ అంటూ మాత్రమే రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దీంతో, రాజకీయ, మీడియా వర్గాల్లో పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయినప్పటికీ అనారోగ్య పరిస్థితిపై వివరాలను బయటపెట్టలేదు. అయితే, కొంతకాల క్రితం ధన్‌ఖడ్ అస్వస్థకు గురయ్యారు. హాస్పిటల్‌లో చేరిన ఆయనను ప్రధాని మోదీ సహా ప్రభుత్వ పెద్దలు హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. హృదయ సంబంధ సమస్యలు ఉన్నాయంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.
అనారోగ్య కారణాలు చెప్పకపోవడంపై విపక్ష పార్టీల్లో ఒకింత సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ధన్‌ఖడ్ రాజీనామా వెనుక కేవలం అనారోగ్యమే కారణం కాకపోవచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు, మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే, ఇవన్నీ ఆధారాలు లేని ఊహాగానాలే.
Read also- Fitness: ఫుడ్‌లో ఈ చిన్న మార్పులు చేస్తే చాలు.. అద్భుతమైన ఆరోగ్యం!