Tariff Rollback: రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఊతమిస్తున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత వస్తువులపై సుంకాలపై 25 శాతం నుంచి ఏకంగా 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత భారత్-అమెరికా మధ్య దౌత్యసంబంధాలు సున్నితంగా మారాయి. అయితే, అమెరికా విధించిన సుంకాలు త్వరలోనే తగ్గుతాయని (Tariff Rollback) భారత ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత వస్తువులపై అమెరికా విధించిన జరిమానా సుంకాలను త్వరలోనే ఉపసంహరించుకునే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే కొన్ని వారాలలోనే పరస్పర సుంకాలను తగ్గించుకునే అవకాశం ఉందన్నారు. తద్వారా అధిక సుంకాల ప్రభావంతో ఇబ్బంది పడుతున్న భారత ఎగుమతిదారులకు ఉపశమనం దక్కుతుందని అనంత నాగేశ్వరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Read Also- PCB: పాకిస్థాన్ బిగ్ ట్విస్ట్.. కెప్టెన్ సూర్యపై ఫిర్యాదుకు నిర్ణయం.. కారణం ఏంటంటే?
ఆగస్టు నెలలో అమెరికా విధించిన 25 శాతం పెనాల్టీ టారిఫ్‌లు ఈ ఏడాది నవంబర్ నెల చివరిలోగా ఉపసంహరించుకునే అవకాశం ఉందని అనంత నాగేశ్వరన్ అన్నారు. తాను ఏవిధమైన ఆధారాలను బట్టి చెప్పడంలేదని, ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని చెబుతున్నానని క్లారిటీ ఇచ్చారు. వచ్చే రెండు నెలల్లో టారిఫ్‌ల తగ్గింపు నిర్ణయం ఉండవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. జరిమానా సుంకాల ఎత్తివేతతో పాటు పరస్పర సుంకాల విషయంలో కూడా ఒక పరిష్కారం లభించవచ్చని అనంత నాగేశ్వరన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సుంకాలు 10-15 శాతానికి తగ్గింపు!
అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన ప్రకారం ప్రస్తుతం ఇరుదేశాల మధ్య 25 శాతం పరస్పర టారిఫ్‌లు కొనసాగుతున్నాయి. అయితే, ఈ సుంకాలను 10–15 శాతం స్థాయికి తగ్గించే అవకాశం ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. టారిఫ్ వివాదం మరో 8–10 వారాల్లో పరిష్కారం అవ్వొచ్చని ఆయన విశ్లేషించారు. తాను చెబుతున్నది పూర్తిగా తన అంతర్గత అభిప్రాయమేనని, అధికారిక హామీ కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. భారత వాణిజ్య చర్చల ప్రధాన ప్రతినిధి, వాణిజ్య మంత్రిత్వశాఖ స్పెషల్ సెక్రటరీ రాజేశ్ అగర్వాల్ – అమెరికా సౌత్ అండ్ సెంట్రల్ ఆసియా ట్రేడ్ రిప్రజెంటేటివ్ బ్రెండన్ లించ్ మధ్య ఇటీవల ఢిల్లీలో ముఖాముఖి భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఎగుమతులపై ట్రంప్ అదనపు టారిఫ్‌లు విధించిన తర్వాత జరిగిన మొదటి భేటీ ఇదే కావడం గమనార్హం.
Read Also- Rahul Gandhi: అన్నంత పని చేసిన రాహుల్.. ఈసీపై హైడ్రోజన్ బాంబ్.. వారం డెడ్ లైన్!
కాగా, కొన్ని భారతీయ ఉత్పత్తులపై అమెరికా గరిష్టంగా 50 శాతం వరకూ సుంకాలు విధిస్తోంది. దీంతో, టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్ వస్తువులు, ఫుడ్ ప్రొడక్ట్స్ వంటి రంగాల ఎగుమతిదారులకు లాభాలు గణనీయంగా తగ్గిపోయాయి. అయితే, పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా సుంకాలను తగ్గిస్తే, భారం తగ్గుతుందని సంబంధిత వ్యాపార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తద్వారా భారత–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో తిరిగి స్థిరత్వం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.