Dharmasthala Case: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్న ధర్మస్థల ‘సామూహిక ఖననాల’ కేసు (Dharmasthala mass burial case) దర్యాప్తు ఊహించని మలుపు తిరిగింది. సామూహిక అత్యాచారాలు, హత్యలు జరిగాయంటూ ఫిర్యాదు చేసిన వ్యక్తి సీఎన్ చిన్నయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ అతడిని శనివారం అదుపులోకి తీసుకుంది. ఇన్నాళ్లూ అతడి వివరాలు బయటకు తెలియకుండా గోప్యత పాటించిన సిట్… అతడి పేరు సీఎన్. చిన్నయ్య అలియాస్ చెన్నా (CN Chinnayya alias Chenna) అని బహిర్గతం చేసింది.
ఈ కేసులో చిన్నయ్య తనను తాను విసిల్ బ్లోయర్‌గా (Whistleblower) చెప్పుకుంటూ వచ్చాడు. సామూహిక హత్యలు, ఖననాలు జరిగాయంటూ ఆరోపణలు చేశాడు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. తనకు చట్టపరమైన రక్షణ ఇవ్వాలంటూ చిన్నయ్య కోరాడు. అతడి ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సమగ్ర దర్యాప్తు చేపట్టిన సిట్.. చిన్నయ్య ఆరోపణలు తప్పని, కల్పితమైనవిగా తేల్చింది. అందుకే, చిన్నయ్యను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు.
Read Also- River In China: రివర్స్‌లో ప్రవహిస్తున్న నది.. వీక్షించేందుకు తరలివెళుతున్న జనం
మరో బిగ్ ట్విస్ట్ ఇదే..
ధర్మస్థల కేసులో మరో బిగ్ ట్విస్ట్ కూడా చోటుచేసుకుంది. తన కూతురు ధర్మస్థలలో అదృశ్యమైందంటూ గతంలో ఫిర్యాదు చేసిన ఓ మహిళ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. కాగా, చిన్నయ్యను పోలీసులు ఇవాళ (శనివారం) న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. అంతకంటే ముందు అతడికి వైద్య పరీక్షలు చేయించనున్నారు. మొత్తంగా చూస్తే ధర్మస్థల కేసు ఫేక్ వ్యవహారంగా మారుతోంది. ఫిర్యాదుదారుడుగా ఉన్న చిన్నయ్య తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అరెస్ట్ కావడం, కేసు దర్యాప్తును మార్చివేసిందని చెప్పవచ్చు.
చిన్నయ్య మంచోడు కాదు: మొదటి భార్య
ధర్మస్థల కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న చిన్నయ్యపై అతడి మొదటి భార్య తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. చిన్నయ్య ఆరోపణలన్నీ తప్పుడువేనని, ఆ వ్యక్తి మంచివాడు కాదని ఆమె చెప్పింది. ‘‘నన్ను, నా పిల్లల్ని వేధించేవాడు. ధర్మస్థల కేసులో అతడు చెబుతున్న మాటల్లో నిజం లేదు. డబ్బు కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్టుగా ఉన్నారు’’ అని ఆమె ఆరోపించింది. చిన్నయ్యను తాను 1999లో పెళ్లి చేసుకున్నానని, ఏడేళ్లు కలిసి ఉన్నట్టు తెలిపింది. ఒక కొడుకు, కూతురు ఉన్నారని ఆమె చెప్పారు. చిన్నయ్య ధర్మస్థలలో టాయిలెట్ క్లీనర్‌గా పనిచేసేవాడని, ఆ సమయంలోనే తాను విడాకులు తీసుకున్నట్టు ఆమె తెలిపారు.
Read Also- Rohit – Virat: కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్‌పై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ కీలక ప్రకటన
చిన్నయ్యను తప్పుబట్టిన స్నేహితుడు
చిన్నయ్య ఆరోపణలను రాజు అనే అతడి స్నేహితుడు కూడా కొట్టిపాడేశాడు. ‘‘ చిన్నయ్య ఫ్రెండ్‌గా చెబుతున్నా, అతడి ఆరోపణలు పూర్తిగా అబద్ధం’’ అని అన్నాడు. 10 ఏళ్ల క్రితం ధర్మస్థలలో తాను కూడా స్వీపర్‌గా పనిచేశానని, చిన్నయ్యతో కలిసి నాలుగేళ్లు పనిచేశానని అతడు తెలిపాడు. బహుబలి బెట్టా, ఘాట్ దగ్గర, ఆలయం వద్ద పని చేసేవారమని వివరించాడు. ‘‘మాకు మంచి భోజనం, శాలరీ ఇచ్చేవారు. మేమిద్దరం ఇరుగుపొరుగువారమే. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న స్త్రీ, పురుషుల మృతదేహాలు కొన్ని చూశాం. చెట్లకు వేలాడి ఉంటే ఆ శవాలను కిందకు దించి అంబులెన్సుల ద్వారా తరలించేవాళ్లం. కానీ, ఎప్పుడూ శవాలను పాతిపెట్టలేదు. అలా చేయాలంటూ ఎవరూ బలవంతం కూడా చేయలేదు. పోలీసుల అనుమతి లేకుండా ఏ శవాన్నీ పూడ్చిపెట్టలేదు’’ అని చిన్నయ్య ఫ్రెండ్ రాజు వివరించాడు. చిన్నయ్య డబ్బు కోసమే ఈ ఆరోపణలు చేసి ఉండవచ్చని రాజు అనుమానం వ్యక్తం చేశాడు.