Tariff on India: భారత్ స్నేహపూర్వక దేశమంటూ ఇన్నాళ్లూ కళ్లబొల్లి కబుర్లు చెబుతూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బుధవారం సంచలన ప్రకటన చేశారు. భారత్ దిగుమతులపై అమెరికాలో ఏకంగా 25 శాతం సుంకాలు (Tariff on India) విధించబోతున్నట్టు ప్రకటించారు. ఈ నూతన టారిఫ్ వడ్డన 2025 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం టారిఫ్‌తో పాటు అదనపు జరిమానాలు కూడా అమల్లోకి వస్తాయని వివరించారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను కొనసాగించడం, ఇరుదేశాల మధ్య ఎప్పటినుంచో కొనసాగుతున్న వాణిజ్య అవరోధాలు ఇందుకు ప్రధాన కారణాలని ట్రంప్ పేర్కొన్నారు.
మిత్రదేశమే కానీ..
భారత్ దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్టుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ (Truth Social) వేదికగా ప్రకటించారు. “భారత్ మిత్ర దేశమే అయినప్పటికీనా… ఆ దేశ సుంకాలు చాలా ఎక్కువగా ఉండడంతో వాళ్లతో మనం పెద్దగా వాణిజ్యం చేయలేకపోయాం. భారత సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉండేవి. ఏ దేశమూ అమలు చేయని అత్యంత సంక్లిష్టమైన వ్యాపార విధానాలు, నిబంధనలు అవరోధాలుగా మారి చాలా ఇబ్బందులు పెట్టాయి’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
Read Also- Viral News: కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రం కోరుతూ అప్లికేషన్.. కలెక్టర్ ఏం చేశారంటే?
రష్యాతో దోస్తీపై గుస్సా!
మరో కీలక విషయాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించారు. రష్యాతో భారత్‌కు ఉన్న రక్షణ, ఇంధన బంధాలను కూడా ట్రంప్ పేర్కొన్నారు. “భారత్ రక్షణ అవసరాల కోసం ఎప్పటినుంచో రష్యాపై ఆధారపడుతోంది. మెజారిటీ సైనిక పరికరాలను రష్యా నుంచే కొనుగోలు చేస్తోంది. చైనా మాదిరిగా, భారత్ కూడా రష్యా నుంచి భారీగా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న దేశాల్లో ఒకటిగా ఉంది. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం ఆపాలని ప్రపంచమంతా కోరుకుంటున్న ఈ సమయంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ మంచి పరిణామాలు కావు!. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆగస్ట్ 1 నుంచి భారత్ దిగుమతులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తు్న్నాం. పైన పేర్కొన్న కారణాలతో అదనంగా జరిమానాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. దృష్టి పెట్టి ఈ విషయాన్ని తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. మాగా! (Make America Great Again) అని రాసుకొచ్చారు.
Read Also- Health: ఎక్స్‌ట్రా ఉప్పు వేసుకొని తింటున్నారా?.. శరీరంలో ఏం జరుగుతుందంటే?
అంతలోనే మాటమార్చి..
డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్ ప్రకటన చేయడానికి ముందు రోజు, అంటే మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారత్‌తో ఇప్పటివరకు ఎలాంటి వాణిజ్యం ఒప్పందం తుదిరూపం దాల్చుకోలేదని భారత్‌పై నిందలు వేశారు. అమెరికా అధికారులు కూడా ఇదే చెప్పారు. భారత్, అమెరికా మధ్య గత కొన్ని నెలలుగా వ్యాపార ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఇంకా తుది రూపానికి చేరుకోలేదని అని వివరించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ డీల్‌ను వేగవంతం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. అంతలోనే 25 శాతం టారిఫ్ విధిస్తూ ప్రకటన చేయడం షాకింగ్‌కు గురిచేస్తోంది. నిజానికి ట్రంప్ ధోరణి ఒక్క భారత్ విషయంలోనే కాదు. ఇతర అనేక దేశాల పట్ల కూడా ఆయన ఇదే విధంగా నడుచుకున్నారు. పలు దేశాలతో ఆయన జరిపిన ట్రేడ్ చర్చల్లోనూ ఈ విషయం బయటపడింది. భారత్ విషయంలోనూ కూడా ఇదే ధోరణిని కనబరిచారు.