Train Hits Elephants: శనివారం వేకులజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. సైరాంగ్ – న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఈశాన్య రాష్ట్రం అస్సాంలోని (Assam Train Accident) హోజాయ్ జిల్లాలో ప్రమాదానికి గురైంది. రైల్వే ట్రాక్‌పై వెళుతున్న ఏనుగుల మందను (Train Hits Elephants) రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏకంగా ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే చనిపోయాయి. మరో ఏనుగు కూడా తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదం ధాటికి ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే, అదృష్టవశాత్తూ రైలులోని ప్యాసింజర్లు అందరూ సురక్షితంగా ఉన్నారు. ఒక ప్రయాణికుడి మాత్రమే గాయాలయ్యాయి. నాగౌన్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుభాష్ కదం ఏనుగుల మృతిపై సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఏనుగుల కళేబరాలను తొలగించి పనులను అటవీ శాఖ సిబ్బంది చేస్తున్నారు. మరోవైపు, రైల్వే అధికారులు ఆ మార్గంలో తిరిగి రైల్వే సేవలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారు.
Read Also- Vithika New House: వరుణ్ సందేశ్ కలల సౌధాన్ని చూశారా.. ఏం ఉంది బాసూ..
బ్రేకులు వేసినా ఫలితం లేదు
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) వెల్లడించింది. శనివారం వేకువజామున సుమారుగా 2.15 గంటల సమయంలో లమ్డింగ్ డివిజన్‌లోని జమునాముఖ్ – కాంపూర్ సెక్షన్ మధ్య ఈ ప్రమాదం జరిగినట్టు వివరించింది. పట్టాలపైకి ఏనుగులు అకస్మాత్తుగా వచ్చాయని, ఏనుగుల వస్తున్న విషయాన్ని లోకో పైలట్ గుర్తించి, ఎమర్జెన్సీ బ్రేకులు వేశారని, అయినప్పటికీ ప్రమాదం తప్పలేదని ఎన్ఎఫ్ఆర్ పేర్కొంది. ఏనుగులు అప్పటికే దగ్గరగా ఉండడంతో రైలు వేగంగా వెళ్లి, బలంగా ఏనుగులను ఢీకొట్టిందని వివరించింది. ఎనిమిది ఏనుగులు బలానికి రైలులోని ఐదు కోచ్‌లు కూడా పట్టాలు తప్పాయని తెలిపింది. అయితే, ప్యాసింజర్లకు ఎలాంటి హాని జరగలేదని, కొన్ని కోచ్‌లు డ్యామేజ్ కావడంతో, సీట్లు ఖాళీ ఉన్న మిగతా కోచ్‌లలోకి ప్యాసింజర్లను మార్చినట్టు ఈశాన్య సరిహద్దు రైల్వే అధికారులు వివరించారు.
Read Also- Maoists Surrender: అజ్ఞాతంలో ఉన్నవారు జన జీవనంలోకి రండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి సూచన
కాగా, ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే, ఎన్ఎఫ్‌ఆర్ జనరల్ మేనేజర్, లమ్డింగ్ డివిజన్ రైల్వే మేనేజర్‌తో పాటు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లారు. పరిస్థితిని దగ్గర నుంచి పర్యవేక్షించారు. కాగా, ఉదయం 6.15 గంటల సమయంలో రైలు తిరిగి గౌహతి వైపు బయలుదేరింది. గౌహతి చేరుకున్న తర్వాత మరికొన్ని బోగీలను జోడించి ప్రయాణికులను అందులోకి పంపించారు. ఆ తర్వాత రైలు ఢిల్లీకి బయలుదేరిందని అధికారులు మీడియాకు తెలిపారు. కాగా, ఈ రైలు ప్రమాదం కారణంగా జమునాముఖ్ – కాంపూర్ సెక్షన్‌లో రైళ్లకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు నిలిచిపోయాయి. కొన్ని రైళ్లను వేరే మార్గం నడిపించారు. కాగా, సైరాంగ్ – న్యూఢిల్లీ రైల్వే మార్గంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగానే ఉంటాయి. కానీ, అధికారికంగా ఈ ప్రాంతాన్ని ఎలిఫెంట్ కారిడార్ కాదని తెలుస్తోంది. అదే ఎలిఫెంట్ కారిడార్ అయితే, నిబంధనల ప్రకారం, ట్రైన్ వేగాన్ని తగ్గించి నడపాల్సి ఉంటుంది. నిర్దిష్టమైన స్పీడ్ లిమిట్‌ను మాత్రమే లోకోపైలెట్లు మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది.

