AC Helmets: వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ప్రజలు భయటకు వెళ్లాలంటే భానుడి భగభగకు భయపడిపోతున్నారు. దీంతో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్లటానికి సాహసించటం లేదు. అయితే చిరువ్యాపారులు, ఉద్యోగస్తులు కొందరు బయటకు వెళ్లడం తప్పని పరిస్థితి. ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసుల పరిస్థితి అయితే చెప్పనక్కర లేదు.
ఎండనకా, వాననకా డ్యూటీ సమయంలో రోడ్డుపై నిలబడి విధులు నిర్వర్తించాల్సిందే. సాధారణ రోజుల్లో ఏమోకానీ వేసవిలో మండే ఎండలకు విధులు నిర్వర్తించాలంటే అది సాహసమే.. ఈ నేపథ్యంలోనే వారిక కాస్త ఉపశమనాన్ని ఇచ్చే ఆలోచన చేశారు పోలీసు ఉన్నతాధికారులు. ఎండలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల కోసం ఏసీ హెల్మెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే వీటిని ఏ ప్రాంతంలో వినియోగంలోకి తీసుకువస్తున్నారు.. అవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ముదురుతున్న ఎండలు
ఎండలు మంట పుట్టిస్తున్నాయి. ఇప్పుడే ఈ స్థాయిలో ఉంటే ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరిలో వర్షపాతం సాధారణం కంటే 50 శాతం తగ్గిందని, దీంతో భూమిలో, గాలిలో తేమశాతం తగ్గాయని.. దేశంలో వేడి పెరగడానికి ఇదో కారణమని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. 125 సంవత్సరాల సరాసరితో పోల్చితే ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
1901 నుంచి 2025 వరకు సరాసరి తీసుకుంటే ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలలో ఎండ తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రతతో పాటు వడగాలుల శాతం కూడా పెరుగుతోంది. దక్షిణ తెలంగాణలో ఎండ తీవ్రత సాధారణ స్థాయి కంటే పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
ఈ నేపథ్యంలో బయటకు వెళ్తే గాని బతుకుబండి సాగని వారికి ఇబ్బందులు తప్పేలా లేవు. వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎండలో ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసుల కోసం చెన్నైలోని అవడి ట్రాఫిక్ పోలీసులు ఏసీ హెల్మెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి మైనస్ 15 డిగ్రీల చల్లదనాన్ని, 10 డిగ్రీల వెచ్చదనాన్ని ఇస్తాయని వారు తెలిపారు.
మూడు రెట్లు చల్లదనం..
అవడి సిటీ పోలీస్ కమిషనర్ శంకర్ మాట్లాడుతూ.. వీటిని ధరించిన వారి మెడ కింది భాగం కన్నా తల భాగంలో మూడు రెట్ల చల్లదనాన్ని హెల్మెట్లు ఇస్తాయని పేర్కొన్నారు. ఈ హెల్మెట్ల వల్ల తలనొప్పి, అలసట వంటివి తగ్గుతాయని చెప్పారు. ఏసీ ఆన్ చేసినప్పుడు హెల్మెట్‌లో కాస్త వైబ్రేషన్ వస్తుందని తెలిపారు.
Also Read: Jangaon District: జనగామ జిల్లాలో క్షుద్ర పూజలు? యువతి టార్గెట్ అంటూ చర్చ?
తమ పరిధిలో 334 మంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లు పని చేస్తున్నారని.., ప్రస్తుతం 50 మందికి ఏసీ హెల్మెట్లు ఇచ్చామని చెప్పారు. వీటి పనితీరును పరిశీలించిన తర్వాత మిగిలిన వారికి కూడా ఏసీ హెల్మెట్లు ఇస్తామని తెలిపారు. ఈ ఏసీ హెల్మెట్ ఐడియా ట్రాఫిక్ పోలీసులకు కొంత ఉపశమనం కల్పిస్తుందనేది వాస్తవం. అయితే ఇది తమిళనాడు రాష్ట్రం అవడిలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. ఇది సక్సెస్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి తెచ్చే అవకాశమూ లేకపోలేదు.