Jangaon District: అర్ధరాత్రి భయానక శబ్దాలు.. అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి. చీకట్లో ఎవరు అక్కడికి వెళ్లాలన్నా.. భయం భయం.. తెల్లారి చూడగానే.. కోడి, పసుపు, కుంకుమ.. ఇవన్నీ చూసిన ఆ గ్రామస్తులకు కాళ్లు, చేతులు గజగజ వణికి పోయాయి. అంతేకాదు.. ఇక్కడ మరో వింత వస్తువులు కూడా గ్రామస్తుల కంట పడ్డాయి. దీనితో ఏదో జరిగిందంటూ గ్రామస్తులు వణికిపోతున్నారు. ఇంతకు అక్కడ జరిగిందేంటి? అసలేం జరుగుతోంది?
ఉదయాన్నే గ్రామస్తులు నిద్ర లేచి అలా ఓ వాగు వైపు వెళ్లారు. ఇక్కడి నుండే రాత్రి వింత శబ్దాలు వినిపించాయని కొందరు చెప్పుకొచ్చారు. అసలేం జరిగిందో చూసేందుకు ఎట్టకేలకు కొందరు వాగు వద్దకు వెళ్లారు. ఇక అంతే.. పరుగులు పెట్టారు. ఊరంతా ఏకమయ్యారు. ఎక్కడ చూసినా ఇదే చర్చకు దారి తీసింది. జనగామ జిల్లాలో ఈ పరిస్థితి కనిపించింది. పాలకుర్తి గ్రామ శివారు దర్ధపల్లి వాగులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఈ వాగు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లు గ్రామస్తులు గుర్తించారు.
కోడిని బలిచ్చినట్లు, అలాగే పసుపు కుంకుమ నిమ్మకాయలతో పూజలు నిర్వహించినట్లు వారు భావిస్తున్నారు. గ్రామస్తుల అనుమానం నిజమయ్యేలా అక్కడ అన్ని సాక్ష్యాలు ఉండడంతో వారిలో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. క్షుద్రపూజలు చేసిన స్థలంలో ఓ యువతి దుస్తులు ఉండడంతో అసలేం జరిగిందనే కోణంలో పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. యువతికి చేతబడి చేసినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో మంత్రాల శబ్దాలు విని అప్పటికే కొందరు ఘటన స్థలానికి రైతులు వెళ్లినట్లు గ్రామస్తులు గుర్తించారు.
ఆ రైతులను చూసి ముగ్గురు వ్యక్తులు పారిపోయారని, రైతులు తెలుపుతున్నారు. అయితే యువతి దుస్తులు ఉంచి మరీ క్షుద్రపూజలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఇంతకు ఆ యువతి ఎవరై ఉంటారని చర్చ సాగుతోంది. ఎవరైనా యువకులు వశీకరణం పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.
మొత్తం మీద క్షుద్ర పూజల కలకలంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి గ్రామంలో ఉంది. నేటి ఆధునిక కాలంలో కూడా ఇటువంటి వాటిని నమ్మాల్సిన అవసరం లేదని గ్రామస్తులను కొందరు చైతన్యవంతులను చేస్తున్నా, వారిలో మాత్రం భయం తగ్గడం లేదని చెప్పవచ్చు.
Also Read: Komatireddy Brothers: ఆ ఇద్దరి గురించే ఇక్కడ చర్చ.. అవకాశం వచ్చేనా? జారేనా?
ఏదిఏమైనా ఇలాంటి భయం కల్పించే ఘటనలకు పాల్పడుతున్న వారిని, వదిలిపెట్టకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే సైన్స్ పై గ్రామస్తులకు అవగాహన కల్పించి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టాల్సిన భాద్యత అధికారులపై ఉందని పలువురు సూచిస్తున్నారు.