Komatireddy Brothers: మంత్రివర్గ విస్తరణలో కొందరి పేర్లపై ఎలాంటి వివాదం లేకపోయినా గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విషయంలో మాత్రం పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి. ఒకే ఫ్యామిలీ నుంచి ఇంతమందికి అవకాశాలు ఇవ్వడం అవసరమా?.. అనేది ఒక అంశమైతే, సామాజికవర్గం రీత్యా మిగిలిన కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం లేకుండా పోతున్నదనేది మరో అంశం.
వాకిటి శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్, ఫహీమ్ ఖురేషీ/అమెర్ ఆలీ ఖాన్, సుదర్శన్ రెడ్డి విషయంలో పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయం లేకపోయినా పై ఇద్దరి విషయంలో మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ రెండూ ఏఐసీసీ కోటా కావడంతో బహిరంగంగా పార్టీ నేతలు విమర్శలు చేయకపోయినా, వ్యాఖ్యానించకపోయినా రాష్ట్ర నేతలు, ఎమ్మెల్యేలు పరస్పరం చర్చించుకుంటున్నారు. ఏఐసీసీ నిర్ణయం ఫైనల్ అయినప్పటికీ వారికి మంత్రివర్గంలో చోటు ఇవ్వడం ద్వారా రాష్ట్ర యూనిట్‌లోని వ్యతిరేకతను బ్యాలెన్స్ చేయడం కూడా ముఖ్యమనేది వారి అభిప్రాయం.
గడ్డం వివేక్ కుటుంబంలో సోదరుడు వినోద్ ఎమ్మెల్యేగా, కుమారుడు ఎంపీగా ఉన్నందున ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనేది పార్టీ నేతలు సంధిస్తున్న ప్రశ్న. దీనికి తోడు మాదిగల అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్పుకునే సమయంలో మాల సామాజికవర్గానికి చెందిన ఆయనకు అవకాశం ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకున్న సంగతి అధికారికంగా వెల్లడి కాకపోయినా అలాంటి పరిస్థితులు ఉన్నాయనే అంచనాతో ఈ చర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విషయంలోనూ ఇదే తరహా చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారని, అదే ఫ్యామిలీలో రెండో అవకాశం ఇవ్వడం చాలామంది ఎమ్మెల్యేలకు మింగుడుపడడంలేదు. నల్లగొండ జిల్లా నేతల్లో, ఎమ్మెల్యేలలో ఈ చర్చ ఒకింత ఎక్కువ స్థాయిలో జరుగుతున్నది. ఈ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీలకు అవకాశం దక్కిందని, మంత్రివర్గంలో ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారని, ఇప్పుడు క్యాబినెట్‌లో మూడో అవకాశం కూడా ఆ జిల్లాకే ఇవ్వడం చర్చకు దారితీసింది.
ఇంకోవైపు అదే జిల్లాకు చెందిన బాలు నాయక్ (దేవరకొండ ఎమ్మెల్యే)కు డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ భావిస్తున్నదనే అంశం కూడా చర్చల్లో నలుగుతున్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం తన భార్య (కోదాడ ఎమ్మెల్యే) పద్మావతికి మంత్రిగా లేదా డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు పార్టీ నేతలే ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఒకే జిల్లా, ఒకే ఫ్యామిలీ అనే అంశాలపై పార్టీలో నెలకొన్న పరిస్థితిని గమనంలోకి తీసుకుని ఏఐసీసీ ఎలాంటి స్పష్టతకు వస్తుందన్నది కీలకంగా మారింది.
నేను హోం మంత్రికి సూటబుల్ : రాజగోపాల్‌రెడ్డి
“మంత్రివర్గ విస్తరణపై నాకు సమాచారం లేదు… నాకెవరూ ఫోన్ చేయలేదు… మంత్రివర్గంలో చోటు ఇవ్వడానికి జిల్లాలు, సామాజిక సమీకరణాలు ముఖ్యం కాదు… సమర్థత ముఖ్యం… నాకు మంత్రి పదవి ఇస్తే అన్నీ ఫుల్‌ఫిల్ చేస్తా… నాకు హోంమంత్రి పదవే కరెక్టు… అదే నాకు సూట్ అవుతుంది… మంత్రివర్గంలో చోటుపై నాకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రామిస్ ఉంది… భువనగిరి ఎంపీని నేనే గెలిపించిన…” అని అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది పార్టీలో చర్చకు దారితీయడంతో దాన్ని సవరించుకున్నారు.
“నాకు హోం మంత్రి పదవి అంటే ఇష్టం.. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఏ శాఖ కేటాయించాలనేది అధిష్టానం నిర్ణయం… మా కార్యకర్తలు, అభిమానులు నాకు హోం మంత్రి అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.. అంతేతప్ప నాకు హోం శాఖ ఇవ్వాలని, హోం మంత్రి అయితేనే బాగుంటుందని అనుకోవడంలేదు.. అధిష్టానం నిర్ణయమే ఫైనల్… నన్ను గుర్తించి మంత్రివర్గంలో చోటు కల్పించి ఏ శాఖ అప్పగించినా బాధ్యతాయుతంగా పనిచేస్తా.. ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి పాటుపడతా..” అని వివరణ ఇచ్చారు.