Rajiv Yuva Vikasam Scheme: రాష్ట్ర ప్ఱభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఐదేండ్ల వ్యవధిలో కుటుంబానికి ఒక్కసారే లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందని, పట్టణాల్లో రూ. 2 లక్షలు, పల్లెల్లో రూ. 1.50 లక్షల వార్షికాదాయం ఉన్న కుటుంబాలే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు అర్హత ఉంటుందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం లబ్ధిదారుల్లో మహిళలకు (ఒంటరి, వితంతు) 25%, దివ్యాంగులకు (సదరం సర్టిఫికెట్ తప్పనిసరి) 5% రిజర్వేషన్ అమలవుతుందని తెలిపారు. దీనికి తోడు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు, స్వయం ఉపాధిలో స్కిల్స్ ఉన్న యువతకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. స్వయం ఉపాధికి మొదటిసారి లబ్ధిపొందేవారికి కూడా ప్రయారిటీ ఉంటుందని పేర్కొన్నారు.
వీరే అర్హులు..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యుఎస్ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్) విభాగం కింద ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించిన ప్రభుత్వం… గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ, బ్యాంకు ద్వారా రుణాలను పొందే వీలున్నదని తెలిపారు. ఈ పథకం కింద రూ. 50 వేల వరకు సాయం పొందాలనుకునే లబ్ధిదారులకు పూర్తిగా 100% ప్రభతువం నుంచి సబ్సిడీ లభిస్తుంది. లబ్ధిదారులు ఎలాంటి భారం మోయాల్సిన అవసరం లేదు. లక్ష రూపాయల వరకు లబ్ధి పొందాలనుకుంటే 90% సబ్సిడీ లభిస్తుంది. మిగిలిన 10% బ్యాంకు ద్వారా రుణం పొందాల్సి ఉంటుంది. రెండు లక్షల రూపాయల సాయానికి 80% సబ్సిడీ, 20% బ్యాంకు రుణం, రూ. 4 లక్షల సాయానికి 70% సబ్సిడీ, 20% బ్యాంకు రుణం పొందే వీలున్నది. ఐదు లక్షల వరకు రుణం తీసుకునేవారి విషయంలో త్వరలో అధికారులు స్పష్టత ఇవ్వనున్నారు. మైనర్ ఇరిగేషన్ అవసరాల కోసం తీసుకుంటే 100% సబ్సిడీ వర్తిస్తుంది.
ఇవి తప్పక ఉండాల్సిందే..
ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకుంటే రేషను కార్డు తప్పనిసరి నిబంధనగా ప్రభుత్వం పేర్కొన్నా, అవి లేనివారు వార్షికాదాయాన్ని ధృవీకరించే సర్టిఫికెట్‌ను జతపర్చాల్సి ఉంటుందని ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నది. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు (రవాణా వాహనాల కోసం దరఖాస్తు చేసుకుంటే), కుల ధృవీకరణ పత్రం (తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన), పట్టాదారు పాస్‌బుక్ (వ్యవసాయ అవసరాలకు దరఖాస్తు చేసుకుంటే), ‘సదరం’ సర్టిఫికెట్ (దివ్యాంగ దరఖాస్తుదారులకు), పాస్‌పోర్టు ఫొటో అప్లికేషన్‌తో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తును భర్తీ చేసిన తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని సమీపంలోని ఎంపీడీవో (గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులు) లేదా మున్సిపల్ కమిషనర్/జోనల్ కమిషనర్‌కు ఫిజికల్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. ప్రతీ మండలంలో ప్రజాపాలన కేంద్రాల్లో ఈ స్కీమ్‌పై సందేహాల నివృత్తి కోసం హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
కమిటీల పరిశీలన తర్వాత ఎంపిక :
దరఖాస్తులను మండల, జిల్లా స్థాయి కమిటీలు పరిశీలించి ఈ పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. మండల స్థాయిలో ఎంపీడీవో/మున్సిపల్/జోనల్ కమిషనర్లు ఆధ్వర్యంలో కమిటీలు పనిచేస్తాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు పనిచేస్తాయి. మండల స్థాయి కమిటీలు ముసాయిదా జాబితా రూపొందించిన తర్వాత జిల్లా స్థాయి కమిటీలకు పంపాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అదనపు కలెక్టర్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, ఎస్సీ/ఎస్టీ కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, మైనారిటీ విభాగం జిల్లా అధికారి, దివ్యాంగ విభాగం అదనపు డైరెక్టర్, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్, గిరిజన సంక్షేమ విభాగం డెవలప్‌మెంట్ ఆఫీసర్, జిల్ల లీడ్ బ్యాంక్ మేనేజర్ సభ్యులుగా ఉంటారు.
నిర్దిష్టంగా ఏ అవసరాల కోసం లబ్ధిదారులు ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకుంటున్నారో దరఖాస్తులోని వివరాలకు అనుగుణంగా సంబంధిత టెక్నికల్ డిపార్టుమెంటు పరిశీలిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే 100% సబ్సిడీ పరిమితికి లోబడి ఉండే దరఖాస్తుల విషయంలో నేరుగా మెటీరియల్ సప్లై చేసిన కంపెనీకే బ్యాంకుల ద్వారా 80% మేర నిధులు జమ అవుతాయి. మిగిలిన 20% సంబంధిత బ్యాంకులు ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ చేసిన తర్వాత విడుదల చేస్తాయి. లబ్ధిదారులకు 15 రోజుల పాటు ప్రభుత్వం తరఫున ఆ వృత్తి, ఉపకరణాల వినియోగంలో శిక్షణ లభిస్తుంది. ఏడాది కాలం వరకు ప్రభుత్వం తరపున ప్రత్యేక సాంకేతిక సాయం అందుతుంది. ప్రాజెక్టు అమలుకు సంబంధించి బ్యాంకులు యుటిలైజేషన్ సర్టిఫికెట్లను ప్రభుత్వానికి ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.
Also Read: TG Cabinet: ఎమ్మెల్సీలకు నో ఛాన్స్? కేబినెట్ విస్తరణలో కొత్త ట్విస్ట్?
ఏప్రిల్ 5వ తేదీ వరకు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉన్నది. ఆ తర్వాత మండల స్థాయిలో లబ్ధిదారుల అర్హతలను ఏప్రిల్ 20 వరకు పరిశీలించి ముసాయిదా జాబితా తయారుకానున్నది. ఆ తర్వాత ఏప్రిల్ 21 నుంచి మే 31 వరకు జిల్లా స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హులైనవారి వివరాలను జూన్ 2న ప్రకటించి వారం రోజుల పాటు రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద ఆర్థిక సాయం పంపిణీ జరగనున్నది. ప్రభుత్వం తరఫున సబ్సిడీగా విడుదలయ్యే నిధులన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు లేదా కంపెనీలకు జమ అవుతాయి.
ఈ పేపర్ కోసం ఇక్కడ https://epaper.swetchadaily.com/ క్లిక్ చేయండి