Vijay Rupani: మనుషుల తలరాతలు ఎలా ఉంటాయో చెప్పలేం!. ఎంతటి విషాదకర రీతిలో, ఎప్పుడు, ఏవిధంగా బతుకులు ముగుస్తాయో ఊహించలేం. ఎయిరిండియా విమానం కుప్పకూలి (Air India Plane Crash) ప్రయాణికులు అందరూ చనిపోవడం ఒక ఎత్తైతే.. పాపం జేబీ మెడికల్ కాలేజీ విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తుండగా వారిని పెను ప్రమాదం కబళించింది. అత్యంత సురక్షితంగా ఉండే హాస్టల్‌లో ఆహారం తింటున్న సమయంలో విషాదం పలకరించింది. ఇక, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఐదేళ్లపాటు విశేష సేవలు అందించిన బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ (Vijay Rupani) కూడా విషాదకర రీతిలో కన్నుమూశారు. అయితే, విధిరాత ఆయనను ఏవిధంగా వెంటాడిందో తెలియజేసే ఆసక్తికర అంశం ఒకటి చర్చనీయాంశమైంది.
లక్కీ నంబరే.. మరణ తేదీ
ఎయిరిండియా విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ కన్నుమూసిన విషయం తెలిసిందే. గురువారం అంటే, జూన్ 12న ఈ ఘోర విషాదం జరిగింది. సంఖ్యాపరంగా 12/06న ప్రమాదం జరగగా, యాదృశ్ఛికంగా విజయ్ రూపానీ లక్కీ నంబర్ కూడా 1206 కావడం విశేషం. అంటే, లక్కీ నంబర్‌తో ఏర్పడిన తేదీనే ఆయన జీవితం ముగిసిపోయింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, విమానంలో ఆయన కూర్చున్న సీటు నంబర్ కూడా 12 కావడం గమనార్హం. అదృష్ట సంఖ్య 1206ను రూపానీ చాలా కాలంగా నమ్ముతున్నారు. గతంలో ఆయన వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు, వ్యక్తిగత వస్తువులపై కూడా ఈ లక్కీ నంబర్ ఉండేలా చూసుకునేవారు. చివరికి అదే నంబర్‌తో ఉన్న తేదీలో ఆయన చనిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Read this- Plane Crash: ఎయిరిండియా క్రాష్‌పై కేఏ పాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి (రమేష్ విశ్వాస్ కుమార్) 11వ సీటులో కూర్చొగా.. ఆ తర్వాతి 12వ నంబర్ సీటులో విజయ్ రూపానీ కూర్చున్నారు. కాగా, విజయ్ రూపానీ ఎయిరియిండియా ఇండియా విమానం ఏఐ171లో లండన్ వెళ్లాల్సి ఉంది. తన భార్య అక్కడ ఉండడంతో ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు ఆయన బయలుదేరారు. ప్రమాద సమయంలో విమానంలో ప్యాసింజర్లు, సిబ్బంది కలిపి మొత్తం 242 మంది ఉండగా అందులో 241 మంది చనిపోయారు. వారిలో విజయ్ రూపానీ కూడా ఉన్నారు.
Read this- Air India flight: మరో ఎయిర్ఇండియా విమానానికి ముప్పు.. అత్యవసర ల్యాండింగ్.. చివరికి!
భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అదృష్ట సంఖ్యలను నమ్ముతుంటారు. సంఖ్యాశాస్త్రం నుంచి జ్యోతిషశాస్త్రం వరకు సంఖ్యలు అదృష్టాన్ని లేదా దురదృష్టాన్ని నిర్ణయిస్తాయని చాలా మంది విశ్వసిస్తుంటారు. క్రికెటర్ విరాట్ కోహ్లీయే ఇందుకు చక్కటి ఉదాహరణ. విరాట్ అన్ని ఫార్మాట్లలో 18వ నంబర్ జెర్సీ ధరించి మాత్రమే క్రికెట్ ఆడతాడు. ఈ ఐపీఎల్ 18వ ఎడిషన్ కాగా, ఈ ఏడాదే ఆర్సీబీ టైటిల్‌ను గెలవడం యాదృశ్ఛికం.
విజయ్ రూపానీ విషయానికి వస్తే, 1206 నంబర్‌కు ఆయన వ్యక్తిగత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. కారు, బైక్ రెండింటికీ 1206 నంబర్‌తో రిజిస్ట్రేషన్ ప్లేట్లు ఉండేలా జాగ్రత్తపడ్డారు. కాగా, విజయ్ రూపానీ మృతి పట్ల రాజకీయ వర్గాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్, రాజ్యసభ ఎంపీ సంబిత్ పాత్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వంటి పార్టీ సీనియర్ నాయకులు సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. రూపానీ మృతి పార్టీకి, దేశానికి తీరని లోటు అని పలువురు వ్యాఖ్యానించారు. అనుభవజ్ఞుడైన రాజకీయ నేతను కోల్పోవడంతో గుజరాత్ బీజేపీ శ్రేణులు విచారం వ్యక్తం చేస్తు్న్నాయి.