The Game Has Begun It's Time To Vote
జాతీయం

EC | ఆట మొదలైంది..!

The Game Has Begun, It’s Time To Vote : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. 96.8 కోట్ల మంది ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే మహాక్రతువు వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చేసిన ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగినట్లయింది. ఈసారి లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల శాసన సభలకు జరిగే ఎన్నికల తేదీలనూ రాజీవ్ కుమార్ ప్రకటించారు. మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా, ఏప్రిల్‌ 19న మొదలయ్యే సార్వత్రిక ఎన్నికలు జూన్ 1న ముగియనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో మే 13న లోక్‌సభకు పోలింగ్ జరగనుండగా, అదే రోజు ఏపీ అసెంబ్లీకి, తెలంగాణలోని కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.

దేశవ్యాప్తంగా 96.8 కోట్ల మంది ఓటర్లు సార్వత్రిక ఎన్నికల వేళ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్ల సంఖ్య 49.7 కోట్లు కాగా మహిళా ఓటర్ల సంఖ్య 47.1 కోట్లు. మొత్తం ఓటర్లలో 48వేల మంది ట్రాన్స్ జెండర్స్ కాగా, 85 ఏళ్ల పైబడిన ఓటర్లు ఏకంగా 82 లక్షలు. ఓటర్లలో 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారు 19.74 కోట్ల మంది కాగా, 18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్లు సంఖ్య 1.8 కోట్ల మందిగా ఉన్నారు. ఈ ఎన్నికల క్రతువు కోసం 10.5 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 55 లక్షల ఈవీఎంలను సిద్ధం చేస్తు్న్నట్లు ఈసీ తెలిపింది. కోటిన్నర మంది పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది ఈ పోలింగ్ ప్రక్రియలో భాగస్వాములు కానున్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి, వికలాంగులకు ఇంటి నుంచే ఓటువేసే అవకాశాన్ని కల్పించనున్నారు.

Read More: ఎన్నికల బాండ్లపై మంత్రి సీతారామన్ రియాక్షన్‌

ప్రపంచమంతా ఈ మహా క్రతువు వైపు ఆసక్తిగా ఎదురు చూస్తోందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. ప్రతీ ఎన్నికా ఓ పరీక్ష వంటిదేనని, ప్రతిసారీ విజయం సాధించే దిశగా ఈసీ పనిచేస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల నిర్వహణను రాజీవ్ కుమార్ కత్తిమీద సవాలుగా అభివర్ణించారు. ఇకపై 2024ను ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల సంవత్సరంగా పిలవొచ్చన్నారు. కోడ్ అమల్లో ఉన్నందున ఇకపై పార్టీలన్నీ ప్రచార పర్వంలో ఈసీ గైడ్‌లైన్స్ పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది.

బాక్స్ ఐటెం

7 దశలు.. 543 సీట్లు

తొలి దశ: ఏప్రిల్‌ 19, 102 స్థానాలు (21 రాష్ట్రాలు)
రెండో దశ: ఏప్రిల్‌ 26, 89 స్థానాలు (13 రాష్ట్రాలు)
మూడో దశ: మే 7, 94 స్థానాలు (12 రాష్ట్రాలు)
నాలుగో దశ: మే 13, 96 స్థానాలు (10 రాష్ట్రాలు)
ఐదో దశ: మే 20, 49 స్థానాలు (8 రాష్ట్రాలు)
ఆరో దశ: మే 25, 57 స్థానాలు (7 రాష్ట్రాలు)
ఏడో దశ: జూన్‌ 1, 57 స్థానాలు (8 రాష్ట్రాలు)
ఫలితాల వెల్లడి: జూన్ 4

బాక్స్ ఐటెం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఇది..
నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 18, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్‌ 25
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్‌ 26
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 29
పోలింగ్‌ తేదీ: మే 13
ఫలితాల వెల్లడి : జూన్ 4

గైడ్‌లైన్స్

విద్వేష ప్రసంగాలు చేయరాదు. కులం, మతం ఆధారంగా ఓట్లు అడగరాదు.
నేతలు ప్రచారంలో వ్యక్తిగత విమర్శలు చేయరాదు.
నిరాధారమైన, ఉద్రిక్తతలకు తావిచ్చే లేదా తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయరాదు.
ప్రత్యర్థులను అవమానపరిచేందుకు సోషల్ మీడియాను దుర్వినియోగపరచరాదు.
ప్రచార క్రమంలో నేతలు దివ్యాంగులతో మర్యాదగా వ్యవహరించాలి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!