Tesla in lndia: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారత్ అడుగుపెట్టడం ఖరారైంది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో దేశంలోనే తొలి టెస్లా షోరూం ఏర్పాటైంది. జులై 15న దీనిని ప్రారంభించనున్నారు. టెస్లా ఎక్స్ పీరియన్స్ సెంటర్ పేరుతో ఈ షోరూం కార్ల క్రయ విక్రయాలు చేయనుంది. ఇందుకోసం 5వై మోడల్ కార్లు ముంబయికి చేరుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేశాయి.
మెుదటి వారికే ఛాన్స్
టెస్లా తన మొదటి బ్యాచ్ మోడల్ Y రియర్ వీల్ డ్రైవ్ ఎస్ యూవీలను చైనాలోని షాంఘైలో గల తమ ఫ్యాక్టరీ నుంచి ముంబయికి దిగుమతి చేసింది. టెస్లా ఎక్స్ పీరియన్స్ సెంటర్ (Tesla Experience Center) ప్రారంభం అనంతరం.. ముందుగా వీఐపీలను, వ్యాపార భాగస్వాములను షోరూంలోకి అనుమతించనున్నారు. వారం రోజుల తర్వాత జనరల్ పబ్లిక్ ను సైతం షోరూంలోకి ఆహ్వానం పలికి.. వై మోడల్ తీసుకొచ్చిన వివిధ కార్ల వేరియంట్లు, వాటి ధరలను తెలుసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. టెస్లా తన తొలి షోరూంను 4,000 చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటు చేస్తోంది. దీని కోసం నెలకు రూ.35 లక్షల చొప్పున రెంట్ చెల్లించనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఆగస్టు చివరి నాటికి డెలీవరి
ముంబయిలోని టెస్లా ఎక్స్ పీరియన్స్ సెంటర్ లో వై ఎస్ యూవీ ( Y SUV) బుక్ చేసుకున్న వారికి ఆగస్టు చివరి నాటికి కార్లు డెలివరీ కానున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా టెస్లా తన వై ఎస్ యూవీలో మెుత్తం ఆరు మోడల్స్ ను లాంచ్ చేసింది. అందులో ఐదు మోడల్స్ ధర ఇంచుమించు రూ.27.90 లక్షలు కాగా.. లాంగ్ రేంజ్ వేరియంట్ ధర రూ.39.50 లక్షలుగా ఉంది. అయితే భారత్ విధించే దిగుమతి సుంకాలు కలుపుకుంటే వై ఎస్ యూవీ ధర రూ.50 లక్షల వరకూ చేరవచ్చని అంచనాలు ఉన్నాయి.
Also Read: England player on Gill: ఇంగ్లాండ్‌తో బంతి వివాదం.. భారత్‌పై కనికరం లేదంటూ మాజీ క్రికెటర్ ఫైర్!
సుంకాలు తగ్గింపు..
ఇదిలా ఉంటే భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు టెస్లా కంపెనీ.. 2021 నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని మస్క్ కంపెనీ భారత్ ను కోరుతు వచ్చింది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా మస్క్ ఆయనతో భేటి అయ్యారు. ఈ సమావేశంలో సుంకాల గురించి చర్చ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే 40 వేల డాలర్ల కంటే ఎక్కువ ఖరీదైన హైఎండ్ కార్ల బేసిక్ కస్టమ్ సుంకాన్ని ఇటీవల భారత్ తగ్గించింది. దీంతో భారత్ లో షోరూమ్ లు ఏర్పాటు చేసేందుకు మస్క్ కు మార్గం సుగమమైంది. ముంబయి తర్వాత త్వరలో ఢిల్లీలోనూ టెస్లా షోరూంను మస్క్ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.