England player on Gill: భారత్ – ఇంగ్లాండ్ జట్ల జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో బంతులు వివాదానికి కేంద్రంగా మారుతున్నాయి. మ్యాచ్ కోసం వినియోగిస్తున్న డ్యూక్స్ బంతులు త్వరగా తమ ఆకారాన్ని కోల్పోతున్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే లార్డ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆటలో.. మరోమారు ఈ అంశం చర్చకు వచ్చింది. భారత్ బౌలింగ్ చేస్తున్న సమయంలో 91వ ఓవర్ వద్ద బంతి తన ఆకృతిని కోల్పోవడాన్ని కెప్టెన్ గిల్, బౌలర్ సిరాజ్ ఎంపైర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎంపైర్ ఆ సమయానికి ఇవ్వాల్సిన బంతి కంటే మరి పాతది అందించారు. దీంతో గిల్ (Shubman Gil), సిరాజ్ (Mohammed Siraj) ఎంపైర్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్పందిస్తూ భారత్ పై విమర్శలు చేశారు.
మార్చాల్సిన అవసరం ఏముంది?
పాత బంతి ఇచ్చారంటూ ఎంపైర్ తో గిల్, సిరాజ్ గొడవపడటాన్ని ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టీవ్ హర్మిసన్ (Steve Harmison) స్పందించారు. హాట్ స్టార్ లో మాట్లాడుతూ ఈ వివాదంలో భారత్ పట్ల తనకు ఎలాంటి సానుభూతి లేదని ఆయన అన్నారు. అసలు భారత్ కు తన మెుదటి బంతిని మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆ బంతితో బుమ్రా (Jasprit Bumrah) మంచి స్వింగ్ ను రాబట్టగలిగాడని అన్నారు. సిరాజ్ సూచించడంతో బుమ్రాను సంప్రదించకుండానే గిల్ బంతిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అప్పటికి అదే బంతితో బుమ్రా 3 వికెట్లు పడగొట్టిన విషయాన్ని వారు మర్చిపోయారని అన్నారు. ఒకవేళ బంతి మార్చకుంటే వారు పది నిమిషాల్లోనే ఇంగ్లాండ్ ను ఆల్ ఔట్ చేసేవారేమో అంటూ వ్యాఖ్యానించారు. బంతిని మార్చాలన్న నిర్ణయంతో 400 పరుగుల వరకు (387 ఆలౌట్) చేరుకోగలిగిందని చెప్పారు. కాబట్టి భారత్ విషయంలో తనకు సానుభూతి లేదని చెప్పారు.
Also Read: Air India Flight Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. తెరపైకి కొత్త అనుమానాలు.. పైలెటే మెయిన్ విలనా?
గవాస్కర్ రియాక్షన్
ఎంపైర్ మార్చిన బంతిపై గిల్, సిరాజ్ అసహనం వ్యక్తం చేసిన వేళ.. వారికి టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అండగా నిలిచాడు. మార్చిన బంతిని చూస్తే అది 10 ఓవర్లు ఆడిన బంతిలాగా లేదని.. 20 ఓవర్ల కంటే ఎక్కువే అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇదే బంతి మార్పు అంశం భారత్ లో గనుక జరిగి ఉంటే.. ఇప్పటికే బ్రిటిష్ మీడియా చాలా రాద్దాంతం చేసి ఉండేదని గవాస్కర్ అన్నారు. క్రికెట్ బంతి త్వరగా ఆకృతి మారుతుండటంపై ఇంగ్లాండ్ బౌలర్.. స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad) ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా బంతిపై ఈ స్థాయిలో చర్చ జరుగుతోందంటే సమస్య ఉన్నట్లేనని అతడు అభిప్రాయపడ్డారు. కనీసం 80 ఓవర్లపాటు బంతిని మార్చకుండా ఉండేలా చూడాల్సిన అవసరముందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.