Dr Shaheen’s Ex-Husband: ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో లక్నోకు చెందిన వైద్యురాలు డాక్టర్ షాహీన్ సయీద్ (Dr Shaheen Saeed)ను దర్యాప్తు వర్గాలు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఫరిదాబాద్ లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న అనంతరం పలువురు డాక్టర్లను దర్యాప్తు వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిలో షాహీన్ కూడా ఉన్నారు. దిల్లీలో జరిగిన భారీ పేలుడు వెనుక ఈ టెర్రర్ డాక్టర్ల సమూహం ఉన్నట్లు కూడా దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షాహీన్ సయీద్ మాజీ భర్త ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మాజీ భర్త ఏమన్నారంటే?
డాక్టర్ షాహీన్ సయీద్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె మాజీ భర్త డాక్టర్ హయత్ జాఫర్ (Dr Hayat Zafar) స్పందించారు. షాహీన్ ఎలాంటి తప్పు చేసి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. తన మాజీ భార్య ఉదారభావ దృక్పథాలను కలిగి ఉన్నారని చెప్పారు. తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆస్ట్రేలియా లేదా యూరప్ లో స్థిరపడాలని ఆమె భావించినట్లు జాఫర్ వెల్లడించారు. అయితే ఆమెతో 2012లో విడిపోయినట్లు జాఫర్ స్పష్టం చేశారు.
తండ్రి, సోదరుల రియాక్షన్
మరోవైపు షాహీన్ తండ్రి సైతం స్పందించారు. తన ఇంట్లో దర్యాప్తు వర్గాలు సోదాలు నిర్వహించాయని తెలిపారు. కానీ వారికి ఏమీ లభించలేదని పేర్కొన్నారు. పోలీసులతో తానేమి చెప్పాలనుకోవడం లేదని అన్నారు. కోర్టు ఆర్డర్ తెచ్చినా కూడా వారికి ఏమి చెప్పనని చెప్పారు. మరోవైపు షాహీన్ సోదరుడు షోయబ్ కూడా మీడియాతో మాట్లాడారు. ‘దిల్లీ పేలుడులో నా సోదరి ప్రమేయం ఉన్నట్లు చెబుతున్నారు. నేను దీన్ని నమ్మలేకపోతున్నా. ఆమె బాగా చదువుకుంది. విడిగా జీవిస్తోంది. నేను అంతగా చదువుకోలేకపోయా’ అని చెప్పుకొచ్చారు.
జైషే మహిళా విభాగంలో..
దర్యాప్తు అధికారుల ప్రకారం.. పాక్ కు చెందిన ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ తో షాహీన్ ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉన్నారు. ఆ ఉగ్రసంస్థకు చెందిన మహిళా విభాగం నియామక బాధ్యతలను ఆమె నిర్వర్తిస్తున్నారు. జైషే మహమ్మద్ కు చెందిన ‘జమాత్ – ఉల్ – మోమినాత్’ అనే మహిళా విభాగ ఉగ్రసంస్థకు షహీన్ అగ్రనాయకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు అలా ఉంటూనే ఎవరికీ అనుమానం రాకుండా ఫరిదాబాద్ లోని అల్ ఫలాహ్ యూనివర్శిటీలోనూ ఆమె పనిచేస్తున్నట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: Delhi Blast Suspects: టార్గెట్ దీపావళి.. ఆపై జనవరి 26కు ఛేంజ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
దిల్లీ పేలుడుతో సంబంధం
కాశ్మీర్‌కి చెందిన డాక్టర్ ముజామ్మిల్‌తో షాహీన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముజామ్మిల్ కు చెందిన రెండు అద్దె గదుల్లో 2,900 కిలోల పేలుడు పదార్థాలు, ఆయుధ సామాగ్రి బయటపడటంతో అతడ్ని దర్యాప్తు బృందాలు అరెస్ట్ చేశాయి. అయితే దిల్లీలో జరిగిన పేలుడు వెనుక సైతం ముజమ్మిల్ హస్తం ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు అంచనా వేస్తున్నాయి. పేలుడుకు కారణమైన కారును ఉమర్ అనే మరో వైద్యుడు నడపడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. అయితే ఈ ఉమర్.. ముజామ్మిల్ అనుచరుడేనని దర్యాప్తు వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో షాహీన్ కు సైతం దిల్లీ పేలుడులో ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి.
