Dr Shaheen Saeed: కరుడుగట్టిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ జైష్ ఏ మహ్మద్ మహిళలను సైతం ఉగ్ర బాటలోకి నడిపిస్తున్నది. దీని కోసం జమాత్ ఉల్ మోమినత్ (Jamaat ul-Mominaat) అనే సంస్థను ప్రారంభించింది. దీని ఫౌండర్‌గా జైష్ – ఈ – మహ్మద్ (Jaish-e-Mohammed)కు ప్రస్తుతం చీఫ్ గా ఉన్న మసూద్ అజహర్ సోదరి సాదియా అజహర్ వ్యవహరిస్తున్నది. ఇటీవల అరెస్ట్ అయిన డాక్టర్ షాహీన్ సయీద్‌ను జరిపిన విచారణలో భారత్ నెట్ వర్క్‌ను ఏర్పాటు చేసే బాధ్యతలను సాదియా తనకు అప్పగించినట్టుగా వెల్లడించినట్టు పోలీస్ట్ వర్గాల ద్వారా తెలిసింది. తాజాగా వెల్లడైన ఈ అంశంతో దర్యాప్తు ఏజన్సీలు ఉలిక్కి పడ్డాయి.
యూసుఫ్ అజహర్ భార్య
జమాత్ ఉల్ మోమినత్‌కు ఫౌండర్‌గా వ్యవహరిస్తున్న సాదియా, యూసుఫ్ అజహర్ భార్య అని పోలీస్ వర్గాలు తెలిపాయి. కాందహార్ విమానం హైజాక్‌లో మాస్టర్ మైండ్ యూసుఫ్ అజహర్. పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు కిరాతకంగా హతమార్చిన తరువాత భారత్ ఆపరేషన్ సింధూర్ జరిపింది. మన వైమానిక దళాలు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి బాంబుల వర్షం కురిపించాయి. సయీద్ అజహర్ చనిపోయాడు.
ప్రతీకారం తీర్చుకోవడానికి..
తన భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికే సాదియా జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థలో జమాత్ ఉల్ మోమినత్ పేర మహిళా వింగ్‌ను ప్రారంభించినట్టుగా నిఘా వర్గాల ద్వారా తెలిసింది. అక్టోబర్ నుంచే పాకిస్థాన్‌లో రిక్రూట్‌మెంట్ ప్రారంభించినట్టుగా సమాచారం. భవల్పూర్‌లో ఉన్న మర్కజ్ ఉస్మాన్ ఓ అలీ కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్టుగా తెలిసింది. ఇక, భారత్‌లో నెట్ వర్క్ ఏర్పాటు చేసే బాధ్యతలను డాక్టర్ షాహీన్ సయీదాకు అప్పగించినట్టుగా తెలిసింది. లక్నోలోని లాల్ బాగ్‌కు చెందిన షాహీన్ సయీదాను ఇటీవల అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె కారు నుంచి అసాల్ట్ రైఫిల్, పిస్టల్‌ను సీజ్ చేశారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో చదువుకున్న ఆమెకు 2,900 కిలోల పేలుడు పదార్థాలతో పట్టుబడ్డ కశ్మీరీ డాక్టర్ ముజమ్మిల్ గనాలే ఎలియాస్ ముసైబ్‌తో సన్నిహిత పరిచయాలు ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిజానికి ముజమ్మిల్ విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగానే పోలీసులు డాక్టర్ షాహీన్ సయీదాను పట్టుకున్నారు.
Also Read: Red Fort Blast: దిల్లీలో ఒకటి కాదు.. 4 కార్లతో పేలుళ్లకు కుట్ర.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
చదువుకున్న వారే టార్గెట్
మొట్ట మొదటిసారిగా జమాత్ ఉల్ మోమినత్ పేర మహిళా వింగ్‌ను ఏర్పాటు చేసిన జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థ చదువుకున్న మహిళలనే ఉగ్ర బాటలోకి నడిపించాలని కుట్రలు చేసినట్టుగా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డ వారిని నెట్ వర్క్‌లో చేర్చుకోవాలని పన్నాగాలు పన్నినట్టుగా సమాచారం. ఇందులో భాగంగానే వైద్య విద్య చదివిన డాక్టర్ షాహీన్ సయీదాను భారత్ బ్రాంచ్‌కు చీఫ్‌గా నియమించినట్టుగా తెలిసింది. టెలిగ్రాంతోపాటు సోషల్ మీడియా ద్వారా బాగా చదువుకున్న వారితో పరిచయాలు ఏర్పరుచుకుని వారిని ఉగ్రవాదం వైపు మళ్లించాలని చెప్పినట్టుగా సమాచారం. అయితే, ముజమ్మిల్ దొరికిపోవడం, విచారణలో డాక్టర్ షాహీన్ సయీదా గురించి చెప్పడంతో పోలీసులు ఆమెను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె ఎంతమందిని ఉగ్రవాదం వైపు మళ్లించిందన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా అకౌంట్లను విశ్లేషిస్తున్నారు.
