Territorial Army: ప్రస్తుతం భారత్ తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. పాక్ సైన్యం దాడులకు దిగుతుండటంతో వారిని ఎదుర్కొనేందుకు అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీ సేవలను వినియోగించుకోవాలని సైన్యానికి సూచించింది. ఈ మేరకు ఆర్మీ చీఫ్ కు అదనపు అధికారులను కల్పిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాక్ దాడులకు గట్టిగా సమాధానం ఇవ్వాలని భారత్ నిర్ణయించుకున్న తరుణంలో తాజా నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
టెరిటోరియల్ ఆర్మీ అంటే..
టెరిటోరియల్ ఆర్మీ (Territorial Army – TA) అనేది భారత సైన్యంలోని ఒక స్వచ్ఛంద సైనిక బలగం. ఇది రెగ్యులర్ ఆర్మీకి సహాయకంగా పనిచేస్తుంది. పౌరులకు సైనిక సేవలో పాల్గొనే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. అదే సమయంలో వారి సాధారణ వృత్తి లేదా ఉపాధిని కొనసాగించడానికి అనుమతిస్తుంది. దీనిని 1948లో టెరిటోరియల్ ఆర్మీ యాక్ట్ ద్వారా స్థాపించారు. టెరిటోరియల్ ఆర్మీ భారతదేశంలో రెండవ రక్షణ శ్రేణిగా ఉంది.
వారి విధులు ఏంటి?
అత్యవసర సమయాల్లో ఆర్మీకి సహాయం చేయండం, యుద్ధంలో అదనపు బలంగా ఉంటూ సేవలు అందించడం టెరిటోరియల్ ఆర్మీ ప్రధాన విధి. అలాగే రాష్ట్ర సరిహద్దుల రక్షణ, అంతర్గత భద్రతా విధులు, సహజ విపత్తుల సమయంలో రెస్క్యూ – రిలీఫ్ ఆపరేషన్లు, యుద్ధంలో పాల్గొనడం వారి విధులని టెరిటోరియల్ ఆర్మీ యాక్ట్ చట్టంలో పేర్కొనబడ్డాయి. సైన్యంలో లాగే ఈ టెరిటోరియల్ ఆర్మీలోనూ వివిధ యూనిట్లు ఉంటాయి. ఇన్ఫాంట్రీ, ఇంజనీరింగ్, సిగ్నల్స్, ఆర్టిలరీ, ఎయిర్ డిఫెన్స్ మొదలైన విభాగాల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారు.
ఇదేం తొలిసారి కాదు..
ప్రస్తుతం ఈ టెరిటోరియల్ ఆర్మీలో సుమారు 50 వేల మంది క్రియాశీలకంగా ఉన్నట్లు అంచనా. గతంలో 1962, 1965, 1971 యుద్ధ సమయాల్లో టెరిటోరియల్ ఆర్మీ.. తామున్నామంటూ దేశ రక్షణలో పాల్గొంది. భారత రెగ్యులర్ ఆర్మీతో కలిసి దేశం పోరాడింది. కేవలం యుద్ధ సమయాల్లోనే కాకుండా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా ఈ దళాలు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటాయి. గతంలో ఉత్తరాఖండ్ – కేరళ వరదలు, ప్రకృతి విపత్తుల సమయంలో వీరి సాయాన్ని కేంద్రం తీసుకుంది.
Also Read: Operation Sindoor: సిందూర్ 3.0.. పాక్ డ్రోన్లు, ఫైటెర్ జెట్స్ స్మాష్.. సైన్యం వెల్లడి
ప్రముఖ సెలబ్రిటీలు
భారత టెరిటోరియల్ ఆర్మీ (Territorial Army – TA)లో పలువురు నటులు, క్రీడాకారులు గౌరవ ర్యాంకులతో తమ సేవల ద్వారా భాగం అయ్యారు. ఈ టెరిటోరియల్ ఆర్మీలో దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనితో పాటు షూటర్ అభినవ్ బింద్రా నమోదై ఉన్నారు. అలాగే నటులు మోహన్ లాల్, నానా పటేకర్ సైతం సెకండరీ ఆర్మీలో రిజిస్టర్ అయ్యారు. అలాగే రాజకీయ నాయకులు సచిన్ పైలట్, అనురాగ్ సింగ్ ఠాకూర్, రాజ్యవర్ధన్ రాథోడ్ ఉన్నారు. పరిస్థితులు కఠినతరంగా మారినప్పుడు ఆర్మీ చీఫ్ ఆదేశిస్తే సెలబ్రిటీలు సైతం బోర్డర్ కు వెళ్లాల్సి ఉంటుంది.