Nuclear Bomb: భారత్, పాకిస్థాన్ దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్న నేపథ్యంలో ఒకవేళ అణుదాడి జరిగితే పరిస్థితి ఏంటనే ఆందోళన సహజంగానే తలెత్తుతోంది. అణు విస్ఫోటనం ఊహకందని విధ్వంసాన్ని సృష్టించడమే కాకుండా దాడి జరిగిన ప్రాంతం నుంచి చాలా మైళ్ల దూరం వరకు గాలి, నీరు, నేల ఉపరితలాలపై రేడియోధార్మిక పదార్థాలను వెదజల్లుతుంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితిలో ఎలా సురక్షితంగా ఉండాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ మూడు అంశాలు కీలకం!
ప్రస్తుత రోజుల్లో అణుదాడి చేయడం అంత ఈజీ కాదు. అయినప్పటికీ పాక్ వక్రబుద్ధిని నిందించకుండా ఉండలేము. ఇప్పటికే తమ వద్ద 120 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయంటూ పాక్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ అణుదాడి జరిగితే అనంతర పరిణామాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి అణు దాడి జరిగితే ఈ మూడు కీలక అంశాలను ప్రతీ ఒక్కరు తప్పకుండా పాటించాలి.
1. దూరం: విస్ఫోటన కేంద్రం నుంచి ఎంత దూరంగా ఉంటే అంత సురక్షితం.
2. కవచం (షీల్డింగ్): మీకు, రేడియోధార్మిక వ్యర్థాల కణాలకు మధ్య మందపాటి గోడలు, కాంక్రీటు, ఇటుకలు వంటి దృఢమైన ఆశ్రయం ఎంత ఎక్కువగా ఉంటే అంత రక్షణ లభిస్తుంది.
3. సమయం: రేడియోధార్మిక వ్యర్థాల నుంచి వెలువడే హానికరమైన రేడియేషన్ కాలక్రమేణా బలహీనపడుతుంది. దాడి జరిగిన తర్వాత మొదటి రెండు వారాల్లో ఈ వ్యర్థాల వల్ల అత్యధిక ప్రమాదం ఉంటుంది. రెండు వారాల తర్వాత, రేడియేషన్ స్థాయి దాడి జరిగినప్పటికన్నా దాదాపు 1%కి తగ్గిపోతుంది.
జాతీయ విపత్తు సంస్థ (NDMA) గైడ్ లైన్స్
అణు అత్యవసర పరిస్థితి సంభవించినప్పుడు ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో, వేటికి దూరంగా ఉండాలో ఎన్‌డీఎంఏ గతంలోనే స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
ఇవి చేయండి!
❄️ తక్షణమే ఇంటి లోపలికి లేదా సురక్షిత ఆశ్రయంలోకి వెళ్లండి. లోపలే ఉండండి.
❄️ రేడియో/టెలివిజన్ ఆన్ చేసి, స్థానిక అధికారుల నుంచి వచ్చే అధికారిక ప్రకటనల కోసం వేచిచూడండి.
❄️ తలుపులు, కిటికీలు మూసివేయండి.
❄️ ఆహార పదార్థాలు, నీరు వంటివి పూర్తిగా కప్పి ఉంచండి. కప్పి ఉంచిన వాటిని మాత్రమే తీసుకోండి.
❄️ ఒకవేళ మీరు ఆరుబయట ఉంటే మీ ముఖాన్ని, శరీరాన్ని తడి రుమాలు, టవల్, ధోతి లేదా చీరతో కప్పుకోండి. వెంటనే ఇంటికి తిరిగి వెళ్లి, దుస్తులు మార్చుకోండి. పూర్తిగా స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించండి.
❄️ స్థానిక అధికారులకు పూర్తి సహకారం అందించండి. మందులు తీసుకోవడం, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడం వంటి సూచనలను తు.చ. తప్పకుండా పాటించండి.
❄️ అణు రేడియేషన్ ప్రమాదం గురించి అవగాహన కలిగి ఉండండి. రేడియేషన్ భయాన్ని తగ్గించడానికి పిల్లలు, కుటుంబ సభ్యులతో అణు రేడియేషన్ భద్రత గురించి చర్చించండి.
ఇవి అసలు చేయవద్దు
❄️ ఆందోళనకు గురికావద్దు.
❄️ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పుకార్లను నమ్మవద్దు.
❄️ బయట ఉండవద్దు లేదా బయటకు వెళ్లవద్దు.
❄️ సాధ్యమైనంతవరకు, బహిరంగ బావులు/చెరువుల నుంచి నీరు, పంటలు, కూరగాయలు, బయటి నుంచి తెచ్చిన ఆహారం, నీరు లేదా పాలను నివారించండి.
❄️ జిల్లా లేదా పౌర రక్షణ అధికారుల సూచనలను ధిక్కరించవద్దు. వారు మీ, మీ కుటుంబం, మీ ఆస్తి భద్రతను నిర్ధారించడానికి తమ వంతు కృషి చేస్తారు.
ఈ మార్గదర్శకాలను పాటించడం ద్వారా అణుదాడి వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అధికారిక సమాచారంపై ఆధారపడటం, సూచనలను పాటించడం ఆ సమయంలో అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.