SC on EC: బీహార్ ఓటర్ల జాబితాలో అర్హత కలిగివున్నా పెద్ద సంఖ్యలో పేర్లు డిలీట్ కావడంపై సుప్రీంకోర్టు (SC on EC) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు గల కారణాన్ని బహిరంగంగా ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం గురువారం ఆదేశించింది. ఎవరెవరి పేర్లు డిలీట్ అయ్యాయో కూడా గుర్తించాలని స్పష్టం చేసింది.
బీహార్‌లో ఓటర్ల జాబితాలో తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల పేర్లను తిరిగి తప్పనిసరిగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను (SIR-Special Intensive Revision ) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ ఈ ఆదేశాలు ఇచ్చారు. ‘‘పేర్లు తొలగించిన 65 లక్షల మందిలో 22 లక్షల మంది మరణించారని ఎన్నికల సంఘం చెబుతోంది. మరి, ఈ విషయాన్ని బూత్ స్థాయిలో ఎందుకు వెల్లడించబడలేదు?. ఓటర్లు వారి హక్కుల కోసం రాజకీయ పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం లేదు’’ అని జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also- J-K Cloudburst: జమ్మూ కశ్మీర్‌లో భారీ క్లౌడ్ బరస్ట్.. పెద్ద సంఖ్యలో మృతులు!
భారత ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణను సంక్షిప్తంగా విన్నామని, విచారణ సమయంలో సూచించిన కొన్ని తాత్కాలిక చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘం అంగీకరించిందని సుప్రీంకోర్టు తెలిపింది. 2025 ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ, తాజా డ్రాఫ్ట్ జాబితాలో పేర్లు లేని (65 లక్షల మంది) ఓటర్ల జాబితాను ప్రతి జిల్లా స్థాయి వెబ్‌సైట్లలో ప్రదర్శించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Read Also- DMart Independence Sale: డీమార్ట్ పంద్రాగస్టు ఆఫర్.. సగం ధరకే వస్తువులు.. అస్సలు మిస్ కావొద్దు!
విస్తృతంగా ప్రచారం కల్పించాలి
అత్యధిక పాఠక ఆధరణ కలిగిన స్థానిక భాషా పత్రికలలో ఓట్ల తొలగింపుపై విస్తృత ప్రచారం చేయాలని, దూరదర్శన్, ఇతర చానళ్లలో ఈ సమాచారాన్ని ప్రసారం చేయాలని సూచించింది. జిల్లా ఎన్నికల అధికారులకు సోషల్ మీడియా అకౌంట్లు ఉండే వాటి ద్వారా కూడా అవగాహన కల్పించాలని పేర్కొంది. గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం ఈ ఓటర్ల జాబితాను స్వయంగా చూడగలిగే విధంగా ప్రతి పంచాయతీ భవనంలో, ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయాలు, పంచాయతీ ఆఫీసుల్లో 65 లక్షల ఓటర్ల జాబితాను బూత్‌ల వారీగా నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని న్యాయమూర్తి జస్టిస్ కాంత్ స్పష్టం చేశారు. ఓటు తొలగింపునకు గురైన వ్యక్తులు తమ ఆధార్ కార్డు కాపీతో కలిపి ఫిర్యాదు దాఖలు చేయవచ్చని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సూచించింది.
జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర పునఃసమీక్ష (SIR) తర్వాత సిద్దమైన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఎన్ని పేర్లు తొలగింపునకు గురయ్యాయని ప్రశ్నించారు. కాగా, ఎన్నికల సంఘం తరపున సీనియర్ అడ్వొకేట్ రాకేష్ ద్వివేదీ వాదనలు వినిపించారు. 65 లక్షల పేర్లు జాబితాలో లేవని, ఆ పేర్లలో 22 లక్షల మంది మరణించినవారేనని అన్నారు. అకారణంగా ఎవరన్నీ తొలగించలేదని, పొరపాటున ఎవరి పేరైన తొలగించి ఉంటే వారు తిరిగి తమ పేరును జాబితాలో చేర్చించుకునేందుకు అధికారులను సంప్రదించవచ్చని రాకేష్ ద్వివేది చెప్పారు. అడ్వొకేట్ వాదనలపై జస్టిస్ బాగ్చీ స్పందిస్తూ, ‘‘మేము పారదర్శకతను కోరుకుంటున్నాం. అందుకు అవసరమైన పూర్తి డేటాను వెబ్‌సైట్‌లో ఉంచాలని చెబుతున్నాం’’ అని అన్నారు. జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ, రాజకీయ కార్యకర్తలకు భావజాలం ఉండొచ్చు. ప్రజలు స్వతంత్రంగా తమ పేరు జాబితాలో ఉందో లేదో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే అవకాశం ఉండాలని పేర్కొన్నారు. కాగా, ఈ కేసుపై తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేస్తున్నట్టు బెంచ్ పేర్కొంది.