Sonia Gandhi: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎంపీ సోనియా గాంధీ (Sonia Gandhi) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల ఘర్షణపై ఎలాంటి స్పందనా లేకుండా భారత్ మౌనం దాల్చడం దౌత్యపరమైన లోపం మాత్రమే కాదని, నైతిక, వ్యూహాత్మక విధానాల నుంచి మన దేశం దూరం జరిగినట్టుగా ప్రతిబింబిస్తుందని ఆమె అభివర్ణించారు. జూన్ 13న ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్ జరిపిన భీకర సైనిక దాడులు చట్టవిరుద్ధమని, ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినట్టేనని సోనియా గాంధీ ఖండించారు. ఈ మేరకు ‘ది హిందూ’ పత్రికకు రాసిన కాలమ్‌లో ఆమె పేర్కొన్నారు.
‘‘ఇరాన్ గడ్డపై టార్గెట్‌లే లక్ష్యంగా బాంబు దాడులు చేయడం, హత్యలకు పాల్పడడాన్ని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇరు దేశాల మధ్య తీవ్రమైన ఈ ఘర్షణ ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితులకు ప్రమాదకరంగా పరిణమిస్తుంది. గాజాలో క్రూరమైన, అసమానమైన చర్యల మాదిరిగానే , ఇటీవలి ఇరాన్‌లో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు అనేక మంది పౌరుల జీవితాలను, ప్రాంతీయ స్థిరత్వాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ ప్రాంతంలో అస్థిరతను మరింత తీవ్రతరం చేస్తాయి. మరిన్ని ఘర్షణలకు బీజాలు వేస్తాయి’’ అని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.
Read this- Kuberaa: ‘కుబేర’కు ముందు సూపర్ డూపర్ హిట్టైన ‘బిచ్చగాళ్ల పాత్ర’ సినిమాలు ఇవే
నెతన్యాహు, ట్రంప్‌పై విమర్శలు
‘‘1995లో నాటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి యిట్జాక్ రాబిన్ హత్యకు దారితీసిన విద్వేష పరిస్థితులను రెచ్చగొట్టేందుకు నెతన్యాహు దోహదపడినట్టు చరిత్ర మనకు గుర్తుచేస్తోంది. ఈ పర్యావసానంతో ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఆశాజనకమైన శాంతి చర్చలకు నాడు ముగింపు పడింది’’ అని ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కూడా సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. దూకుడుగా వ్యవహరించేవారికి అనుకూలంగా తన సొంత నిఘా వర్గాల సమాచారాన్ని కూడా ట్రంప్ విస్మరించారని సోనియా గాంధీ ఆరోపించారు. ముగింపు లేకుండా కొనసాగే యుద్ధాలు, సైనిక పారిశ్రామిక శక్తులకు తాను వ్యతిరేకమంటూ గతంలో హెచ్చరికలు చేసిన ట్రంప్, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇరాక్‌లో యుద్ధానికి దారితీసిన పాత తప్పులను పునరావృతం చేస్తున్నట్లుగా అనిపిస్తోందని సోనియా విశ్లేషించారు. 2003లో ఇరాక్ వద్ద సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉన్నాయంటూ దాడి చేసిన అంశాన్ని ఆమె ప్రస్తావించారు.
Read this- Wife Marriage: దగ్గరుండి భార్యకు పెళ్లి చేసిన భర్త.. అంతపెద్ద కారణం ఏంటంటే?
ఇరాన్‌తో బలమైన బంధం
భారత్‌కు ప్రత్యేకమైన దౌత్య స్థానం ఉందని అన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలతోనూ భారత్‌కు దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవలి దశాబ్దాలలో ఇజ్రాయెల్‌తో మన దేశానికి రక్షణ, వాణిజ్యం, నిఘా సహకారం పెరిగిన మాట నిజమేనని, అయితే, ఇరాన్‌తో బలమైన చారిత్రక, నాగరిక, వ్యూహాత్మక సంబంధాలను కూడా కొనసాగిస్తున్న విషయాలను గుర్తుంచుకోవాలన్నారు. ‘‘ఇరాన్ మనకు దీర్ఘకాల మిత్ర దేశంగా ఉంది. మన దేశంతో బలమైన సంబంధాల ద్వారా మనకు కట్టుబడి ఉంది. జమ్మూ కశ్మీర్ విషయంలో కీలక సమయంతో పాటు స్థిరమైన మద్దతు ఇచ్చిన చరిత్ర ఇరాన్‌కు ఉంది. 1994లో కాశ్మీర్ సమస్యపై యూఎన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్‌లో భారతదేశాన్ని నిందించే తీర్మానాన్ని వ్యతిరేకించడంతో ఇరాన్ సాయపడింది. వాస్తవానికి, ఇంతకు ముందున్న ‘ఇరాన్ ఇంపీరియల్ స్టేట్’ కంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో భారతదేశానికి చాలా ఎక్కువ సహకారం ఉంది. 1965, 1971లలో పాకిస్థాన్‌తో భారత్ చేసిన యుద్ధాలలో దాయాది దేశానికి మొగ్గు చూపింది ఇరాన్ ఇంపీరియల్ స్టేట్ అని గుర్తుంచుకోవాలి’’ అని సోనియా గాంధీ రాసుకొచ్చారు.