Land Dispute: దాయాదుల చేతిలో దారుణ హత్య
11 గుంటల భూమి విషయంలో ఘర్షణ
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఓ మహిళ పరిస్థితి విషమం
రంగారెడ్డి జిల్లా దండు మైలారం గ్రామంలో ఘటన
గొడ్డలితో అడ్డు వచ్చిన వారిపై వీరంగం
ఓ అధికార పార్టీ నేతపై ఆరోపణలు
స్వేచ్ఛ, రంగారెడ్డి బ్యూరో: భూ వివాదంలో (Land Dispute) ఒకరి ప్రాణం పోయింది.. మరో ముగ్గిరికి తీవ్ర గాయాలవ్వగా, అందులో ఓ మహిళా పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో ఆదివారం జరిగింది. 11 గుంటల భూమి ఒక వ్యక్తి నిండు ప్రాణం తీసింది. మరో మహిళ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడేలా చేసింది. పలువురికి గొడ్డలి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉసిగొల్పిన వారిపై హత్య కేసు నమోదు చేయాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
Read Also- Private school fee: బెంగళూరులో ఒకటో తరగతి పిల్లాడి స్కూల్ ఫీజు ఎంతో తెలిస్తే గుండెదడ ఖాయం!
దండుమైలారం గ్రామానికి చెందిన గుడేటి జంగయ్య అనే వ్యక్తికి సర్వేనెంబర్ 156, 158, 159లో 18 ఎకరాల 12 గుంటల భూమి ఉంది. ఈయనకు గుడేటి నరసింహ, గుడేటి మల్లయ్య, గుడేటి యాదయ్య, గుడేటి జంగయ్య అనే నలుగురు కొడుకులున్నారు. ఒక్కో భాగానికి నాలుగు ఎకరాల 23 గుంటల భూమి రావాల్సి ఉంది. అయితే, గుడేటి మల్లయ్య, గుడేటి జంగయ్యలకు 11 గంటల భూమి తక్కువగా వచ్చింది. గుడేటి నరసింహ, గుడేటి యాదయ్య అనే ఇద్దరికి 11 గుంటల భూమి ఎక్కువగా ఉండడంతో గత రెండు, మూడు సంవత్సరాలుగా దాయాదుల మధ్య గొడవ కొనసాగుతోంది. ఇటీవల ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. కాగా, గుడేటి మల్లయ్య, గుడేటి జంగయ్య కొడుకులు ఈ భూమి విషయమై నరసింహ, యాదయ్య వారసులను అడుగుతూనే వచ్చారు. ఈ క్రమంలో ఇరువురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరూ ఆ వివాదాస్పద భూమిలోకి వెళ్లకుండా 145 సెక్షన్ అమల్లో ఉంది. అయితే, ఆదివారం నాడు గుడేటి నరసింహ, గుడి యాదయ్య వారసులు సదరు వివాదాస్పదమైన భూమిలోకి వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గుడేటి మల్లయ్య, గుడేటి జంగయ్య వారసులు బాలరాజు, ధనరాజు, వెంకటరాజు, పావని, మంజుల అడ్డుకునేందుకు అక్కడికి వెళ్లారు. దాంతో గుడేటి నరసింహ, గుడేటి యాదయ్య వారసులైన గులేటి బాలరాజు, శ్రీశైలం, యాదయ్య, లింగస్వామి, ప్రసాద్, పద్మ, అర్చన, దేవకమ్మ, పారిజాత కలిసి ఒక్కసారిగా గుడేటి బాలరాజుపై గొడ్డలితో దాడికి దిగారు. పలుచోట్ల బలంగా నరికారు. విచక్షణ రహితంగా నరికి చంపారు. బాలరాజుపై గొడ్డలి దాడిని అడ్డుకోబోయిన బాలరాజు తమ్ముడి భార్య మంజులను సైతం వదల లేదు. ఆమెపై కూడా గొడ్డలితో దాడి చేశారు.
Read Also- Ram Charan: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భేటీ.. మ్యాటర్ ఏంటంటే?
ఈ దాడిలో గుదేటి బాలరాజు అక్కడికక్కడే తీవ్ర గాయాలతో పడిపోయాడు. అడ్డుపోయిన వెంకటరాజు, పావనిపై సైతం గొడ్డలి, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు. దాంతో వారు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. రక్తపు మడుగులో పడిపోయిన బాలరాజును ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గాయాల పాలైన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మంజుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఇబ్రహీంపట్నం ప్రైవేటు ఆసుపత్రి నుంచి నగరంలోని మరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంజుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నిందితులపై మృతుడి సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు తెలిపారు. ఇదిలావుంచితే, మల్లయ్య, జంగయ్య వారసులు సైతం తమపై దాడులు చేసినట్లు ఈ దాడిలో శ్రీశైలం, బాలరాజు, లింగస్వామి, యాదయ్య, పారిజాతలకు సైతం తీవ్ర గాలైనట్లు తెలుస్తోంది. వారు కూడా ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు.
ఈసీ శేఖర్ గౌడ్ పై కేసు నమోదు చేయాలి..
దాయాదుల దాడిలో మృతి చెందిన మల్లయ్య కుమారుడు బాలరాజు హత్యలో కీలక పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకుడు ఈసీ శేఖర్ గౌడ్‌ను అరెస్టు చేయాలంటూ మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి ముందు బాలరాజు మృతదేహాన్ని తరలించకుండా వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ భూవివాదం తెగకుండా నిందితుల పక్షాన ఈసీ శేఖర్ గౌడ్ వ్యవహరించి హత్యకు పురిగొల్పాడని ఆరోపించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు జోక్యం చేసుకొని ఆందోళనకారులతో చర్చించారు. ఏసీపీ జోక్యంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
పోలీస్ పికెటింగ్..
గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు సారాధ్యంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయాలపాలై చికిత్స పొందుతున్న ఆసుపత్రుల వద్ద సైతం పోలీస్ టికెట్ కొనసాగుతోంది. మరోవైపు మంజుల ఆరోగ్య పరిస్థితి సైతం ఆందోళనకరంగా ఉన్నట్లు వదంతులు వ్యాపించడంతో పోలీసు బందోబస్తు పెంచారు. ఎప్పటికప్పుడు ఇరు వర్గాలకు సంబంధించిన నాయకులతో చర్చలు జరుపుతూ శాంతియుత వాతావరణ కల్పించేందుకు ఏసీపీ ప్రయత్నాలు చేస్తున్నారు.