Vladimir Putin: భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కేంద్ర ప్రభుత్వం తమదైన శైలిలో ఆతిథ్యం ఇచ్చింది. అతిథులను భారతీయులు ఏ స్థాయిలో గౌరవిస్తారో ఆయనకు కళ్లకట్టింది. పుతిన్ ను ఆహ్వానించేందుకు స్వయంగా దిల్లీ విమానశ్రయానికి వెళ్లిన ప్రధాని.. అక్కడ భారతీయ సంప్రదాయ నృత్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం తన కారులో ఎక్కించుకొని తన నివాసానికి తీసుకెళ్లారు. గురువారం రాత్రి ప్రైవేటు విందు సైతం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా సంయుక్త మీడియా సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మీ అప్యాయతకు థ్యాంక్స్..
సాధారణంగా ఇద్దరు దేశాధినేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించినప్పుడు తమ మధ్య కుదిరిన ఒప్పందాల గురించి ప్రస్తావిస్తారు. కానీ పుతిన్ తన ప్రసంగం ప్రారంభంలో భారత్ ఇచ్చిన ఆతిథ్యం గురించి ప్రస్తావించారు. ‘భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి.. నా పట్ల, రష్యా ప్రతినిధి బృందం పట్ల చూపించిన ఆప్యాయత, సత్కార పూర్వక స్వాగతానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిన్న తన నివాసంలో మోదీ ఇచ్చిన విందుకు చాలా థ్యాంక్స్’ అంటూ పుతిన్ వ్యాఖ్యానించారు.
#WATCH | Delhi | Russian President Vladimir Putin says, "I thank President of India, Droupadi Murmu, Prime Minister of India and all our Indian colleagues for the warm and hospitable welcome accorded to the Russian delegation…I thank PM Modi for the dinner at his residence… pic.twitter.com/NfIY0tsKRj
— ANI (@ANI) December 5, 2025
‘నిరంతరాయంగా ఇంధనం సరఫరా చేస్తాం’
మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని భారత్ పై అమెరికా ఒత్తిడి తెస్తున్న వేళ పుతిన్ కీలక ప్రకటన చేశారు. విస్తరిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ఇంధన సరఫరాను నిరవధికంగా, నిరంతరాయంగా కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అంతర్జాతీయ చెల్లింపుల విషయంలో తమ దేశం క్రమంగా జాతీయ కరెన్సీ వినియోగం వైపు అడుగువేస్తున్నట్లు పుతిన్ అన్నారు. వాణిజ్య లావాదేవీలలో ఈ వాటా ఇప్పటికే 96 శాతానికి చేరుకున్నట్లు పుతిన్ గుర్తుచేశారు.
100 బిలియన్ డాలర్ల వాణిజ్యం
భారత్ – రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం గత ఏడాది 12 శాతం మేర పెరిగి కొత్త రికార్డును క్రియేట్ చేసినట్లు పుతిన్ పేర్కొన్నారు. తద్వారా 64 బిలియన్ డాలర్లకు చేరుకుందని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా అంతే స్థాయిలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. అదే సమయంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లే సామర్థ్యం తమకు ఉందని పుతిన్ అన్నారు. ప్రధాని మోదీ తమ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన అంశాలను అత్యంత ప్రాధాన్యత క్రమంలో పరిశీలిస్తామని పుతిన్ హామీ ఇచ్చారు.
Also Read: Rising Global Summit: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ వేదిక తొలి ఫొటో రిలీజ్.. మామూలుగా లేదుగా!
‘రక్షణ రంగంలో సాయం చేస్తున్నాం’
భారత్ లో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించే ప్రాజెక్టులోనూ తాము పనిచేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఆరు రియాక్టర్లలో మూడు ఇప్పటికే విద్యుత్ గ్రిడ్ కు అనుసంధానించబడినట్లు తెలిపారు. గత 50 ఏళ్లుగా భారత సైన్యం, వైమానిక, నౌకాదళాన్ని ఆధునీకరించేందుకు రష్యా తన వంతు సాయం చేస్తున్నట్లు పుతిన్ గుర్తుచేశారు. తాజాగా ప్రధాని మోదీతో జరిగిన సమావేశాల ఫలితాలపై తాను సంతృప్తిగా ఉన్నట్లు పుతిన్ తెలియజేశారు. భారత్, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరుదేశాల ప్రజలకు లాభదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు పుతిన్ తన ప్రసంగాన్ని ముగించారు.

