Rohit Sharma: టీమిండియా స్టార్ రోహిత్ శర్మ.. టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు కెప్టెన్ గా వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ వస్తున్నాడు. ఐపీఎల్ – 2025 తర్వాత రోహిత్ మైదానంలో కనిపించలేదు. భారత జెర్సీలో అయితే చివరిగా ఈ ఏడాది మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా మాత్రమే కనిపించాడు. దీంతో రోహిత్ రాక కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో వారి కోరిక నెరవేరబోతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లో భారత్-ఏ జట్టు తరపున రోహిత్ ఆడబోతున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి.
వచ్చే నెలలో బరిలోకి..
టీమిండియా అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్కడ మూడు వన్డేలు, 5 టీ-20 మ్యాచులు ఆడనుంది. ఈ సిరీస్ కు ముందు వార్మప్ గా అనధికార వన్డే సిరీస్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా భారత్ – ఏ (India A), ఆస్ట్రేలియా ఏ (Australia A) జట్లు మూడు వన్డేల్లో తలపడనున్నాయి. ఇప్పటికే ఆసీస్ తో వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతున్న రోహిత్.. ఈ అనధికార మ్యాచ్ లలో ఆడే అవకాశముందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 30, అక్టోబర్ 5, 6 తేదీల్లో జరిగే ఈ వన్డేల్లో రోహిత్ పాల్గొనే అవకాశం మెండుగా ఉన్నట్లు అభిప్రాయపడ్డాయి. మైదానంలో అడుగుపెట్టి చాలా రోజులు అయిన నేపథ్యంలో రోహిత్.. ప్రాక్టిస్ కోసం ఈ మ్యాచులు ఆడొచ్చని అంచనా వేశాయి. ఇదే జరిగితే రోహిత్ ను వచ్చే నెలలోనే మైదానంలో ఫ్యాన్స్ చూడొచ్చు.
‘2027 వరల్డ్‌కప్‌తో రోహిత్‌కు వీడ్కోలు’
వన్డేల్లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ కు సంబంధించి.. మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత రోహిత్ వీడ్కోలు పలికే అవకాశముందని అభిప్రాయపడ్డాడు. ఆ తర్వాత శుభ్ మన్ గిల్ కు బీసీసీఐ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తుందని అంచనా వేశారు. ఇదిలా ఉంటే తాజాగా గిల్ ను టీ-20ల్లో వైస్ కెప్టెన్ గా బీసీసీఐ ఎంపిక చేసింది. ఆసియా కప్ కోసం ప్రకటించిన భారత జట్టు జాబితాలో అతడికి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. టీమిండియా ఆడే అన్ని ఫార్మెట్లకు ఒకే కెప్టెన్ ఫార్ములాను అనుసరించాలని హెడ్ కోచ్ గంభీర్ భావిస్తున్నట్లు జాతీయ స్థాయిలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే టీ-20, వన్డేలకు సైతం గిల్ కెప్టెన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
రోహిత్ భవిష్యత్తు – గిల్ ఆధిపత్యం
రోహిత్ ఇప్పటికే T20, టెస్టుల నుంచి రిటైర్ అవ్వగా వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. కైఫ్ తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ ‘గత మూడు ఏళ్లలో గిల్ 2,000 పరుగులు చేశాడు. అతడు భవిష్యత్ కెప్టెన్. టెస్టులలో కెప్టెన్, T20లో వైస్ కెప్టెన్. రోహిత్ ఇప్పుడు వన్డే కెప్టెన్ గా ఉన్నారు. ఆయన దాదాపు 38 ఏళ్లకు వచ్చేశారు. నా అభిప్రాయం ప్రకారం ఆయన 2027 వరల్డ్‌కప్ తర్వాత రిటైర్ అవుతారు. అప్పుడే గిల్ కెప్టెన్ అవుతాడు’ అని కైఫ్ చెప్పుకొచ్చారు.
Also Read: Chinese Woman: జైలు శిక్ష తప్పించుకునేందుకు.. గర్భాన్ని ఆయుధంగా మార్చుకున్న మహిళ.. ఎలాగంటే?
గిల్‌కి లభించిన కొత్త అవకాశాలు
గిల్ గతేడాది జరిగిన T-20 వరల్డ్‌కప్ విజేత జట్టులో లేకపోయినా జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు కెప్టెన్‌గా వెళ్లాడు. ఆ తర్వాత అతడిని ప్రధానంగా వన్డేలు, టెస్టుల వైపు మళ్లించారు. ఇప్పుడు ఆసియా కప్ నకు వైస్ కెప్టెన్ గా బీసీసీఐ ఎంపిక చేసి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. 2024 జూలై తర్వాత గిల్ టీమిండియా తరపున తొలి టీ20 సిరీస్ ఆడబోతున్నాడు. మొత్తంగా రోహిత్ శర్మ ఆస్ట్రేలియా సిరీస్ కోసం సిద్ధమవుతుండటం, 2027 వరల్డ్ కప్ వరకూ వన్డేలు ఆడతాడన్న సంకేతాలు వినిపిస్తుండటంతో ఇప్పట్లో గిల్ కు వన్డే పగ్గాలు దక్కే అవకాశం లేదని అర్థమవుతోంది.