Plane Crash: మధ్యప్రదేశ్‌లో సియోని జిల్లా (Seoni district)లో ఓ శిక్షణ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. సోమవారం సాయంత్రం రెడ్ బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన ఒక విమానం.. అమ్గావ్ గ్రామం (Amgaon village)లో ప్రమాదానికి గురైంది. 33KV హై ఓల్టేజ్ వైర్ ను ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ట్రైనర్ పైలెట్ తో పాటు ఒక ట్రైనీ పైలెట్ గాయాలతో బయటపడ్డారు. అయితే విద్యుత్ తీగలపై శిక్షణ విమానం కూలిపోవడంతో ఏకంగా 90 గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయి.. రాత్రంతా చీకట్లో ఉండిపోయాయి.
పైలెట్ల పరిస్థితి ఎలా ఉందంటే?
ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం సుమారు 6.30 గం.ల ప్రాంతంలో జరిగింది. సుక్తారా ఎయిర్ స్ట్రిప్ (Suktara airstrip)లో ల్యాండింగ్ కు సిద్ధమవుతున్న క్రమంలో శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. వెంటనే అప్రమత్తమైన అమ్గావ్ గ్రామస్తులు హుటా హుటీన ప్రమాద స్థలికి పరిగెత్తుకొచ్చి విమానంలోని పైలెట్లను రక్షించారు. గాయపడ్డ ట్రైనర్ పైలెట్ అంజిత్ ఆంథోని (Ajit Anthony), ట్రైనీ పైలెట్ అశోక్ చావ్దా (Ashok Chawda)ను నాగ్ పూర్ ఆస్పత్రికి తరిలించారు. అయితే ప్రమాద సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని.. విద్యుత్ తీగ నుంచి నిప్పు రవ్వలు చిమ్మడం చూశామని స్థానికులు తెలిపారు.
90 గ్రామాలకు విద్యుత్ కట్
శిక్షణ విమానం ఢీకొట్టిన 33KV విద్యుత్ తీగ.. బాదల్పార్ సబ్‌స్టేషన్‌కు అనుసంధానమై ఉంది. విమానం రెక్క దానిని బలంగా తాకడంతో వైర్ పూర్తిగా తెగిపోయి దాని గుండా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో 90 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా రాత్రంతా ఆయా గ్రామాలు చీకట్లోనే ఉండిపోయాయని విద్యుత్ అధికారులు ధ్రువీకరించారు. ఉదయాన్ని విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు.
Also Read: Global Summit 2025: తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. రెండో రోజూ పెట్టుబడుల వెల్లువ.. రూ.1,04,350 కోట్ల ఒప్పందాలు
గతంలోనూ ఇంతే..
అయితే ఈ ప్రాంతంలో శిక్షణ విమానం కుప్పకూలడం ఇదే తొలిసారి కాదని గ్రామస్థులు చెబుతున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో విమాన శిక్షణ సంస్థలు ఉన్నట్లు చెప్పారు. ఈ ఏడాది మే నెలలో ఇద్దరు ట్రైనీ పైలెట్లు నడిపిన ఓ శిక్షణ విమానం.. రన్ వే దాటి బయటకు వచ్చిందని స్థానికులు పేర్కొన్నారు. కాగా విమాన ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

